Friday, 13 March 2015

ఆది కవి నన్నయ్య కాదు. పాల్కురికి సోమనాధుడే ఆదికవి - తెలంగాణా ప్రభుత్వం.

అయ్యో మహాత్మా నన్నయ్యా
ఎంత పని జరిగిందయ్యా
కొత్త కతలు పుట్టుకొచ్చేనయ్యా
కొంగొత్త ఆదికవి దొరికాడయ్యా ! 

11వ శతాబ్దానికి చెందిన నీకన్నా చిన్న
12-13 శతాబ్దుల మధ్య జీవించిన పాల్కురికి సోమనాధుడే మిన్న !
ఏన్ని రకాల పరిశొధనలు ఉన్నా,
వాటి సారమంతా నిండు సున్నా !

కొత్త ప్రభుత్వాలు ప్రాంతీయ విద్వేషాలని
ప్రాచీన కవులకు కూడా అంటకట్టాలని 
రాజకీయ రంగు పులుముకుని
సాహితీ వేత్తలు ఆదికవిని మార్చారు పూనుకుని !

నాటి గోదారికి తెనుగు ఆంధ్రమ్ము ఒక్కటే నని తెలుసు
అప్పటి కృష్ణమ్మకి తెలుగు వారంతా ఆంధ్ర జాతీయులని తెలుసు
సోమనాధునికీ నన్నయ్యకీ ఆంధ్ర భాషలో రచించుట తెలుసు
మరి ఇప్పుడో, మాండలికాన్ని కొత్త భాషగా మార్చడం తెలుసు

సోమనాధుని బసవ పురాణాన్ని తక్కువ చేయలేదు ఎన్నడూ 
పోతన్న భాగవత పద్యాలు విని పులకరించని వాడుండడు. 
నన్నయ్య భారతాన్ని వాగనుశాసనుడై ఆంధ్రీకరించినపుడు
ఆ శబ్ద శాసనుని అనువాద కవి యని తలచలేదెవ్వడూ !

గోదావరి భారత కధ నా ముందు మొదలైందని సంతోషిస్తే
పెన్నా తీరం, ఏకశిలా నగరం కవి బ్రహ్మ పద్యాలు విని పొంగిపోతే
గుండ్లకమ్మ దరిని అద్దంకి సంపూర్ణ భారతాన్ని చూసి మురిసిపొతే
జయ కావ్యాన్ని అనువాద గ్రంధమని ఛీ కొడుతున్నారు నేడు చూస్తే !

తెలుగు ప్రాచీన భాష అయితే మరి తెలంగాణా భాష ఏమిటి?
తెలుగు వారికి అక్షరాలు 56 అయితే మరి తెలంగాణా భాష సంగతో ?
ఆంధ్ర మహా భాగవతం ఇప్పుడు తెలంగాణా మహా భాగవతం గా మారుస్తారా ?
ఆంధ్రోల్లు వెరే జాతి అయినపుడు తెలంగాణా వారు  ఆంధ్ర మహా భారతాన్ని చదువుకోరా?

అయ్యో తెలుగు తల్లీ !  కవిత్రయానికి వక్ర బిరుదులు ఇస్తున్నారమ్మా !!
నీలో భాగాలైన మాండలికాన్ని వేరు భాషగా చూడలేమమ్మా 
తెలుగు వారికి కొత్త బుధ్ధులు పుట్టి పెడత్రోవ పడుతున్నారమ్మా
ఒక్కటిగా తెలుగు భాష వెలిగి బతుకు వెలిగించే దారిని చూపవమ్మా !! 

Tuesday, 9 April 2013

నేను కూడా అమెరికా వస్తున్నానోచ్!!

నేను కూడా అమెరికా వస్తున్నానోచ్!!

సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పని చేసేవారందరికీ ఒక్క సారైనా ఆన్ సైట్ వెళ్ళాలనీ, అందునా ప్రత్యేకంగా అమెరికా చూసి రావాలని కోరిక బలంగా ఉంటుంది ... నేను ఈ రంగంలోకి వచ్చిన 7 సంవత్సరాలకి అమెరికా చూడాలనే నా చిరకాల వాంఛ నెరవేరబోతోంది. మొదటిసారిగా దేశం దాటి అడుగు బయట పెడుతున్నాను ....


