Friday 13 March 2015

ఆది కవి నన్నయ్య కాదు. పాల్కురికి సోమనాధుడే ఆదికవి - తెలంగాణా ప్రభుత్వం.

అయ్యో మహాత్మా నన్నయ్యా
ఎంత పని జరిగిందయ్యా
కొత్త కతలు పుట్టుకొచ్చేనయ్యా
కొంగొత్త ఆదికవి దొరికాడయ్యా ! 

11వ శతాబ్దానికి చెందిన నీకన్నా చిన్న
12-13 శతాబ్దుల మధ్య జీవించిన పాల్కురికి సోమనాధుడే మిన్న !
ఏన్ని రకాల పరిశొధనలు ఉన్నా,
వాటి సారమంతా నిండు సున్నా !

కొత్త ప్రభుత్వాలు ప్రాంతీయ విద్వేషాలని
ప్రాచీన కవులకు కూడా అంటకట్టాలని 
రాజకీయ రంగు పులుముకుని
సాహితీ వేత్తలు ఆదికవిని మార్చారు పూనుకుని !

నాటి గోదారికి తెనుగు ఆంధ్రమ్ము ఒక్కటే నని తెలుసు
అప్పటి కృష్ణమ్మకి తెలుగు వారంతా ఆంధ్ర జాతీయులని తెలుసు
సోమనాధునికీ నన్నయ్యకీ ఆంధ్ర భాషలో రచించుట తెలుసు
మరి ఇప్పుడో, మాండలికాన్ని కొత్త భాషగా మార్చడం తెలుసు

సోమనాధుని బసవ పురాణాన్ని తక్కువ చేయలేదు ఎన్నడూ 
పోతన్న భాగవత పద్యాలు విని పులకరించని వాడుండడు. 
నన్నయ్య భారతాన్ని వాగనుశాసనుడై ఆంధ్రీకరించినపుడు
ఆ శబ్ద శాసనుని అనువాద కవి యని తలచలేదెవ్వడూ !

గోదావరి భారత కధ నా ముందు మొదలైందని సంతోషిస్తే
పెన్నా తీరం, ఏకశిలా నగరం కవి బ్రహ్మ పద్యాలు విని పొంగిపోతే
గుండ్లకమ్మ దరిని అద్దంకి సంపూర్ణ భారతాన్ని చూసి మురిసిపొతే
జయ కావ్యాన్ని అనువాద గ్రంధమని ఛీ కొడుతున్నారు నేడు చూస్తే !

తెలుగు ప్రాచీన భాష అయితే మరి తెలంగాణా భాష ఏమిటి?
తెలుగు వారికి అక్షరాలు 56 అయితే మరి తెలంగాణా భాష సంగతో ?
ఆంధ్ర మహా భాగవతం ఇప్పుడు తెలంగాణా మహా భాగవతం గా మారుస్తారా ?
ఆంధ్రోల్లు వెరే జాతి అయినపుడు తెలంగాణా వారు  ఆంధ్ర మహా భారతాన్ని చదువుకోరా?

అయ్యో తెలుగు తల్లీ !  కవిత్రయానికి వక్ర బిరుదులు ఇస్తున్నారమ్మా !!
నీలో భాగాలైన మాండలికాన్ని వేరు భాషగా చూడలేమమ్మా 
తెలుగు వారికి కొత్త బుధ్ధులు పుట్టి పెడత్రోవ పడుతున్నారమ్మా
ఒక్కటిగా తెలుగు భాష వెలిగి బతుకు వెలిగించే దారిని చూపవమ్మా !!