Thursday 24 December 2009

తెలంగాణా విషయం పైనే ఎందుకు అత్యుత్సాహం ?

మీడియా తెలంగాణా విషయం పైనే ఎందుకు అత్యుత్సాహం చూపుతోంది? ప్రతీ ఛానల్ కేసీయార్ ప్రసంగాలనో లేక తెలంగాణా పై జరిగే సమావేశాల్నో ప్రత్యక్షంగా గంటలు గంటలు చూపిస్తున్నారు. మరి అదే విధమైన కవరేజ్ సమైక్యాంధ్ర నినాదానికి ఇవ్వడంలేదే? ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచీ ప్రతీ ఛానెల్ లో కళింగ భవన్ లో జరిగే సమావేశాన్ని చూపించి హోరెత్తిస్తున్నారు. అది అంత అవసరమా? ఓ పక్క గొడవలు, ఉద్వెగం ఎక్కువ అవుతుంటే, జనాల్ని ఇంకా రెచ్చగొట్టడానికి తప్పిస్తే ఇవన్నీ దేనికి? మరో విషయం నాకు అర్ధం కావడం లేదు. లగడపాటి హైదరాబాదు వస్తే గొడవలు అవుతాయి అన్నారు. మరి ఇలాటి సమావేశాలకి అనుమతి ఇస్తే గొడవలు కావా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా కేంద్రం నుంచీ తెలంగాణా కి సపోర్టు చెయ్యమని ఆదేశాలు అందినట్లు స్పష్టం గా తెలుస్తూనే ఉంది. రాష్ట్రం విడిపోవాలని కుట్ర జరుగుతోంది మొర్రో అని ఎందరు మొత్తుకుంటున్నా, ఒక్కరికి కూడా చీమ కుత్తినట్టు లేదు. ఈ దేశ భద్రత, సమగ్రత ఈ తెలంగాణా వాదులకి పట్టదు. బాగా అభివృధ్ధి చేసి హైదరాబాదు వీరి చేతిలో పెట్టి సీమా, ఆంధ్ర వారు వెళ్ళిపొతే, వీరి పొలాలు కోట్లు పెట్టి కొనే వారెవ్వరు? పరిశ్రమలు పెట్టేవారెవ్వరు? హైదరాబాదులో ఆంధ్రవాళ్ళు పరిశ్రమలు పెట్టారు - వారిది దోపిడీ అని అంటున్నారు కదా, మరి చాలా మంది డబ్బున్న తెలంగాణా వాదులు పరిశ్రమలు పెట్టవచ్చు కదా? ప్రతీ ఒక్కరికీ భారతదేశంలో ఎక్కడైనా ఉండే హక్కు ఉంది. కానీ మన ఖర్మ చూడండి. మన రాష్ట్రంలోనే సాటి తెలుగు వాడు మరో తెలుగువాడిని దోపిడీదారు అంటున్నాడు. అలా ఒక్క తమిళుడు మరో తమిళుని అంటాడా? ఒక గుజరాత్ వాడు మరో గుజరాతీని అంటాడా? ఏ భాషవారికీ, జాతి వారికీ లేని మాయరోగం - మనకే ఉంది. అదే అనైక్యత. అయ్యా, సమైక్య వాదులూ, విడిపోతామనే వీరికి బుధ్ధి చెప్పాలనుకుంటే, చెవిటి వాని ముందు శంఖమూదినట్లే. నా జన్మలో ఇలాటి రోజును చూడవలసి వస్తోందని కలలో కూడా అనుకోలేదు. తెలుగు వారంతా ఒకటే అని ఈ గొడవలు జరిగేవరకూ నాకు నమ్మకం ఉండేది. కానీ ఈ గొడవల వల్ల ఎంత మానసిక వేదన, సామాన్య ప్రజలకి ఎంత ఇబ్బంది? రోజు గడవడానికి కూలి పని చేసుకునే వాడు తెలంగాణా వస్తే మహారాజు అయిపోతాడా? తెలంగాణా యాసలో పాటలు పాడడం కాదండీ.... ముందు సాటి తెలుగు వాడిని గౌరవించడం నేర్చుకోండి. తెలంగాణాలో పుట్టి పెరిగిన ఎంతో మందికి తెలంగాణేతర మూలాలు ఉన్నాయి. అయినంత మాత్రాన వాళ్ళకి హైదరాబాదు మీద, తెలంగాణా మీద హక్కు లేదనడం హాస్యాస్పదం. తెలుగు వారిని విడగొట్టే వారికి బుధ్ధి చెప్పాలే గానీ మనమే సహకరిస్తే ఎలా? మీరు తెలుగు వారు కాకుంటే ఇక తెలుగు లిపి వాడడం మానేయండి - అది ఆంధ్ర భాష. మానేస్తారా?

Tuesday 22 December 2009

హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా - కేసీయార్!

హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా - కేసీయార్ హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా - కేసీయార్ హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా - కేసీయార్ హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా - కేసీయార్ హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా - కేసీయార్ ఎంతమాటన్నవు ? నీలెక్క రాష్ట్రం మొత్తం అనుకుంటే నీ నాల్క ఎన్ని ముక్కలు గావాలె? నీ స్వత ఆస్థిలెక్క ప్రజల నడుమ చిచ్చు వెడుతున్నవు... నీ నోట్ల మన్నువడ ... నీ ఇంట్ల పీనిగెల్ల... నీ మొకం మీద దుమ్మువడ .. చీ! నీదీ ఒక బతుకేనా? తెలుగు ప్రజలను ఇంకెన్ని దినాలు మోసం జేస్తవ్? మొన్న ఎన్నికల్లల్ల సావుతప్పి కన్ను లొట్ట వోయి గెల్సినవ్... అంత గనం జనాలు నీ ఎంక ఉంటె నీకు గంత తక్కువ సీట్లు ఎందుకు వచ్చినయ్ చెప్పరాదు? రెండు ముక్కలు తెలంగాన యాసల మాట్లాడితె తెలంగాన వాడివి అయిపోవు.... నీలెక్క మాకు గూడ తెలంగాన బాసా వచ్చు ... యాసా వచ్చు.... నీవు గూడా ఏడికెల్లో అచ్చినోనివే గాని... ఈ దినం తెలంగానలనే పుట్టినట్లు మాట్లాడుతున్నవు. అరె పో... నీ మొకం జూస్తెనే పాపం... నీవు సస్తెగానీ ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదలదు.... నీకు హైదరాబాదు గావాల్నంటే మల్ల మొన్న గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలల్ల పోటీ ఎందుకు చెయ్యలేదు కొడుకా? నీకు ప్రజల ముందుకు వచ్చె దమ్ము లేదు గాని దొంగతనంగా దీక్ష లోపట ఇడ్లీలు తినుడు ఎరికెనా? నీ దొంగ మాటలతో అన్ని సాల్రు మోసం చెయ్యలేవు.... నీ పాపం పండే దినం దగ్గరకొచ్చి, నీవు అంతగనం వదురుతున్నవు. తెలంగాన మీద అంత ప్రేముంటే, నీతాన ఉన్న నల్ల డబ్బంత బయటికి తీ బిడ్డ... చేతనైతే 4 పరిశ్రమలు వెట్టు...... అందరితాన తెలంగాన పేరు జెప్పి పైసలు దొబ్బినవు గద..... అయన్నీ నీ బొందల వెట్టుకుంటవా..... ఇంతకన్న నాయకులే లేరా? నీవు సిగ్గున్న మొగోనివీ అయితే సోనియమ్మ బజన చేసుడు మాని - హైదరాబాదుల పోటీ జెయ్యి.......! గప్పుడు హైదరాబాదు గురించి మాట్లాడు!

Monday 14 December 2009

విభజన

ఈ విభజన దేశాన్నొక చింపిన విస్తరి చేస్తే భవితవ్యం మరో సారి పరపాలన తెస్తే ఈ నాటి యీ విభజన వీరులదే బాధ్యత యే నాటికి యెట్లున్నదొ దేశమాత తలరాత. అంటూ తన బాధను వెలిబుచ్చారు మా గురువుగారు శ్యామలరావు గారు.అందరూ అలోచించాల్సిన విషయం కదూ....!!

Monday 7 December 2009

నిత్య వేదన

అస్థిత్వానికి అర్ధం వెతకాలని ప్రయత్నిస్తే,

నీకా అర్హత లేదంటూ ఒక హేళన ముల్లులా గుచ్చుతుంది.

వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తే,

నీవో వ్యక్తివా అంటూ ఒక ఎగతాళి బాణమై గాయపరుస్తుంది.

సాధించిన విజయాల గురించి చెప్పాలని ప్రయత్నిస్తే,

నీ మొహానికి అదొకటే తక్కువంటూ ఒక ఎద్దెవా గుండె చీలుస్తుంది.

సంసారంలో బాధ్యతలు పంచుకొమ్మని అభ్యర్ధిస్తే,

రచ్చ గెలుస్తూన్నా, ఇంట ఎన్నటికీ గెలవలేవని ఒక ఈసడింపు గుర్తుచేస్తుంది.

ఎవరిపైనా ఆధారపడక, ఆత్మ విశ్వాసం ప్రదర్శిస్తే,

ఎంతైనా ఆడదానివే కదా అంటూ ఒక అవమానం నిలువునా చంపేస్తుంది.