నేను ఓహియో రాష్ట్రంలో ఉన్న క్లేవ్ లాండ్ అనే ఊరికి వస్తున్నాను ... మన తెలుగు బ్లాగర్లు ఎవరైనా దగ్గరలో ఉంటే తెలియజేయండి ... తప్పక కలిసే ప్రయత్నం చేస్తాను. ఏ ఊరిలో ఉన్నా ... ఎంతైనా మన వాళ్ళు మన వాళ్ళే కదా !!






Monday, 6 August 2012

పుత్ర శోకం

చాలా రోజుల తరువాత బ్లాగు రాస్తున్నాను - భారమైన హృదయంతో!

పోయిన గురువారం నాడు మా పెద్ద బావగారి అబ్బాయి హార్ట్ అటాక్ తో చనిపోయాడు. చిన్నవయసులో అలా జరగడం నేను ఇప్పటివరకు వినలేదు. ఏదో చదువుకుని, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. 29 సంవత్సరాలు. పెళ్ళి చేయాలని సంబంధాలు కూడా వెతుకుతున్నారు, అంతలో ఇలా.....! ఆ ఇంటిలో వారి బాధ చూడలేక పోతున్నాము. అస్సలు ఆ తల్లిదండ్రులు కోలుకునేది ఎప్పుడు అని బాధగా ఉంది. మా పెళ్ళి అయినప్పటి నుంచీ మాతో చాలా బాగా కలివిడి గా ఉండేవాడు. మాకే ఇలా బాధగా ఉంటే - ఇక వారి బాధ ఏమి చెప్పాలి?

పెద్దవయసు వచ్చి, అనేక రోగాలతో బాధలు పడుతున్నవారందరికీ ఆయుష్షు ఇచ్చిన ఆ భగవంతుడు ఆ అబ్బాయికి ఇలాటి చావు ఎందుకు ఇచ్చాడో అని బాధ కలుగుతోంది. ఇంకో విషయం ఏమిటంటే - మా బావగారికి ముగ్గురు పిల్లలు. మొదట ఒక అమ్మాయి, తరువాత ఇద్దరు అబ్బాయిలు. 10 - 12 ఏళ్ళ వయసులో ఆ అమ్మాయి చనిపోయింది, ఇప్పుడేమో మరొక కొడుకు, ఇలా పుట్టిన పిల్లల్లో ఇద్దరు పోతే, ఎంత కష్టం? భగవంతుడు ఒకే ఒక మేలు చేసాడు, ఆ అబ్బాయి కి పెళ్ళి కాకుండానే తీసుకెళ్ళిపోయాడు. లేకపోతే ఒక ఆడపిల్ల జీవితం కూడా ఈ కుటుంబం తో పాటుగా నాశనం అయ్యేది, వీళ్ళు కూడా ఆ అమ్మాయి మొహం చూస్తూ ఇంకా బాధకు గురి అయ్యే వారు.


ఈ నాలుగు రోజులుగా నేను ఒకటే ప్రార్ధిస్తున్నా, ఆ దేవుడిని.... "ఇలాటి బాధ ఎవ్వరికీ రాకూడదు, కళ్ళముందే బిడ్డలు రాలిపోయి, మనకు వాళ్ళు చేయాల్సిన కర్మ కాండలన్నీ మనం వారికి చేసే దౌర్భాగ్యం ఎవ్వరికీ వద్దు." నా బ్లాగు ద్వారా, అందరినీ అలా ప్రార్ధించమని మరీ మరీ అర్ధిస్తున్నాను. ఎన్ని బాధలైనా పడవచ్చుగానీ, గర్భశోకం ఏ తల్లికీ వద్దు భగవంతుడా!!

