Showing posts with label కవిత్వం. Show all posts
Showing posts with label కవిత్వం. Show all posts

Monday, 7 December 2009

నిత్య వేదన

అస్థిత్వానికి అర్ధం వెతకాలని ప్రయత్నిస్తే,

నీకా అర్హత లేదంటూ ఒక హేళన ముల్లులా గుచ్చుతుంది.

వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తే,

నీవో వ్యక్తివా అంటూ ఒక ఎగతాళి బాణమై గాయపరుస్తుంది.

సాధించిన విజయాల గురించి చెప్పాలని ప్రయత్నిస్తే,

నీ మొహానికి అదొకటే తక్కువంటూ ఒక ఎద్దెవా గుండె చీలుస్తుంది.

సంసారంలో బాధ్యతలు పంచుకొమ్మని అభ్యర్ధిస్తే,

రచ్చ గెలుస్తూన్నా, ఇంట ఎన్నటికీ గెలవలేవని ఒక ఈసడింపు గుర్తుచేస్తుంది.

ఎవరిపైనా ఆధారపడక, ఆత్మ విశ్వాసం ప్రదర్శిస్తే,

ఎంతైనా ఆడదానివే కదా అంటూ ఒక అవమానం నిలువునా చంపేస్తుంది.