Thursday 2 April 2009

చిన్నారి సీతా-రాముల పెండ్లి

శ్రీ రామచంద్రుని పెండ్లి వేడుక నేడు - అరసి శ్రీ రామ నవమి యదె నేడు
సిరుల మిధిలా పురి మురిసె చూడు - అల సొంపైన పెండ్లి వేదిక యదె చూడు
.
ముక్కంటి విల్లు విరిచె విలుకాడు - పెండ్లి కొడుకై అమరె సీతమ్మకీనాడు
మొలకనవ్వుల ముద్దు మోమున్న ఱేడు - పొరలే నవ్వుల తల్లికి మొగడౌను నేడు
.
మల్లె పూల జడ నడుమన చామంతి బిళ్ళ - తాకింది తాళి కట్టే రాముని వ్రేళ్ళ
ఎల్లకాలము సీతమ్మ మేను వీడక - చూడామణి నిలిపేను రామ స్పర్శా వీచిక
.
తలబ్రాలు పోసుకున్న దోసిళ్ళు - అన్యోన్య దాంపత్యానికి ఆనవాళ్ళు
తలపుల వలపుల పెళ్ళి పందిళ్ళు - అలవికాని ఆనందాల సందళ్ళు
.
చీరసారెలతోను చిరకాలమగు పెండ్లి - చిరు ఆశల నెరవేర్చు పెండ్లి
చింతలన్నియు పారద్రోలు పెండ్లి - చిన్నారి సీతా-రాముల పెండ్లి !