Tuesday, 3 March 2009

కొందరు ఈ తరం అమ్మాయిలు

కొత్త తరం పెడ ధోరణుల్లో ఒక వింత పోకడ ముఖ్యంగా అమ్మయిల్లో ఈ మధ్య నేను గమనిస్తున్నాను. చదువుల వల్ల అయితేనేమి, ఉద్యోగాలు చేస్తూ - ఆర్ధికంగా స్వతంత్రులవడం వల్ల అయితేనేమి, పెళ్ళి అంటే విముఖత చూపిస్తున్నారు ఈ తరం అమ్మాయిలు. ఇంతకు ముందు రోజుల్లో చదువుకున్నా, పెళ్ళి అంటే ఈ రకం విముఖత కానీ, పెళ్ళి, పిల్లలు తన జీవితానికి ప్రతిబంధకం అని కానీ అమ్మాయిలు ఆలోచించడం చాలా తక్కువగా ఉండేది. జీవితమతా ఒకరి కింద నేను ఎందుకు బతకాలి? అని ప్రశ్నించే ఈ తరం అమ్మాయిలకి - (కనీసం కొందరి విషయంలోనైనా) తమ తల్లులు అలా బతికారు / బతుకుతున్నారు అన్న విషయం గుర్తు ఉన్నదో లేదో అనిపిస్తోంది. ఆర్ధికంగా, మానసికంగా స్వతంత్రులవడం తప్పు కాదు. భావ వ్యక్తీకరణకి కావలసినంత స్వేచ్చ నేటి తరం పిల్లలకి ఉంది. కానీ పెడసరంగా మాట్లాడడం, విపరీతంగా అలోచించడం మాత్రం ఆ స్వేచ్చని దుర్వినియోగం చేసుకున్నట్లే అని అనిపిస్తోంది నాకు. ఏం? ఆడది మగవాడు లేకపోతే బతకలేదా? అని చాలా మంది మాట్లాడడం విన్నాను. కానీ పెళ్ళి ఆడవారికి ఎంత అవసరమో, మగవాడికి కూడా అంతే అవసరం. తమ తమ స్వీయ అహంకారాలని (EGO) లని చంపుకోలేక విడిపోతున్న జంటలని ఉదాహరణలుగా చూపించి, అంత అడ్జస్ట్ అవలేని మగవారు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు... మాకు వచ్చే వాడు ఎలా ఉంటాడో అని అలోచిస్తూ, ఈ గొడవలంతా ఎందుకు? అసలు పెళ్ళి చేసుకోకుంటే ఈ గొడవలే లేవుగా... అని ముక్తాయింపుకి వచ్చేస్తున్నారు. వయసు కాస్త పెరిగాక, ఒంటరితనం విసుగు అనిపించాక అప్పుడు జీవిత భాగస్వామి కోసం వెతుకులాట మొదలు.... తల్లిదండ్రులు పిల్ల మనసు మారిందిలే... అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని వీరికై సంబంధాలు వెతకటం మొదలు పెడతారు. ఇక అప్పటినుంచే మొదలు అవుతాయి, అసలైన పాట్లు. పెళ్ళి సంబంధాలు చూడడం మొదలు పెట్టాక పిల్ల వివరాలు నచ్చిన వారు అమ్మాయిని చూడడానికి వస్తామనడం మామూలే కదా... అలా ఎవరైనా పెళ్ళి చూపులకి వస్తామనడం ఆలస్యం. ఇక ఆ అమ్మాయిల నిబంధనలు అనేకం. నన్ను చీర కట్టుకోమని వేధించకు అమ్మా, నాకు చిరాకు .. ఆ చీరలో గంటలు గంటలు కూర్చోలేను... ఒక పిల్ల హుకుం. ప్రతీ ఆదివారం ఇదొక గోల. నేనేమైనా సంతలో గొడ్డుని అనుకున్నారా? వస్తారు, చూస్తారు, పోతారు (ఏదో పాతికసార్లో, ముప్ఫై సార్లో కాదండోయ్, రెండో, మూడో పెళ్ళి చూపులు అయి ఉన్న బాపతు అమ్మాయిలైనా ఇలాగే మాట్లాడుతారు) అని మరో అమ్మాయి నస. మళ్ళీ పెళ్ళి చూపులా... అదేదో తల్లిదండ్రులని పెద్ద ఉధ్ధరించినట్లు ఒక యువతి బిల్డప్పు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి... చాలా ఎక్కువ సార్లు పెళ్ళి చూపులు జరిగిన అమ్మాయిలు ఇలా విసుక్కున్నారంటే కాస్త అర్ధం ఉంది... కానీ రెండు మూడు సార్లకే విపరీతంగా మాట్లాడే వారి గురించే నేను చెప్పేది. కొన్ని జాడ్యాలు మన సమాజంలో ఇంకా ఉన్నాయన్నది నిజమే కానీ ... తామొక్కరే బాధపడుతున్నామని అనుకునే అమ్మాయిల గురించి మాత్రమే నేను ఇదంతా రాస్తున్నాను. నేను కూడా ఒక ఆడపిల్లగా ఇవన్నీ అనుభవించిన దానినే. ఈ పెళ్ళి చూపులూ, అవీ ఎందుకు అనుకుంటే తమకు నచ్చిన వారిని తామే ఎన్నుకోవచ్చుగా... కానీ వీరు అదీ చేయరు. ముందే ఒక వ్యతిరేక భావంతో మగవారిని చూసేవారికి ఎవరైనా నచ్చే అవకాశమే లేదు. అందుకని మాకు తగ్గ వారిని తీసుకురండి అని తల్లిదండ్రులని వేధించడం మాత్రం తెలుసు. వీరికి ఏమి కావాలో వీరికే తెలీదు... !! సరే... ఒకానొక రోజున ఎవరికో ఒకరికి ఆ అమ్మాయి నచ్చినా, అప్పుడు కూడా పెళ్ళి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేం. అబ్బాయికి నేను నచ్చితే సరిపోతుందా.... నాకు అబ్బాయి నచ్చాల్సిన పని లేదా? అని గయ్య్...మని లేస్తారు. తల్లిదండ్రులకి మనస్తాపం కలిగించడం మినహా ఇలాటి వారివల్ల ఏమీ ప్రయోజనం లేదు. తల్లిదండ్రులూ, మీ పిల్లలు మీకు ముద్దే కానీ అవసరం అయినప్పుడు నచ్చజెప్పకపోతే మీ చేతులారా మీరే వారి మొండితనానికి పాదు చేస్తున్నట్లు గ్రహించండి. పిల్లలకి జీవితంలో అన్నీ సమానంగా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వండి కానీ అది వెఱ్ఱితలలు వేసి విపరీత ధోరణులకు, మితి మీఱిన కోరికలకు, అమితమైన వ్యక్తి స్వేచ్చకు దారి తీయకుండా చూసుకోండి. ఇటీవలి కాలంలో నేను చూసిన సంఘటనలకి ఒక స్త్రీగా, తల్లిగా ఈ పిల్లలు ఇలా నిర్హేతుకంగా తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారే అనే బాధతో రాస్తున్నాను. అమ్మాయిలూ, అమ్మా, నాన్నల్ని అర్ధం చేసుకోండి. పెళ్ళి ఎవరికైనా జీవితంలో ఒక భాగం అని గుర్తించండి. అమ్మానాన్నల్ని ఉధ్ధరించడానికి మీరు పెళ్ళి చేసుకుంటున్నట్లుగా ప్రవర్తించకండి.