Thursday 23 December 2010

లేడీస్ టైలర్

ప్రతీ ఒక సందర్భానికీ చీరలు కొంటూనే ఉంటాము. కానీ చీర కొన్న తరువాతే మొదలవుతాయి అసలు బాధలు. చీర ఎంత అందంగా ఉన్నా, జాకెట్టు సరిగ్గా లేనిదే చీర అందమే చెడిపోతుంది కదా! ఆ జాకెట్ల కోసం పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఇంట్లో తమ జాకెట్లు తాము కుట్టుకునే వారు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది. చీర కొనేటప్పుడే - దానికి జాకెట్టు ఇచ్చాడో లేదో చూసుకోవడంతో మొదలవుతాయండీ కష్టాలు... ఒకవేళ జాకెట్టు ఇచ్చినా, అది ఎలా ఉందో చూసుకోవాలి... కొన్ని సార్లు చిన్న గుడ్డ ఇస్తారు. అలా కాకుండా జాకెట్టు గుడ్డ బాగుంటే అంతవరకూ మన పరిస్థితి నయమే ! అలా కాకుండా జాకెట్టు కూడా కొనాలనుకోండి, ఇక మన తిప్పలు ఆ బ్రహ్మ దేవుడికి ఎరుక. ఒక పక్క మనతో పాటు షాపింగుకి నసుగుతూ వచ్చిన పతిదేవులు తొందరగా కానిమ్మని హడావుడి పెడుతుంటే, చీరకు సరిపడ జాకెట్టు ముక్క వెతుక్కోవడంతో మన పుణ్య కాలం కాస్తా గడిచిపోతుంది. పోనీ మనకి ఎదో ఒక రకంగా చీరకు తగ్గ రంగు దొరికిందే అనుకుందాం - అది మనకు నచ్చని గుడ్డల రకంలో నే దొరుకుతుంది. అంటే - మనం టూ బై టూ అడిగితే పాలిస్టరు గుడ్డ దొరకడమో ; కాటన్ సిల్కు గుడ్డ అడిగితే మరింకేదో దొరకడమో కచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒకటి తీసుకుందూ, ఇంకా ఎన్ని చూస్తావు అని పక్కనే పలికే భర్తగారు మన బాధని అర్ధం చేసుకోలేరు. అక్కడనుచీ మన బాధలు మరింత రెట్టింపు అవుతాయి. చీర చాల్లే ఈ రోజుకి అని ఇంటికి వచ్చేస్తాము, మరోరోజు ఆ చీరని తీసుకుని, మాచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి తిరిగి, ఎట్టకేలకు, చిట్టచివరికి, తుట్టతుదకు - జాకెట్టు గుడ్డ సంపాదించేసరికీ తల ప్రాణం తోకకి వస్తుంది.

జాకెట్టు ముక్క ప్రహసనం అయిన తర్వాత మరో కొత్త రకం బాధ మొదలు. ఆ జాకెట్టు ని పట్టుకుని దర్జీల వెంట తిరగడం. ఒకడేమో - ఆ ముక్కని పైకీ, కిందకీ, తిప్పి - "అయ్యో అమ్మా, ఈ ముక్క మీకు సరిపోదమ్మా, ఇంకో పది పాయింట్లు ఎక్కువ గుడ్డ తెచ్చుకోవచ్చుకదా" అంటాడు. మరొకడి దగ్గరికి వెళ్తే, జాకెట్లు కుట్టాలంటే, టైం పడుతుందమ్మా - ఇంకో నెల దాకా ఇవ్వలేను అంటాడు. ఇంకోడు - ఈ మధ్య మేము జాకెట్లు కుట్టడం మానేశామమ్మా, రేట్లు అస్సలు సరిపోవట్లేదు (అక్కడికేదో వాడు ఫ్రీ గా కుట్టి పెడుతున్నట్లు) అంటాడు. మొత్తానికి అలా ఇలా కుట్టేవాడు దొరికినా, జాకెట్టు వాడు చెప్పే కుట్టు కూలీ విన్నాక కాసేపు మన "దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవడం" ఖాయం. మామూలు జాకెట్టు అయితె 100, లైనింగు వేసి కుడితే 200, లైనింగు గుడ్డకి మరో 30, డిజైను జాకెట్టు అయితే మరికొంత, ఇలా వాళ్ళ రక రకాల ధరల పట్టిక చూసి మనం ఈ చీర ఇప్పుడే కట్టుకోవడం అంత అవసరమా అని దీర్ఘంగా అలోచించి, ఈ సిటీలో ఇంతేలే, మన ఊరికి వెళ్ళినపుడు కుట్టించుకుందాములే - అక్కడ చవగ్గా కుడతారులే అని, మళ్ళీ బీరువాలో చీర, జాకెట్టు పెట్టేసి, గమ్మున బజ్జుంటాం. అంతలో పండగో, ఎదో సందర్భమో వస్తుంది, అప్పుడు మన శ్రీవారికి మన కొత్త చీర గుర్తుకి వస్తుంది - అంత కష్టపడి కొన్న చీర ఎందుకు కట్టుకోలేదు అని కాస్త బాధ పడి మన పుండు మీద కారం చల్లుతారు. ఇక ఊరికి వెళ్ళినప్పుడు జాకెట్టు కుట్టించుకుందామంటే, అక్కడా ప్రస్తుతం సిటీ కుట్టు కూలీలే ఉన్నాయని తెలుసుకుని, ఇంకా ఆలస్యం చేస్తే చీర చీకుడు పడుతుంది కనుక నోరు మూసుకుని ఎదో ఒక రకంగా జాకెట్టు కుట్టించుకోవల్సి వస్తుంది.