Thursday, 10 February 2011

మా గోవిందుడు

మా కాలనీ వెంకటేశ్వర స్వామి కోవెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వామిని చూసి మది పులకించి - ఇలా పొంగి పొరలింది

చేరి కొలువరో ఈతడు గోవిందుడు

చేడెలతో కూడి నేడె గోవిందుడు

చేకొని మము కాపాడే గోవిందుడు

చేపట్టెను అతివలను గోవిందుడు

ఇందిరా వనిత మగడు గోవిందుడు

ఇందరికీ అభయమిచ్చు గోవిందుడు

ఇంతింతై పెరిగిన వామన గోవిందుడు

ఇందునందు ఎందు చూడ గోవిందుడు

మాపాలి దైవశిఖామణి గోవిందుడు

మాపాపములు హరించు గోవిందుడు

మాపుల రేపుల వెలిగే గోవిందుడు

మాపిల్లల నవ్వులలో గోవిందుడు

విరిబోణుల నడుమ శ్రీ గోవిందుడు

విరివిగా కరుణ పంచు గోవిందుడు

విరిబాణుని తండ్రి ఈ గోవిందుడు

విరిపూజలందే వేంకటేశ గోవిందుడు

Wednesday, 12 January 2011

తెలంగాన కాని తెలుగోల్లు మాత్రం అస్సలు సదువొద్దు

ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాన ప్రజల పైసలతోని గట్టింది. అండ్ల బెంగాలోడు సదువొచ్చు. బీహారోడు సదువొచ్చు. తమిలోడు సదువొచ్చు - గట్ల వేరే ఏ రాష్ట్రం కెల్లి వచ్చినోల్లైన సదువొచ్చు. తెలంగాన కాని తెలుగోల్లు మాత్రం అస్సలు సదువొద్దు. ఆ... ఏందీ ... ఏమంటున్రూ ... మల్ల ఐద్రబాదుల పుట్టి పెరిగినోల్ల సంగతేందంటరా ... గదే ... ఆడికే వస్తున్న... ఐద్రబాదుల పుట్టినా - వాల్ల అమ్మ నాయ్నలు ఈడోల్లె గావాలె. తాత ముత్తాతలు ఈడోల్లే గావాలె. తెలంగానల లేని జిల్లలకెల్లి ఈడకి బతకనికె వచ్చినోల్లయితె - గసుంటొల్లని అస్సలు ఈడ సదువనీయం. గీడ సదువాలంటే తాత ముత్తాలు - తర తరాలు - తెలంగానల స్వంత ఊరు అయినోల్లయితెనే రానిస్తం. లేకుంటె తరిమి తరిమి కొడుతం.

మల్లేంది జెప్తున్నవు... గా పోటీ పరిచ్చలల్ల మొదటి రాంకు వచ్చినాది ... అట్లయితే గిది బాజాప్తుగ సీమాంద్రోల్ల కుట్ర వల్లనే వచ్చినాది. 54 ఏళ్ళుగ మా నీల్లు దోచుకున్రు. మా సదువులు దోచుకున్రు. మా కొలువులు దోచుకున్రు. గందుకె మేమిప్పుడు మా యూనివర్సిటీల వాల్లని రానీయం. వస్తె వాల్ల సర్టిఫికేట్లు చింపుతం. వాల్ల మొకాన ఆసిడ్ పోస్తం. మా సీట్లు మావోల్లకే ఈయాలె. తాత ముత్తాతలు తెలంగానోల్లు గాకుంటె ఈడ పుట్టిన గా పిల్లలు తెలంగానోల్లు కారు.

అగ్గో మల్ల గట్ల సూడబట్టినవు - మమ్ముల దోసుకోలేదని శ్రీ క్రిష్ణ కమిటీ చెప్పినాది ... అరె వాడెవడు భయి చెప్పనికి? మాకు అన్యాయం జరిగిందని మేము చెబితే యెసుంటొడైన ఒప్పుకోవాలె. లేకుంటె ఊరుకోము. మా రాష్ట్రం మాకిచ్చేయున్రి. అంతనే మల్ల. రెండో మాట మేము ఇనం. ఇయ్యాల 1956 ముందు ఉన్న తెలంగాననే ఐద్రబాదు తో కల్పి మాకు గావాలె. ఏందిరో గట్ల మొకం చిట్లిస్తున్నవు - గప్పుడు కర్నాటకల మహారాష్ట్రల షామిలైన జిల్లాలు గూడ ఉన్నయంటవా ... గా ముచ్చట మాకు దెల్వదు. మేము వాల్లని తిట్టము. మా పోరాటం నా పక్క తెలుగోనితోనె. (మరి వీడైతెనె గద - నన్ను భరిస్తడు. పక్క రాష్ట్రాలలోల్లయితె లాగి నాలుగు తంతరు మల్ల).

