Thursday, 27 August 2009

సురభి - భారతీయ సాంస్కృతిక పత్రిక

సురభి - భారతీయ సాంస్కృతిక పత్రిక

చాలా రోజులుగా నా బ్లాగు ముఖం చూడలేదు. కానీ ఒక మంచి కార్యక్రమం గురించి రాయాలని చాలా రోజులుగా అనుకుంటూ ఉండబట్టి, ఎలాగైనా రాయాలని ప్రయత్నిస్తూ ఉంటే, ఇన్నాళ్ళకి కుదిరింది.

దూరదర్శన్ వారు జాతీయ ప్రసారాల్లో భాగంగా ఒక అద్భుతమైన సాంస్కృతిక విశేషాల సమాహారాన్ని అందించారు. అదే - "సురభి". రేణుకా షహానే, సిద్దార్ధ కాక్ ల చెదరని చిరునవ్వుల వ్యాఖ్యానం ఆ కార్యక్రమానికి ఎంతో శోభని సమకూర్చిందని వేరే చెప్పనక్కరలేదు. ప్రతీ ఆదివారం ఆ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూసేవారం. మన దేశాన్ని గురించిన ఎన్నో విశేషాలు చూడడం, తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉండేది. అస్సలు టూరిజం గురించిన అవగాహన అప్పుడే చాలామందికి కలిగింది.

చాలా ప్రదేశాల గురించి వినడమే గానీ ప్రత్యక్షంగా చూసి ఉండము. అలాటి ప్రదేశాల గురించి, మన హస్త కళల గురించి, భారత గ్రామ క్రీడల గురించి, మన కళల గురించి, వాయిద్య పరికరాల గురించి, నాట్య రీతుల గురించి, చేతి వృత్తుల గురించి, ప్రత్యేక వ్యక్తుల గురించి, పేరు పొందిన కళాకారుల గురించి, మన దేశంలో పరిఢవిల్లిన పురాతన నాగరికతల గురించి, పుణ్య స్థలాల గురించి, చారిత్రక కట్టడాల గురించి, కొన్ని ఊర్ల ప్రత్యేకతల గురించి, గ్రంధాలయాల గురించి, వస్తు ప్రదర్శన శాలల గురించి, చారిత్రక నగరాల గురించి, శత్రు దుర్భేద్యమైన కోటల గురించి, రకరకాల ప్రాంతీయ వంటకాల గురించి, తర తరాలుగా వస్తున్న మన సాంప్రదాయ వైద్య పద్ధతుల గురించి, వివిధ వినూత్న సమకాలీన ప్రదర్శనల గురించి, సాంకేతికత సహాయం ద్వారా సాంస్కృతిక పరిరక్షణ గురించి, పర్యావరణ పరిరక్షణ మన పూర్వకాలం నుంచీ ఎలా జరిగేదో చెప్పి దాన్ని ప్రస్తుతం కొనసాగించడం గురించీ, అనేక ప్రతేక బహుమతుల ప్రదానోత్సవాల గురించీ, అనేక సంగీత, నాట్య, సాంస్కృతిక ఉత్సవాల గురించీ, వీధుల్లో జరిగే విపణుల గురించీ, కళల్ని ప్రోత్సహిస్తున్న/ నేర్పిస్తున్న సంస్థల గురించీ, .....మనం మరచిపోతున్న మన సాంస్కృతిక వారసత్వ సంపద గురించి... ఇలా ఒకటేమిటి, అదొక సంపూర్ణ భారతీయ కళా సాంస్కృతిక వాహిని. మన గురించి మనం గర్వపడడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయో అన్నిటినీ "సురభి" కార్యక్రమం చూపించిందంటే అతిశయోక్తి కాదు.