Monday 23 November 2009

మా కలల క్రొత్త ఇల్లు

ఇన్నాళ్ళకి మా కల ఫలించి, మా స్వంత ఇంటి గృహప్రవేశం చేసుకున్నాము. కార్తీక శుక్ల ఏకాదశి నాడు మా నూతన గృహప్రవేశం జరిగింది. చిన్న చిన్న పనులు ఉండడంతో ఇంకా ఇల్లు మారలేదు. ఈ నెల ఆఖరుకల్లా మారాలని ప్రయత్నిస్తున్నాము. మొత్తానికి ఈ (అ)భాగ్యనగరంలో భాగ్యంకొద్దీ ఊరికి దగ్గరలో - (మణికొండ కి వెళ్ళే దారిలో షేక్ పేట్ దర్గా దగ్గర స్థలం కొని, ఇల్లు కట్టుకున్నాము) మాకంటూ ఒక స్వంత గూడు ఏర్పాటు చేసుకున్నాము.

సమయాభావం వల్ల ఈ విషయాన్ని బ్లాగులో ప్రస్తావించే వీలు లేకపోయింది. కానీ స్వంత ఇల్లు అనే కల ఇన్నాళ్ళకి నెరవేరినందుకు ఎంతో సంతోషంతో - చాయా చిత్రాలు రాగానే ఒక్క మాట చెప్పాలని మా ఇంటి చిత్రం మీ ముందు ఉంచుతున్నాను. ఇంటి కల సంగతి ఎలా ఉన్నా, ఇల్లు కట్టే కష్టాల గురించి తీరికగా మరో టపా..... ఇంకోసారి రాస్తానేం. ఉండనా మరి......!!

Thursday 27 August 2009

సురభి - భారతీయ సాంస్కృతిక పత్రిక

సురభి - భారతీయ సాంస్కృతిక పత్రిక

చాలా రోజులుగా నా బ్లాగు ముఖం చూడలేదు. కానీ ఒక మంచి కార్యక్రమం గురించి రాయాలని చాలా రోజులుగా అనుకుంటూ ఉండబట్టి, ఎలాగైనా రాయాలని ప్రయత్నిస్తూ ఉంటే, ఇన్నాళ్ళకి కుదిరింది.

దూరదర్శన్ వారు జాతీయ ప్రసారాల్లో భాగంగా ఒక అద్భుతమైన సాంస్కృతిక విశేషాల సమాహారాన్ని అందించారు. అదే - "సురభి". రేణుకా షహానే, సిద్దార్ధ కాక్ ల చెదరని చిరునవ్వుల వ్యాఖ్యానం ఆ కార్యక్రమానికి ఎంతో శోభని సమకూర్చిందని వేరే చెప్పనక్కరలేదు. ప్రతీ ఆదివారం ఆ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూసేవారం. మన దేశాన్ని గురించిన ఎన్నో విశేషాలు చూడడం, తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉండేది. అస్సలు టూరిజం గురించిన అవగాహన అప్పుడే చాలామందికి కలిగింది.

చాలా ప్రదేశాల గురించి వినడమే గానీ ప్రత్యక్షంగా చూసి ఉండము. అలాటి ప్రదేశాల గురించి, మన హస్త కళల గురించి, భారత గ్రామ క్రీడల గురించి, మన కళల గురించి, వాయిద్య పరికరాల గురించి, నాట్య రీతుల గురించి, చేతి వృత్తుల గురించి, ప్రత్యేక వ్యక్తుల గురించి, పేరు పొందిన కళాకారుల గురించి, మన దేశంలో పరిఢవిల్లిన పురాతన నాగరికతల గురించి, పుణ్య స్థలాల గురించి, చారిత్రక కట్టడాల గురించి, కొన్ని ఊర్ల ప్రత్యేకతల గురించి, గ్రంధాలయాల గురించి, వస్తు ప్రదర్శన శాలల గురించి, చారిత్రక నగరాల గురించి, శత్రు దుర్భేద్యమైన కోటల గురించి, రకరకాల ప్రాంతీయ వంటకాల గురించి, తర తరాలుగా వస్తున్న మన సాంప్రదాయ వైద్య పద్ధతుల గురించి, వివిధ వినూత్న సమకాలీన ప్రదర్శనల గురించి, సాంకేతికత సహాయం ద్వారా సాంస్కృతిక పరిరక్షణ గురించి, పర్యావరణ పరిరక్షణ మన పూర్వకాలం నుంచీ ఎలా జరిగేదో చెప్పి దాన్ని ప్రస్తుతం కొనసాగించడం గురించీ, అనేక ప్రతేక బహుమతుల ప్రదానోత్సవాల గురించీ, అనేక సంగీత, నాట్య, సాంస్కృతిక ఉత్సవాల గురించీ, వీధుల్లో జరిగే విపణుల గురించీ, కళల్ని ప్రోత్సహిస్తున్న/ నేర్పిస్తున్న సంస్థల గురించీ, .....మనం మరచిపోతున్న మన సాంస్కృతిక వారసత్వ సంపద గురించి... ఇలా ఒకటేమిటి, అదొక సంపూర్ణ భారతీయ కళా సాంస్కృతిక వాహిని. మన గురించి మనం గర్వపడడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయో అన్నిటినీ "సురభి" కార్యక్రమం చూపించిందంటే అతిశయోక్తి కాదు.