మా తెలంగాన మాకీయుర్రి. మా ప్రాంతం మేము పాలించుకుంటం. మా యూనివర్సిటీలల్ల సీమాంద్రోల్లు సదువొద్దని జీవో పాసు చేస్తం. మా ఊర్లల్ల ఉన్న తెలంగాన కానోల్లని తరిమి తరిమి కొడ్తం. మా జాగలల్ల ఉన్న ఆస్తులు వదలి పొమ్మంటం. మా మాట ఇనకుంటె నిలువునా కాలవెడ్తం. మల్లీ గట్ల చూస్తవేందిరా ... నీ ... ఇగ నే చెప్ప. మా తీరే ఇంత మరి. మేమిట్లనే ఉంటం. అంతేగానీ మేము సదువం. కస్టపడం - అరె ఎందుకు కస్టపడాలె ? మా కే సీ ఆర్ అన్న మాకు కొలువులు ఇప్పిస్తడు. మాకు బుక్క వెట్టిస్తడు. నీల్లు తాపిస్తడు. మా పోరగాల్లను ఇంకా భడ్కాయిస్తడు. అంత గనం లీడరు మాకుండగ... మీ మాట మేమెందుకు ఇనాలె? జై తెలంగాన ... జై జై తెలంగాన.

నిన్న మా సహోద్యోగి తన భార్య పీ.హెచ్. డీ మౌఖిక పరీక్ష కోసం వెళితే తనకి చాలా భయానక అనుభవం ఎదురైంది. ఎలాగో తప్పించుకుని బయటపడింది. లేకుంటే చదువు సంగతి దేవుడెరుగు - వారి చేతిలోని ఆసిడ్ సీసాకి బలి అయి ఉండేది. విద్యార్ధుల ముసుగులో ఇలాటి అరాచకాలకు ఆకృత్యాలకు పాల్పడే వారిని ఏ చెప్పుతో కొట్టాలి? కనీస విచక్షణ లేని వీరు వేర్పాటు వాదం పేరు చెప్పుకొని గూండాగిరీ చేస్తున్నారు - ఛీ --!

Thursday, 23 December 2010

లేడీస్ టైలర్

ప్రతీ ఒక సందర్భానికీ చీరలు కొంటూనే ఉంటాము. కానీ చీర కొన్న తరువాతే మొదలవుతాయి అసలు బాధలు. చీర ఎంత అందంగా ఉన్నా, జాకెట్టు సరిగ్గా లేనిదే చీర అందమే చెడిపోతుంది కదా! ఆ జాకెట్ల కోసం పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఇంట్లో తమ జాకెట్లు తాము కుట్టుకునే వారు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది. చీర కొనేటప్పుడే - దానికి జాకెట్టు ఇచ్చాడో లేదో చూసుకోవడంతో మొదలవుతాయండీ కష్టాలు... ఒకవేళ జాకెట్టు ఇచ్చినా, అది ఎలా ఉందో చూసుకోవాలి... కొన్ని సార్లు చిన్న గుడ్డ ఇస్తారు. అలా కాకుండా జాకెట్టు గుడ్డ బాగుంటే అంతవరకూ మన పరిస్థితి నయమే ! అలా కాకుండా జాకెట్టు కూడా కొనాలనుకోండి, ఇక మన తిప్పలు ఆ బ్రహ్మ దేవుడికి ఎరుక. ఒక పక్క మనతో పాటు షాపింగుకి నసుగుతూ వచ్చిన పతిదేవులు తొందరగా కానిమ్మని హడావుడి పెడుతుంటే, చీరకు సరిపడ జాకెట్టు ముక్క వెతుక్కోవడంతో మన పుణ్య కాలం కాస్తా గడిచిపోతుంది. పోనీ మనకి ఎదో ఒక రకంగా చీరకు తగ్గ రంగు దొరికిందే అనుకుందాం - అది మనకు నచ్చని గుడ్డల రకంలో నే దొరుకుతుంది. అంటే - మనం టూ బై టూ అడిగితే పాలిస్టరు గుడ్డ దొరకడమో ; కాటన్ సిల్కు గుడ్డ అడిగితే మరింకేదో దొరకడమో కచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒకటి తీసుకుందూ, ఇంకా ఎన్ని చూస్తావు అని పక్కనే పలికే భర్తగారు మన బాధని అర్ధం చేసుకోలేరు. అక్కడనుచీ మన బాధలు మరింత రెట్టింపు అవుతాయి. చీర చాల్లే ఈ రోజుకి అని ఇంటికి వచ్చేస్తాము, మరోరోజు ఆ చీరని తీసుకుని, మాచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి తిరిగి, ఎట్టకేలకు, చిట్టచివరికి, తుట్టతుదకు - జాకెట్టు గుడ్డ సంపాదించేసరికీ తల ప్రాణం తోకకి వస్తుంది.

