Monday 25 August 2008

ఎడతెగని రాత్రి.

చిన్నపుడూ నిద్ర పట్టలేదు.... ఇప్పుడూ నిద్ర పట్టట్లేదు...... కానీ రెండిటికీ ఎంత తేడా!! వేసవిలో మండే పగటి తాపాన్ని తీర్చుకోడానికి ఆరుబయట మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళం. ఆ రాత్రి పూట పది గంటలు దాటితే గాని కాస్తంత చల్ల గాలి వీచేది కాదు... ఒక రాత్రిలో మెలకువ వచ్చి చూస్తే, ఎదురుగా ఉన్నా కొబ్బరాకుల సందులోనించి తొంగి చూస్తూ చందమామ నవ్వుతూ కనిపించే వాడు. ఆ సమయం లో "రాత్రి రాణి" పూల ఘుమఘుమలు మా పక్కింటి నుంచి గాలిలో తేలి వచ్చేవి. మళ్ళీ నిద్రపోతే ఆ సంతోషమంతా ఎక్కడ పోతుందో అని, ఊరికే పడుకొని, ఆకాశంలోకి చూస్తూ, చుక్కలతో చెప్పుకున్న కబురులన్నీ గురుతు వస్తే, ఎనలేని బాధ కలుగుతూ ఉంది. ఇప్పుడు,...., ఇల్లు ఇరుకు... మనసులూ ఇరుకు. పైనా మనది కాదు, కిందా మనది కాని త్రిశంకు స్వర్గం (ఏది ఎలా ఉన్నా, ఇల్లే కదా స్వర్గ సీమ !!) లో, పగలూ, రాత్రీ, తేడా తెలీని పని తో సతమతం అయిపోతూ, పిల్లలని కూడా మనతో పాటు గా, కాలికి మట్టి అంటకుండా పెంచుకుంటూ, వాళ్ళకి చందమామని కిటికీ లోంచి చూపిస్తూ (ఏ బహుళ అంతస్తుల భవంతీ అడ్డం రాకుంటే), ఒక్కోసారి ఆ చిన్న కిటికీ తలుపులనీ మన మనసుల్లా ఏ దారీ లేకుండా మూసేసుకుని, ఉక్కిరిబిక్కిరి అయిపోతూ, ఆ చిరాకు ఎవరి మీద ప్రదర్శించాలో తెలీక, పడుకున్న నిద్ర పట్టక, మెత్తటి స్పాంజి పరుపులపై కూడా పక్క కుదరక, రాత్రంతా దొర్లుతూ, మళ్ళీ పొద్దున్నే, అదే నిద్ర మొహం తో ఉద్యోగాలకి తయారవుతూ, యంత్రాల్లా ... ఏదో ఒకలా బతుకుతూనే ఉన్నాం.

Wednesday 13 August 2008

కొత్త టపా

కొత్త కొత్త సంగతులు తెలుసుకోడానికి కొత్త స్నేహితులని కలుసుకోడానికి కొత్త మార్గం దొరికింది. అనుకోకుండా...!!