నా మటుకు నాకు ఈ కార్యక్రమంలో చూసి, మరచిపోలేని అంశాలెన్నో ఉన్నాయి. మచ్చుకు కొన్ని - మన సురభి నాటక పరిషత్తు. పోచంపల్లి చీరలు, కేరళ గురించిన ఎన్నో విశేషాలు, మాండలిన్ శ్రీనివాస్ తో ఇష్టాగోష్టి, హంపి లో సప్త స్వరాలు పలికే స్తంభాలు, కడలి లో మునిగిన ద్వారకా నగరం, ఉంగరంలో అమాంతమూ దూరిపోయే పచ్ మినా శాలువాలు, టూరిజం వారి ప్రత్యేక రైలు "ప్యాలెస్ ఆన్ వీల్స్", రుచికరమైన బెంగాలీ వంటకం "రసగుల్లా" తయారీ, అప్పుడప్పుడే పైకి వస్తున్న రెహమాన్ పై ప్రత్యేక కార్యక్రమం, మన పురాతన విశ్వవిద్యాలయాలు నలంద, నాగార్జునకొండ, రాజస్థాన్ లోని వివిధ ప్రదేశాలు, మహళ్ళు, లిజ్జత్ అప్పడాలు, తేయాకును రుచిని బట్టి విభజించడం, మన కలంకారీ, సుస్మితా సేన్ తో ముఖాముఖి, కేరళ యుద్ధకళ కలారిపయట్టు, హైదరాబాదు చేప మందు, ఇలా ఒకటేమిటి.... ఎన్నో, ఎన్నెన్నో విశేషాలు.

చాలా విషయాలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల గురించి, ఈశాన్య/తూర్పు రాష్ట్రాలకీ, దక్షిణ భారతానికీ ఉన్న సారూప్యతల గురించీ తెలీని విషయాలు ఎన్నో సురభి ద్వారా తెలిశాయంటే అతిశయోక్తి కాదు. మన దేశంలోని వివరాలనే కాక మన సంస్కృతికి దగ్గరగా ఉండే అనేక విషయాలు - విదేశాలనుంచీ సైతం సేకరించి చూపడం సురభి ప్రత్యేకత. ముఖ్యంగా ఆసియా దేశాలైన శ్రీలంక, చైనా, జపాను, కొరియా, సింగపూర్, కంబోడియా, మొదలైన దేశాల వివరాలు చాలా బాగా తెలుసుకోడానికి సురభి చాలా దోహద పడిందని చెప్పవచ్చు.

అన్నిటికీ మించి ఆఖరున "సవాల్-జవాబ్" శీర్షికన ఒక ప్రశ్న అడిగేవారు. దానికి సమాధానం తెలిస్తే మాత్రం తప్పక వ్రాసేవారం. ఇక రెండువారాల తరువాతి భాగంలో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేవారు. సమాధానాలు వ్రాసిన వాళ్ళను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసేవారు. వారికి మన దేశంలో ఎక్కడినుంచీ ఎక్కడికైనా రానూ పోనూ ఇద్దరికి విమాన చార్జీలు, ఐ. టి. డి. సి. వారి హోటళ్ళలో రెండురోజుల ఉచిత మకాం బహుమతిగా ఇచ్చేవారు. (మేము సరైన సమాధానం రాసిన ప్రతీసారీ విమానం ఎక్కినట్లే ఫీల్ అయిపోయేవాళ్ళం - చివరికి మాకు ఎప్పుడూ బహుమతి రాలేదు :-) ).

దశాబ్దం పాటు వచ్చిన ఈ కార్యక్రమం గురించి ఒక్క టపాలో వివరించడం చాలా కష్టం. కానీ చివరగా సురభి కార్యక్రమాల వివరాలు మళ్ళీ చూడాలనుకునేవారికి సురభి కార్యక్రమానికి సంబంధించిన లంకె ఇస్తున్నాను. ఇందులో ప్రతీ భాగం గురించిన వివరాలు ఉన్నాయి.

http://www.indiasurabhi.com/surabhi01.html

మన ఘన వారసత్వ సంపదని ప్రపంచానికి గర్వంగా చూపిన సురభి మళ్ళీ కొత్త రూపు సంతరించుకొని మన ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ -

సురభి బృందానికి కృతఙ్ఞతలు అర్పిస్తున్నాను.