జాకెట్టు ముక్క ప్రహసనం అయిన తర్వాత మరో కొత్త రకం బాధ మొదలు. ఆ జాకెట్టు ని పట్టుకుని దర్జీల వెంట తిరగడం. ఒకడేమో - ఆ ముక్కని పైకీ, కిందకీ, తిప్పి - "అయ్యో అమ్మా, ఈ ముక్క మీకు సరిపోదమ్మా, ఇంకో పది పాయింట్లు ఎక్కువ గుడ్డ తెచ్చుకోవచ్చుకదా" అంటాడు. మరొకడి దగ్గరికి వెళ్తే, జాకెట్లు కుట్టాలంటే, టైం పడుతుందమ్మా - ఇంకో నెల దాకా ఇవ్వలేను అంటాడు. ఇంకోడు - ఈ మధ్య మేము జాకెట్లు కుట్టడం మానేశామమ్మా, రేట్లు అస్సలు సరిపోవట్లేదు (అక్కడికేదో వాడు ఫ్రీ గా కుట్టి పెడుతున్నట్లు) అంటాడు. మొత్తానికి అలా ఇలా కుట్టేవాడు దొరికినా, జాకెట్టు వాడు చెప్పే కుట్టు కూలీ విన్నాక కాసేపు మన "దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవడం" ఖాయం. మామూలు జాకెట్టు అయితె 100, లైనింగు వేసి కుడితే 200, లైనింగు గుడ్డకి మరో 30, డిజైను జాకెట్టు అయితే మరికొంత, ఇలా వాళ్ళ రక రకాల ధరల పట్టిక చూసి మనం ఈ చీర ఇప్పుడే కట్టుకోవడం అంత అవసరమా అని దీర్ఘంగా అలోచించి, ఈ సిటీలో ఇంతేలే, మన ఊరికి వెళ్ళినపుడు కుట్టించుకుందాములే - అక్కడ చవగ్గా కుడతారులే అని, మళ్ళీ బీరువాలో చీర, జాకెట్టు పెట్టేసి, గమ్మున బజ్జుంటాం. అంతలో పండగో, ఎదో సందర్భమో వస్తుంది, అప్పుడు మన శ్రీవారికి మన కొత్త చీర గుర్తుకి వస్తుంది - అంత కష్టపడి కొన్న చీర ఎందుకు కట్టుకోలేదు అని కాస్త బాధ పడి మన పుండు మీద కారం చల్లుతారు. ఇక ఊరికి వెళ్ళినప్పుడు జాకెట్టు కుట్టించుకుందామంటే, అక్కడా ప్రస్తుతం సిటీ కుట్టు కూలీలే ఉన్నాయని తెలుసుకుని, ఇంకా ఆలస్యం చేస్తే చీర చీకుడు పడుతుంది కనుక నోరు మూసుకుని ఎదో ఒక రకంగా జాకెట్టు కుట్టించుకోవల్సి వస్తుంది.