నా మటుకు నాకు ఈ కార్యక్రమంలో చూసి, మరచిపోలేని అంశాలెన్నో ఉన్నాయి. మచ్చుకు కొన్ని - మన సురభి నాటక పరిషత్తు. పోచంపల్లి చీరలు, కేరళ గురించిన ఎన్నో విశేషాలు, మాండలిన్ శ్రీనివాస్ తో ఇష్టాగోష్టి, హంపి లో సప్త స్వరాలు పలికే స్తంభాలు, కడలి లో మునిగిన ద్వారకా నగరం, ఉంగరంలో అమాంతమూ దూరిపోయే పచ్ మినా శాలువాలు, టూరిజం వారి ప్రత్యేక రైలు "ప్యాలెస్ ఆన్ వీల్స్", రుచికరమైన బెంగాలీ వంటకం "రసగుల్లా" తయారీ, అప్పుడప్పుడే పైకి వస్తున్న రెహమాన్ పై ప్రత్యేక కార్యక్రమం, మన పురాతన విశ్వవిద్యాలయాలు నలంద, నాగార్జునకొండ, రాజస్థాన్ లోని వివిధ ప్రదేశాలు, మహళ్ళు, లిజ్జత్ అప్పడాలు, తేయాకును రుచిని బట్టి విభజించడం, మన కలంకారీ, సుస్మితా సేన్ తో ముఖాముఖి, కేరళ యుద్ధకళ కలారిపయట్టు, హైదరాబాదు చేప మందు, ఇలా ఒకటేమిటి.... ఎన్నో, ఎన్నెన్నో విశేషాలు.

చాలా విషయాలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల గురించి, ఈశాన్య/తూర్పు రాష్ట్రాలకీ, దక్షిణ భారతానికీ ఉన్న సారూప్యతల గురించీ తెలీని విషయాలు ఎన్నో సురభి ద్వారా తెలిశాయంటే అతిశయోక్తి కాదు. మన దేశంలోని వివరాలనే కాక మన సంస్కృతికి దగ్గరగా ఉండే అనేక విషయాలు - విదేశాలనుంచీ సైతం సేకరించి చూపడం సురభి ప్రత్యేకత. ముఖ్యంగా ఆసియా దేశాలైన శ్రీలంక, చైనా, జపాను, కొరియా, సింగపూర్, కంబోడియా, మొదలైన దేశాల వివరాలు చాలా బాగా తెలుసుకోడానికి సురభి చాలా దోహద పడిందని చెప్పవచ్చు.

అన్నిటికీ మించి ఆఖరున "సవాల్-జవాబ్" శీర్షికన ఒక ప్రశ్న అడిగేవారు. దానికి సమాధానం తెలిస్తే మాత్రం తప్పక వ్రాసేవారం. ఇక రెండువారాల తరువాతి భాగంలో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేవారు. సమాధానాలు వ్రాసిన వాళ్ళను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసేవారు. వారికి మన దేశంలో ఎక్కడినుంచీ ఎక్కడికైనా రానూ పోనూ ఇద్దరికి విమాన చార్జీలు, ఐ. టి. డి. సి. వారి హోటళ్ళలో రెండురోజుల ఉచిత మకాం బహుమతిగా ఇచ్చేవారు. (మేము సరైన సమాధానం రాసిన ప్రతీసారీ విమానం ఎక్కినట్లే ఫీల్ అయిపోయేవాళ్ళం - చివరికి మాకు ఎప్పుడూ బహుమతి రాలేదు :-) ).

దశాబ్దం పాటు వచ్చిన ఈ కార్యక్రమం గురించి ఒక్క టపాలో వివరించడం చాలా కష్టం. కానీ చివరగా సురభి కార్యక్రమాల వివరాలు మళ్ళీ చూడాలనుకునేవారికి సురభి కార్యక్రమానికి సంబంధించిన లంకె ఇస్తున్నాను. ఇందులో ప్రతీ భాగం గురించిన వివరాలు ఉన్నాయి.

http://www.indiasurabhi.com/surabhi01.html

మన ఘన వారసత్వ సంపదని ప్రపంచానికి గర్వంగా చూపిన సురభి మళ్ళీ కొత్త రూపు సంతరించుకొని మన ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ -

సురభి బృందానికి కృతఙ్ఞతలు అర్పిస్తున్నాను.