Thursday 2 April 2009

చిన్నారి సీతా-రాముల పెండ్లి

శ్రీ రామచంద్రుని పెండ్లి వేడుక నేడు - అరసి శ్రీ రామ నవమి యదె నేడు
సిరుల మిధిలా పురి మురిసె చూడు - అల సొంపైన పెండ్లి వేదిక యదె చూడు
.
ముక్కంటి విల్లు విరిచె విలుకాడు - పెండ్లి కొడుకై అమరె సీతమ్మకీనాడు
మొలకనవ్వుల ముద్దు మోమున్న ఱేడు - పొరలే నవ్వుల తల్లికి మొగడౌను నేడు
.
మల్లె పూల జడ నడుమన చామంతి బిళ్ళ - తాకింది తాళి కట్టే రాముని వ్రేళ్ళ
ఎల్లకాలము సీతమ్మ మేను వీడక - చూడామణి నిలిపేను రామ స్పర్శా వీచిక
.
తలబ్రాలు పోసుకున్న దోసిళ్ళు - అన్యోన్య దాంపత్యానికి ఆనవాళ్ళు
తలపుల వలపుల పెళ్ళి పందిళ్ళు - అలవికాని ఆనందాల సందళ్ళు
.
చీరసారెలతోను చిరకాలమగు పెండ్లి - చిరు ఆశల నెరవేర్చు పెండ్లి
చింతలన్నియు పారద్రోలు పెండ్లి - చిన్నారి సీతా-రాముల పెండ్లి !