ఈ బాధలన్నీ పడలేక ఈ మధ్య నేను చేస్తున్న పని ఏమిటంటే, రెడీమేడ్ జాకెట్లు కొనుక్కోవడం. హైదరాబాదులో బడీ చౌడీలో చాలా దుకాణాలు ఉన్నాయి. అక్కడ కుట్టి ఉంచిన జాకెట్లు దొరుకుతాయి. ధర కూడా పర్లేదు. మనం జాకెట్ ముక్క కొని, కుట్టించడానికి ఎంత ఖర్చు అవుతుందో అంతకన్న ఒక 10 రూపాయలు తక్కువే. కాకుంటే కొందరికి ఆ కుట్టిన జాకెట్లు సరిగ్గా అతకకపోవచ్చు. కొందరికి చేతులు పొట్టిగా, జాకెట్టు పొడుగ్గా ఇలా రక రకాలు అలవాటు ఉన్న వారికి మాత్రం కుదరదు కానీ, మామూలు జాకెట్లు వేసుకునేవారు హాయిగా చీర తీసుకెళ్ళి కావలసిన రకపు జాకెట్టు తెచ్చుకోవచ్చు. మంచి జరీ జాకెట్లు, ఇప్పుడు వస్తున్న బనారస్ జాకెట్లు కూడా దొరుకుతాయండీ. లేకుంటే మరీ టైలర్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జాకెట్టు కుట్టడానికి 200 ఏమిటండీ బాబూ, మా బడీచౌడీ లో మంచి పట్టు జాకెట్టు, లైనింగ్ వేసి కుట్టినది, 200 రూపాయలకి దొరుకుతుంది. అక్కడ మరో మంచి సౌకర్యం కూడా ఉన్నదండీ ... రెండు మూడు షాపుల్లో గంటలో జాకెట్టు కుట్టి ఇస్తామని రాసి ఉంటారు - మరీ గంటలో కాకున్నా, కనీసం పొద్దున్న ఇస్తే మన పనులన్నీ చూసుకొని, సాయంత్రనికి వెళితే - జాకెట్టు కుట్టి ఇస్తారు. మనం ఆది జాకెట్టు సరైనది ఇవ్వాలి - చక్కగానే కుడతారు.

ఈ బాధలన్నీ పడలేక నేను జాకెట్లు కుట్టడం అర్జెంట్ గా నేర్చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నాననుకోండి! కాకుంటే నేర్చుకునే తీరికే కనబడట్లేదు. ఏదో - గుడ్డిలో మెల్ల సామెతగా, నా డ్రస్సులు నేనే కుట్టుకుంటాను కనుక అది కాస్త మేలు. లేకుంటే - మన దర్జీల ధరలకి డ్రస్సులు కుట్టించుకోవడం కూడానా! పంజాబీ డ్రస్సులు కుట్టడానికి కూడా టైలరును బట్టీ 100 నుంచీ 300 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు - కాకుంటే, డ్రస్సు కాస్త పెద్ద గుడ్డ, సల్వార్, కమీజు రెండూ కుట్టాలి కనుక కాస్త నయం అనుకోవచ్చ్హు. మరీ జాకెట్టుకు 200, 300 కుట్టుకూలీ ఏమిటండీ!!మొత్తానికి మా కాలనీలో ఒక కుట్టు మిషను తో మొదలు పెట్టిన టైలరు షాపు - దిన దిన ప్రవర్ధమానమై, 3 జాకెట్లూ 6 పంజాబీ డ్రస్సులు గా వర్ధిల్లుతూ ఉంది. దాన్ని ఆదర్శంగా తీసుకుని మరో నాలుగు లేడీస్ టైలర్లు వెలిశారు.

అస్సలు ఇంత సోది ఎందుకు చెప్పానంటే, పోయిన సంవత్సరం మా గృహప్రవేశానికి అందరూ మాకు బట్టలు పెట్టారు. అందరూ పెట్టిన చీరల్ని కట్టుకోవాలి కదా, చచ్చినట్లు వాటికి జాకెట్లు కుట్టించుకోవాలని చూస్తే - వేల రూపాయల బిల్లు అయ్యేటట్లు ఉంది. అందుకని కొన్ని చీరలకి మంచి రెడీమేడ్ జాకెట్లు కొనేసుకొని, మంచి జాకెట్టు ముక్కలు మా అమ్మాయికి గౌన్లు, పావడాలు కుట్టేశా :-). అందుకే ఈ బాధలు పడలేక మరో 15 రోజుల్లో జాకెట్టు కుట్టడం నేర్చేసుకుని, జాం జాం అని మా అత్తగారికీ, నాకూ సంక్రాంతి పండగకి జాకెట్లు కుట్టేసుకోవాలని తెగ ప్రయత్నించేస్తున్నాను. మరి ఎంత కుదురుతుందో ... చూద్దాం.