ఈ బాధలన్నీ పడలేక ఈ మధ్య నేను చేస్తున్న పని ఏమిటంటే, రెడీమేడ్ జాకెట్లు కొనుక్కోవడం. హైదరాబాదులో బడీ చౌడీలో చాలా దుకాణాలు ఉన్నాయి. అక్కడ కుట్టి ఉంచిన జాకెట్లు దొరుకుతాయి. ధర కూడా పర్లేదు. మనం జాకెట్ ముక్క కొని, కుట్టించడానికి ఎంత ఖర్చు అవుతుందో అంతకన్న ఒక 10 రూపాయలు తక్కువే. కాకుంటే కొందరికి ఆ కుట్టిన జాకెట్లు సరిగ్గా అతకకపోవచ్చు. కొందరికి చేతులు పొట్టిగా, జాకెట్టు పొడుగ్గా ఇలా రక రకాలు అలవాటు ఉన్న వారికి మాత్రం కుదరదు కానీ, మామూలు జాకెట్లు వేసుకునేవారు హాయిగా చీర తీసుకెళ్ళి కావలసిన రకపు జాకెట్టు తెచ్చుకోవచ్చు. మంచి జరీ జాకెట్లు, ఇప్పుడు వస్తున్న బనారస్ జాకెట్లు కూడా దొరుకుతాయండీ. లేకుంటే మరీ టైలర్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జాకెట్టు కుట్టడానికి 200 ఏమిటండీ బాబూ, మా బడీచౌడీ లో మంచి పట్టు జాకెట్టు, లైనింగ్ వేసి కుట్టినది, 200 రూపాయలకి దొరుకుతుంది. అక్కడ మరో మంచి సౌకర్యం కూడా ఉన్నదండీ ... రెండు మూడు షాపుల్లో గంటలో జాకెట్టు కుట్టి ఇస్తామని రాసి ఉంటారు - మరీ గంటలో కాకున్నా, కనీసం పొద్దున్న ఇస్తే మన పనులన్నీ చూసుకొని, సాయంత్రనికి వెళితే - జాకెట్టు కుట్టి ఇస్తారు. మనం ఆది జాకెట్టు సరైనది ఇవ్వాలి - చక్కగానే కుడతారు.

ఈ బాధలన్నీ పడలేక నేను జాకెట్లు కుట్టడం అర్జెంట్ గా నేర్చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నాననుకోండి! కాకుంటే నేర్చుకునే తీరికే కనబడట్లేదు. ఏదో - గుడ్డిలో మెల్ల సామెతగా, నా డ్రస్సులు నేనే కుట్టుకుంటాను కనుక అది కాస్త మేలు. లేకుంటే - మన దర్జీల ధరలకి డ్రస్సులు కుట్టించుకోవడం కూడానా! పంజాబీ డ్రస్సులు కుట్టడానికి కూడా టైలరును బట్టీ 100 నుంచీ 300 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు - కాకుంటే, డ్రస్సు కాస్త పెద్ద గుడ్డ, సల్వార్, కమీజు రెండూ కుట్టాలి కనుక కాస్త నయం అనుకోవచ్చ్హు. మరీ జాకెట్టుకు 200, 300 కుట్టుకూలీ ఏమిటండీ!!మొత్తానికి మా కాలనీలో ఒక కుట్టు మిషను తో మొదలు పెట్టిన టైలరు షాపు - దిన దిన ప్రవర్ధమానమై, 3 జాకెట్లూ 6 పంజాబీ డ్రస్సులు గా వర్ధిల్లుతూ ఉంది. దాన్ని ఆదర్శంగా తీసుకుని మరో నాలుగు లేడీస్ టైలర్లు వెలిశారు.