Tuesday 3 March 2009

కొందరు ఈ తరం అమ్మాయిలు

కొత్త తరం పెడ ధోరణుల్లో ఒక వింత పోకడ ముఖ్యంగా అమ్మయిల్లో ఈ మధ్య నేను గమనిస్తున్నాను. చదువుల వల్ల అయితేనేమి, ఉద్యోగాలు చేస్తూ - ఆర్ధికంగా స్వతంత్రులవడం వల్ల అయితేనేమి, పెళ్ళి అంటే విముఖత చూపిస్తున్నారు ఈ తరం అమ్మాయిలు. ఇంతకు ముందు రోజుల్లో చదువుకున్నా, పెళ్ళి అంటే ఈ రకం విముఖత కానీ, పెళ్ళి, పిల్లలు తన జీవితానికి ప్రతిబంధకం అని కానీ అమ్మాయిలు ఆలోచించడం చాలా తక్కువగా ఉండేది. జీవితమతా ఒకరి కింద నేను ఎందుకు బతకాలి? అని ప్రశ్నించే ఈ తరం అమ్మాయిలకి - (కనీసం కొందరి విషయంలోనైనా) తమ తల్లులు అలా బతికారు / బతుకుతున్నారు అన్న విషయం గుర్తు ఉన్నదో లేదో అనిపిస్తోంది. ఆర్ధికంగా, మానసికంగా స్వతంత్రులవడం తప్పు కాదు. భావ వ్యక్తీకరణకి కావలసినంత స్వేచ్చ నేటి తరం పిల్లలకి ఉంది. కానీ పెడసరంగా మాట్లాడడం, విపరీతంగా అలోచించడం మాత్రం ఆ స్వేచ్చని దుర్వినియోగం చేసుకున్నట్లే అని అనిపిస్తోంది నాకు. ఏం? ఆడది మగవాడు లేకపోతే బతకలేదా? అని చాలా మంది మాట్లాడడం విన్నాను. కానీ పెళ్ళి ఆడవారికి ఎంత అవసరమో, మగవాడికి కూడా అంతే అవసరం. తమ తమ స్వీయ అహంకారాలని (EGO) లని చంపుకోలేక విడిపోతున్న జంటలని ఉదాహరణలుగా చూపించి, అంత అడ్జస్ట్ అవలేని మగవారు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు... మాకు వచ్చే వాడు ఎలా ఉంటాడో అని అలోచిస్తూ, ఈ గొడవలంతా ఎందుకు? అసలు పెళ్ళి చేసుకోకుంటే ఈ గొడవలే లేవుగా... అని ముక్తాయింపుకి వచ్చేస్తున్నారు. వయసు కాస్త పెరిగాక, ఒంటరితనం విసుగు అనిపించాక అప్పుడు జీవిత భాగస్వామి కోసం వెతుకులాట మొదలు.... తల్లిదండ్రులు పిల్ల మనసు మారిందిలే... అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని వీరికై సంబంధాలు వెతకటం మొదలు పెడతారు. ఇక అప్పటినుంచే మొదలు అవుతాయి, అసలైన పాట్లు. పెళ్ళి సంబంధాలు చూడడం మొదలు పెట్టాక పిల్ల వివరాలు నచ్చిన వారు అమ్మాయిని చూడడానికి వస్తామనడం మామూలే కదా... అలా ఎవరైనా పెళ్ళి చూపులకి వస్తామనడం ఆలస్యం. ఇక ఆ అమ్మాయిల నిబంధనలు అనేకం. నన్ను చీర కట్టుకోమని వేధించకు అమ్మా, నాకు చిరాకు .. ఆ చీరలో గంటలు గంటలు కూర్చోలేను... ఒక పిల్ల హుకుం. ప్రతీ ఆదివారం ఇదొక గోల. నేనేమైనా సంతలో గొడ్డుని అనుకున్నారా? వస్తారు, చూస్తారు, పోతారు (ఏదో పాతికసార్లో, ముప్ఫై సార్లో కాదండోయ్, రెండో, మూడో పెళ్ళి చూపులు అయి ఉన్న బాపతు అమ్మాయిలైనా ఇలాగే మాట్లాడుతారు) అని మరో అమ్మాయి నస. మళ్ళీ పెళ్ళి చూపులా... అదేదో తల్లిదండ్రులని పెద్ద ఉధ్ధరించినట్లు ఒక యువతి బిల్డప్పు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి... చాలా ఎక్కువ సార్లు పెళ్ళి చూపులు జరిగిన అమ్మాయిలు ఇలా విసుక్కున్నారంటే కాస్త అర్ధం ఉంది... కానీ రెండు మూడు సార్లకే విపరీతంగా మాట్లాడే వారి గురించే నేను చెప్పేది. కొన్ని జాడ్యాలు మన సమాజంలో ఇంకా ఉన్నాయన్నది నిజమే కానీ ... తామొక్కరే బాధపడుతున్నామని అనుకునే అమ్మాయిల గురించి మాత్రమే నేను ఇదంతా రాస్తున్నాను. నేను కూడా ఒక ఆడపిల్లగా ఇవన్నీ అనుభవించిన దానినే. ఈ పెళ్ళి చూపులూ, అవీ ఎందుకు అనుకుంటే తమకు నచ్చిన వారిని తామే ఎన్నుకోవచ్చుగా... కానీ వీరు అదీ చేయరు. ముందే ఒక వ్యతిరేక భావంతో మగవారిని చూసేవారికి ఎవరైనా నచ్చే అవకాశమే లేదు. అందుకని మాకు తగ్గ వారిని తీసుకురండి అని తల్లిదండ్రులని వేధించడం మాత్రం తెలుసు. వీరికి ఏమి కావాలో వీరికే తెలీదు... !! సరే... ఒకానొక రోజున ఎవరికో ఒకరికి ఆ అమ్మాయి నచ్చినా, అప్పుడు కూడా పెళ్ళి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేం. అబ్బాయికి నేను నచ్చితే సరిపోతుందా.... నాకు అబ్బాయి నచ్చాల్సిన పని లేదా? అని గయ్య్...మని లేస్తారు. తల్లిదండ్రులకి మనస్తాపం కలిగించడం మినహా ఇలాటి వారివల్ల ఏమీ ప్రయోజనం లేదు. తల్లిదండ్రులూ, మీ పిల్లలు మీకు ముద్దే కానీ అవసరం అయినప్పుడు నచ్చజెప్పకపోతే మీ చేతులారా మీరే వారి మొండితనానికి పాదు చేస్తున్నట్లు గ్రహించండి. పిల్లలకి జీవితంలో అన్నీ సమానంగా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వండి కానీ అది వెఱ్ఱితలలు వేసి విపరీత ధోరణులకు, మితి మీఱిన కోరికలకు, అమితమైన వ్యక్తి స్వేచ్చకు దారి తీయకుండా చూసుకోండి. ఇటీవలి కాలంలో నేను చూసిన సంఘటనలకి ఒక స్త్రీగా, తల్లిగా ఈ పిల్లలు ఇలా నిర్హేతుకంగా తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారే అనే బాధతో రాస్తున్నాను. అమ్మాయిలూ, అమ్మా, నాన్నల్ని అర్ధం చేసుకోండి. పెళ్ళి ఎవరికైనా జీవితంలో ఒక భాగం అని గుర్తించండి. అమ్మానాన్నల్ని ఉధ్ధరించడానికి మీరు పెళ్ళి చేసుకుంటున్నట్లుగా ప్రవర్తించకండి.