Thursday, 16 December 2010

తెలుగు చేనేతలు - పోచంపల్లి

ఈ మధ్య అస్సలు నా టపాలే లేవు. మామూలుగానే నా బ్లాగు చదివే వారు అంతంత మాత్రం. ఇక ఈ మధ్య అస్సలు కుదరక ఏమీ రాయనేలేదు. ముఖ్యంగా నా 50వ టపా మంచి విషయంపైన రాయాలని ఇన్నాళ్ళూ ఆగిపోయాను. ఎలాగూ తెలుగు బ్లాగర్లందరమూ పుస్తక ప్రదర్శనలో కలుస్తాము కదా - అప్పుడు నా బ్లాగు పేరు చెబితే ఎవ్వరికీ గుర్తు రానేమో అని అనుమానం కూడా కాస్త కలిగింది కూడాను! దాని పర్యవసానమే ఈ టపా!

మన తెలుగు నేల చేనేతలకి పెట్టింది పేరు. ఇంతకు ముందు ఈ ఫాషను ప్రపంచం ఇంత లేని రోజుల్లో కూడ మన చేనేతలు ప్రపంచ ప్రసిధ్ధి పొందాయి. నా మటుకు నాకు అస్సలు ఇన్ని రకాల చేనేతలు మరో ఏ రాష్ట్రం లోనూ ఉన్నాయా అని సందేహం కలుగుతుంది అప్పుడప్పుడూ. కాస్తో కూస్తో వేరే రాష్ట్రాల నుంచీ మనకు తెలిసిన మంచి చేనేతలు ఉన్నా, మన వాళ్ళలా మాత్రం ఎవ్వరూ నేయలేరని నాకు చాలా నిశ్చిత అభిప్రాయం. పైగా చిన్నప్పటినుంచీ మా అమ్మమ్మ, నాయనమ్మ చేనేత చీరలే కట్టటం చూడటం వల్ల, అవంటే మరీ ఇష్టం పెరిగిపోయింది. ఎప్పుడో నేను చేనేత చీరలపై కవిత రాసి, మీ ముందు ఉంచిన టపా ఉన్నా, మళ్ళీ నాకు తెలిసిన చేనేతల గురించి వ్రాయాలనిపించింది. అలా మన సంస్కృతిలోని ఒక మంచి హస్తకళ గురించి చెప్పినట్లూ ఉంటుంది, నేతన్నల వెతలు చూసి, కాస్తైనా మన బాధ్యతగా, వారంలో ఒక రోజు మనం చేనేతలు ధరిద్దామని గుర్తు చేద్దామని అనిపించింది.ఒక్కో చేనేత గురించీ ఒక్కో టపా అవుతుందేమో అనిపించి ఈ టపాల పరంపరని మొదలు పెడుతున్నాను. కనీసం వారానికి ఒకటి అయినా రాద్దామని అనుకుంటుంటున్నాను.

మొదటగా నేను పోచంపల్లి చేనేతల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. మొదటగా పోచంపల్లినే ఎన్నుకోడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది. మన చేనేతల్లో మొట్ట మొదటగా పేటెంట్ హక్కులు పొందిన ప్రత్యేకత దీనికి ఉంది. అస్సలు ఆ నేతలో ఎన్ని పొందు పరుస్తారో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ రంగుల దారాల్లో నెమళ్ళు నర్తిస్తాయి. చిలుకలు నవ్విస్తాయి. ఏనుగులు గంభీరంగా నిలబడతాయి. పూవులు విరబూస్తాయి. ఆకులు రెపరెపలాడుతాయి. రకరకాల ఆకృతులు మన ముందు ఆవిష్కరింపబడతాయి. భారీ జరీలు నిండిన చీరలకు విరుధ్ధంగా, రంగుల మాయాజాలానికే ప్రాధాన్యత ఉంటుంది.