అస్సలు ఇంత సోది ఎందుకు చెప్పానంటే, పోయిన సంవత్సరం మా గృహప్రవేశానికి అందరూ మాకు బట్టలు పెట్టారు. అందరూ పెట్టిన చీరల్ని కట్టుకోవాలి కదా, చచ్చినట్లు వాటికి జాకెట్లు కుట్టించుకోవాలని చూస్తే - వేల రూపాయల బిల్లు అయ్యేటట్లు ఉంది. అందుకని కొన్ని చీరలకి మంచి రెడీమేడ్ జాకెట్లు కొనేసుకొని, మంచి జాకెట్టు ముక్కలు మా అమ్మాయికి గౌన్లు, పావడాలు కుట్టేశా :-). అందుకే ఈ బాధలు పడలేక మరో 15 రోజుల్లో జాకెట్టు కుట్టడం నేర్చేసుకుని, జాం జాం అని మా అత్తగారికీ, నాకూ సంక్రాంతి పండగకి జాకెట్లు కుట్టేసుకోవాలని తెగ ప్రయత్నించేస్తున్నాను. మరి ఎంత కుదురుతుందో ... చూద్దాం.

3 comments:

జ్యోతి said...

నేనైతే ఇంచక్కా కుట్టేసుకుంటాను.కాని ఇప్పుడు ఎవరైనా కుట్టిపెడితే బావుండు అనిపిస్తుంది. మనకు ఎలాగూ డిజైన్లు,వర్క్ లు అంటూ గొడవ లేదు కాబట్టి రెడిమేడ్ కొనుక్కోవడమే మేలనిపిస్తుంది..

విరజాజి said...

నిజమే జ్యోతి గారూ. అమ్మ దగ్గర ఉన్నన్ని రోజులూ అస్సలు ఇబ్బంది పడలేదు. మా ఇద్దరిలో ఎవరు చీర కొనుక్కున్నా రెండు జాకెట్లు కుట్టుకునేవాళ్ళం. కొన్ని సార్లు అయితే చీర కొనుక్కొచ్చిన మర్రోజు లోపు ఫాల్, జాకెట్టు కుట్టేసుకుని మరునాడే కట్టుకున్న సందర్భాలు కూడా ఉన్న్నాయి. తను జాకెట్టు కత్తిరించి ఇచ్చేస్తే నేను కుట్టేసుకునేదాన్ని. కాకుంటే ఇప్పుడు అమ్మ కూడా పాపం కుట్టుకునే ఓపిక లేక రెడీమేడ్ తెచ్చేసుకుంటోంది. ఒక్కోసారి నాకు ఏదైనా చీర కొనిందంటే అది విత్ బ్లౌజ్ చీర అయినా ముందు ఒక సాదా జాకెట్టు కొనుక్కొచ్చేస్తోంది. అన్నట్లు టపా లో చ్ప్పడం మరచిపోయాను - ఆషాఢ మాసంలో కొన్ని దుకాణాల్లో కుట్టిన జాకెట్లు కూడా డిస్కౌంట్ లో దొరుకుతాయి. అప్పుడు రోజూ కట్టుకునే చీరల మీదకి కాసిన్ని ముదురు రంగు జాకెట్లు నాకూ, మా అమ్మకి కూడా కొనుక్కొచ్చేస్తూ ఉంటాను :-)

Shallow Meadow said...

e ready made jacketlu intha cheap ga osthayani naku teledu... nenu ready made jackets online lo chusthe okkoti 1500 to 2000 unnai... Monna nenu oka cheera design chekunna... u wont bliv me... 6 yrs gaa naku evvadu jacket sarigga kuttadam ledu.. andukani pothe poyaayi paadu dabbulu jacket sakramanga okkadayina kudithe baagunnu ani "Taruni" lo icchaanu... Kaastha ekkuve kharchu ayinaa, Nenu anukunatle kuttaadu.. Inko vishayam meeru cheppadam marchipoyaaru.. Prathi intiki oka aasthaana pooojaari annattugaa, prati intiki oka aasthaana jacket kutte vaadu untaadu... Aasthaana tailor anamaata.. aa intillapaadi aadavaarantha aayanakoo/aameko thama pico la nundi jacket la daaka isthuntaaru... "maaku veedu thappa evvadu kuttadu sarigga, Aaadi jacket isthe kacchitham ga acchuguddhinatlu kuttisthadu, nu kuda veediki ivvacchu" ani chepthuntaaru vaallu.. oho nijamegaavaala ani manam aa tailor ki jacket isthee, vaadu mana jacket ni enni vidhaalu ga chedagottaalo anni vidhaaluga kuttipedathaadu... Manaki malli BP raise. Naaku inkaa aasthaana tailor dorakaledu... dorike varaku anveshisthune unta unta.. undi teerutha..