Wednesday 4 February 2009

అమృత (శ్రీ రామ) మూర్తి - తాతయ్య

రామార్పణం !
ఎవరైనా నమస్కారం పెడితే తాతయ్య రామార్పణం అనేవారు ! తాతయ్యే తాతయ్య ! బలే తాతయ్య. తానే తల్లీ తండ్రీ అయ్యి పిల్లలని పెంచిన మా బంగారు తాతయ్య ! ఎప్పుడూ మల్లె పువ్వుల్లాటి తెల్లటి బట్టలు వేసుకుని అలాగే పువ్వులా నవ్వులు చిందిస్తూ ఉండే తాతయ్య! తెలుగుతనం ఉట్టి పడేలా పంచెకట్టి, చొక్కా వేసుకుని, నుదుటన నిలువు బొట్టు పెట్టి నడుస్తూ ఉంటే, ఆహా ఏమి అందం ! మా తాతయ్యలాటి "స్మార్ట్" తాతయ్య ఇంకెవ్వరికీ లేరనే అనిపించేది ! మామూలుగా ఆఫీసుకి, బయటకి వెళ్ళేడపుడు పాంటూ , షర్టూ వేసుకున్నా, పండగలకీ, పూజలకీ, పెళ్ళిళ్ళకీ పంచె మాత్రమే కట్టుకునే మా ముద్దుల తాతయ్య ! అమ్మమ్మని మాత్రమే "ఏమే" అని పిలిచేవారు తప్పిస్తే మమ్మల్నెవరినీ పొరపాటున కూడా పిలుపులోనైనా పరుషత్వం చూపని మా మంచి తాతయ్య! ప్రేమ, అభిమానం, ఆప్యాయత అంటే నిర్వచనంగా మమ్మల్ని అపురూపంగా చూసుకొని, మా చిన్న చిన్న ఇష్టాలని కూడా మరచిపోకుండా మాకోసం అన్నీ చేసే మా తాతయ్య ! తాను భోంచేస్తూ, పచ్చడి అన్నం కలపంగానే, మరి కాస్త నెయ్యి ఎక్కువ వేసి, ఇదిగో నీ ముద్ద అంటూ నోట్లో పెట్టే మా ప్రియమైన తాతయ్య !
నా చిన్నప్పుడు నాకు తాతయ్య అంటే ఎంత ఇష్టం అంటే, ఏమి తోచకపోతే, "తాతయ్య", "తాతయ్య" అంటూ తాతయ్య జపం చేసేదాన్ని. నేను చిన్నగా ఉన్నపుడే మా అమ్మమ్మ తాతయ్యల దగ్గరకి వెళ్ళిపోయాను, ఆయన రెటైర్ అయ్యేదాకా ఆయన దగ్గరే ఉన్నాను. ఆ తరువాత మా ఇంటికే వాళ్లు వచ్చేసారు (మా అమ్మ కి అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ ఎవరూ లేరు). ఆ చిన్న వయసులో అమ్మమ్మ తాతయ్యలే నాకు అమ్మా నాన్నలైనారు. తన గుండెల మీద పెట్టుకొని తాతయ్య నన్ను పెంచారు. శిరీష అని పేరుతో అందరూ పిలిచినా, తాతయ్య మాత్రం "సిరి తల్లీ" అని పిలిచేవారు. పొద్దున్నే నిద్ర లెపడానికైనా, అమ్మా, సిరి తల్లీ, లేమ్మా అని పిలిచేవాళ్ళే గానీ, ఒక్క రోజు కూడా నన్ను తిట్టేవారు కాదు. దాదాపు 8 ఏళ్ళ వయసు వచ్చే వరకూ తాతయ్య దగ్గరే పడుకునేదాన్ని. ఆ తర్వాత నా స్థానం మా చిన్న తమ్ముడు కొట్టేశాడు. నేనూ వాడూ తాతయ్య పక్కన పడుకోడానికి రోజూ కొట్టుకునేవాళ్ళం. నీవు పెద్ద పిల్లవి అయిపోతున్నావు - అని అరిచి అమ్మ వాడిని పడుకోపెట్టేది. ఏంచెస్తాను, ఇక అమ్మమ్మ దగ్గర పడుకొని సరిపెట్టుకునేదాన్ని. నా పెళ్ళి అయ్యేంతవరకూ అమ్మమ్మ పక్కనే పడుకున్నా !
నా చదువు గుఱించీ, ఉద్యోగం గుఱించీ తాతయ్య ఎంత తపన పడ్డారో గుర్తొస్తే, ఇప్పటికీ కళ్ళు చెమరుస్తాయి. పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి చదువుకోడానికి నేను కాలేజీలో చేరితే, రోజూ రాత్రి 9 వరకూ నాకోసం కాలేజీలో కాచుకుని ఉండి, బస్సులో నాతోపాటు ఇంటికి వచ్చేవారు. మీరు బస్ స్టాపు లో ఉంటే చాలులే తాతయ్య అన్నా వినిపించుకునే వారు కాదు. మేమిద్దరమే జంటగా చాలా చోట్లకి వెళ్ళేవాళ్ళం. ఆయన తన స్నేహితుల ఇళ్ళకి వెళ్ళాలంటే ఒక్కరూ ఈ సిటీలో బస్సుల్లో వెళ్ళడం బోరు కదా...అని చెప్పి, నన్ను కూడా తోడు తీసుకెళ్ళేవారు. ఆడపిల్లవైనా నీవు దేనిలోనూ వెనకబడకూడదు. బాగా చదవాలి, మంచి ఉద్యోగం చేయ్యాలి అంటూ, వెన్ను తట్టి ప్రోత్సహించేవారు. ఈరోజు నేనిలా ఉన్నానంటే కారణం మా తాతయ్య చెప్పిన ధైర్యమే!
నలుగురికీ సహాయం చెయ్యాలని చెప్పడమే కాదు, ఆయన అది చేసి చూపారు. బావమఱదుల్ని ప్రేమగా చూసిన బావగారిని ఈయననే చూసాను. వాళ్ళ బావమఱదులంతా ఈయనని తండ్రి లా గౌరవించేవారు. తమ్ముడి పిల్లలకి సాయం చేసారు. చెల్లెలి పిల్లల్ని ఇంట్లో ఉంచుకుని ఉద్యోగం ఇప్పించి, పెళ్ళిళ్ళు చేసి ఆదుకున్నారు. మరదలు కూతుర్లని తన కూతుర్ల లాగా చూసుకున్నారు. పిల్లనిచ్చిన అల్లుడిని స్వంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు (పాపం - మా నాన్న కూడా అలాగే తాతయ్యని బాగా చూసుకున్నారు)
నేను కులాంతర వివాహం చేసుకున్నానని నన్ను మా నాన్న ముఖం కూడా చూడకుండా వదిలేసినా, మా తాతయ్య అర్ధం చేసుకుని, నాకు కొండంత మానసిక బలాన్ని ఇచ్చారు. నా పైనే కాదు, మావారి పైన కూడా అప్యాయతానురాగాల్ని వర్షించారు. బ్రతికినన్నాళ్ళూ సంకుచిత భావాలకి దూరంగా, కుల/మతాలకి అతీతంగా అందరికీ సహాయం చేసి, నిజాయితీగా బ్రతుకుతూ, ఒకరినుంచీ ఏమీ ఆశించకుండా, తన జీవితాన్నంతా ఇతరుల కోసం అలోచించారు ! అమ్మమ్మ పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటే, ఎవ్వరినీ బాధ పెట్టకుండా ఉండడమే దేవుడికి పెద్ద పూజ అనేవారు ! చిత్రం ఏమిటంటే, ఆ పుణ్య దంపతులు ఇద్దరూ కూడబలుక్కున్నట్లుగా - కిందటి ఏడాదే (2008 లో)అమ్మమ్మ మార్చిలోనూ, తాతయ్య ఏప్రిల్ లోనూ దైవ సన్నిధానానికి చేరుకున్నారు. ఏ లోకాన ఉన్నా, తాతయ్య నన్నూ, నా తమ్ముళ్ళనీ ఆశీర్వదిస్తూనే ఉంటారు ! అవును.....మా తాతయ్య వరాల తాతయ్య !
తాతయ్యా ! ఈ రోజు మీ పుట్టినరోజు, పొద్దుటినుంచీ మీరే గుర్తుకి వస్తున్నారు.... కలలో అయినా కనిపించండి. మీరు తప్ప నాకెవ్వరూ లేరు. మిమ్మల్ని చూడాలని ఉంది !
మీలో ఎవ్వరికైనా ఆకాశ వీధిలో తళుకుమనే నక్షత్రమై మా తాతయ్య కనిపిస్తే పై మాటలన్నీ చెప్పరూ !