బట్టలు నేసిన తరువాత రంగులద్దడం చాలా సులువు. కానీ పోచంపల్లి నేత ప్రత్యేకత ఏమిటంటే, నేయడానికి తీసి పెట్టుకున్న దారానికి రంగులద్ది, దాని తరువాత నేస్తారు. పడుగు, పేక సమంగా కలవకుంటే, ఆ అకృతి నేతలో రానే రాదు. చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రక్రియ కనుకనే పేటెంట్ లభించింది. వీటి ధరలు కూడా నేతలో ఆకృతులు పెరిగే కొద్దీ పెరుగుతుంటాయి. నూలు, పట్టు రకాలలో ఈ చేనేతలు అందుబాటులో ఉన్నాయి. మహిళల చీరల భండాగారంలో ఎన్ని రకాలు ఉన్నా, పోచంపల్లి పట్టుచీర లేకపోతే ఏదొ తక్కువైనట్లు భావించేవారు చాలా మంది తారసపడతారు. పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకే కాకుండా, రోజువారీగా కట్టుకోడానికి హుందాగా ఉంటాయని వీటిని ఎక్కువగా ఉద్యోగినులు ఇష్టపడటం కద్దు.

పోచంపల్లి మన భాగ్య నగరానికి చాలా చేరువలో ఉంది. హైదరాబాదు కి 50 - 60 కి.మీ. ల దూరంలో పోచంపల్లి గ్రామం ఉంది. మనం ఆ ఊరికి వెళ్ళి చేనేతలు కొనుక్కుంటే తక్కువలో లభిస్తాయని అంటారు. అస్సలు ఇలాటి ప్రదేశాలని మంచి పర్యాటక ప్రదేశంగా అభివృధ్ధి చేయవచ్చేమో అనిపిస్తుంది. మనం కట్టుకునే బట్టలు ఎంత కష్టపడి నేస్తే ఇంత అందంగా తయారు అయ్యాయో తెలుకునే అవకాశం కలుగుతుంది కదా!! పోచంపల్లి గ్రామానికి మరో విశిష్టత కూడా ఉంది. అది భూదాన్ ఉద్యమం తో ముడిపడి ఉంది. భూదాన్ ఉద్యమం ఇక్కడనుంచే ప్రారంభం అయినదానికి గుర్తుగా ఈ ఊరి పేరు "భూదాన్ పోచంపల్లి" గా మారిపోయింది. ఆచార్య వినోభా భావే మందిరం కూడా పోచంపల్లి లో ఉంది.

హైదరాబాదునుంచీ ఆటవిడుపుగా మౌంట్ ఒపేరా లేక రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలని వెళ్ళేవారు - అదే దారిని వెళ్ళి పోచంపల్లిని కూడా ఒకసారి చూసి రావచ్చు. అలాగే ఇంట్లో శుభకార్యాలేవైనా ఉంటే, పోచంపల్లి గ్రామానికే వెళ్ళి పట్టుచీరలు కొనుక్కురావచ్చు. మనం అక్కడ కొంటే చవకగా కొనుక్కోడమే కాకుండా దళారీలకి చెల్లించేది తగ్గి, నేతన్న కి కాస్త లాభిస్తుంది కదా!!

పోచంపల్లి చేనేతలంటే కేవలం చీరలే కాదండోయ్, డ్రస్ మెటీరియల్, కిటికీలకి ద్వారాలకీ తెరలు, దుప్పట్లు, దిండుగలీబులు, దీవాన్ పై పరిచేందుకు దుప్పట్లు, మగవారికి రక రకాల పట్టు చొక్కా గుడ్డలు, పోచంపల్లి నేత గుడ్డలతో కుట్టిన చేతి సంచులు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. "అవును - వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు" సినిమా సెట్టింగులో దుప్పట్లు, కర్టెన్లు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎంత బాగున్నాయో కదా! మరి, మిమ్మల్ని, మీ ఇంటిని అందంగా మార్చేయడానికి పోచంపల్లి ఎప్పుడు వెళ్తున్నారు?