Friday 16 January 2009

తెలుగు సాహితి తొలి సమావేశం

తెలుగు సాహితి కార్యక్రమాలు మొదలయ్యాయోచ్ ! మా సంస్థాగత తెలుగు సాహితీ సమితి - "ఐ.బి.యం - తెలుగు సాహితి" జనవరి 8వ తారీకున పుట్టింది. మా తొలి సమావేశానికి దాదాపు 50 మంది హాజరయారు. ఆ సందర్భంగా నేను రాసిన కవిత.
క్య మనస్సులతో మనమంతా నడుం
బిగించి మనలోని భావుకతని మేల్కొల్పి,
యంత్రముల వలె జీవించక, సుందరమైన
తెలుగు భాషా మాధురీ దీప కాంతులని
లుప్తం కానీయక, చెక్కు చెదరనీయక
గురుతులన్నీ పదిలంగా భద్ర పరచుకొని,
సారవంతమైన మన మనో కమతాల్లో
హిరణ్య వర్ణాల పంట పండించడానికి
తిరిగి మన అమ్మ భాష నీడన చేరుదాం !
పెద్ద పెద్ద సంస్థల్లో ఇలాటి కార్యక్రమాలు జరిగితే మన తెలుగు ప్రచారం మరింత సులభతరం అవుతుందనే ఆకాంక్షతో ఈ విషయం మన బ్లాగు లోకానికి తెలియజేస్తున్నాను.
మా సమావేశ నివేదిక కింది బ్లాగులో చూడగలరు: http://ibmtelugusaahiti.blogspot.com/