Saturday, 31 July 2010

తేట తెలుగు

తెలుగు, భారత దేశములోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు అధికార భాష, మరియు దాని ప్రక్క రాష్ట్రములయిన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, చత్తీస్ గఢ్ ప్రజలు మాట్లాడే భాష. ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడే వాటిలో పదిహేనవ స్థానములోనూ, భారత దేశములో రెండవ స్థానములోను నిలుస్తుంది. ప్రపంచంలో అచ్చులతో అంతమయ్యే కేవలం 5 భాషల్లో తెలుగు ఒకటి. మధురమైన మంజులకర కోమల భాష మన తెలుగు. సుమధురమైన భాషగా, సంగీత తుల్యమైన భాషగా తెలుగు కవులచేతనేగాక, ఎందరో ఇతరభాషల కవుల, విద్వాంసులచే "తేనె కన్న తీయనిది"గా, చెవులకు ఇంపైన భాషగా పొగడబడ్డ భాష మన తెలుగు భాష. మన భాషని గురించి ఎందరో మహానుభావులు ఏమన్నారంటే....

దేశ భాషలందు తెలుగు లెస్స —శ్రీ కృష్ణదేవ రాయలు"..

..సుందర తెలుంగినిల్ పాట్టిసైతు తోనిగల్ ఓట్టి విళయాడి వరువోం.."(..సుందర తెలుగులో పాటలు పాడుతూపడవల్లో యాత్రా కేళికి వెళ్ళొద్దాం.) — తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి.15 వ శతాబ్దం నుంచీ పాశ్చాత్యులచే "తెలుగు - ఇటాలియన్ అఫ్ ద ఈస్ట్ " గా కీర్తించబడ్డ భాష.

ప్రాచీన భాషగా ప్రస్తుతం గుర్తింపబడ్డ తెలుగు భాషకి దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర ఉన్నదని చరిత్రకారులు, భాషా పరిశోధన కారులూ చెప్తున్నారు. వేల ఏళ్ళనించీ వాడుకలో ఉన్న తెలుగు భాషకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రాచీన హోదా ఇవ్వడం నిస్సందేహంగా తెలుగు భాషాభిమానులందరికీ ఎంతో సంతోషకరమైన విషయం.

వివిధ అలంకారాలు నిండిన చందోబద్ధమైన పద్యం మన సొంతం. అవధానం తెలుగు భాష ఇంటి పేరు. పద్య కవిత తో పాటు పద కవిత్వం వెల్లి విరిసి, కర్నాటక శాస్త్రీయ సంగీతాన్ని వేల వేల కీర్తనలతో సుసంపన్నం చేసిన వాగ్గేయకారులు తెలుగు వారు. వివిధ రకాల చందస్సులతో కూడిన పద్యం, గద్యం, దండకం, గేయం, నాటకం, జానపద సాహిత్యం, కధ, నవలిక, గల్పిక...ఇలా తెలుగు సాహిత్యంలో ఉన్నన్ని ప్రక్రియలు మరే భాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదేమో...!! కీర్తన, సంకీర్తన, పదం, కృతి, యక్షగానం, కావ్యం, ప్రబంధం, శతకం అనేవెన్నో తెలుగు భాషలో వెన్నెలలు వర్షింప చేసాయి. భారత భాషల్లో తెలుగు భాషకు అత్యంత విలువను కొని తెచ్చాయి.

సంగీతాత్మకమైన భాషగా ఎందరో సంగీత విద్వాంసులచే మన్ననలు పొందిన భాష తెలుగు. తెలుగు భాష లో 56 అక్షరాలు - ప్రాచీన భాషగా ఎప్పటినుంచో గుర్తింపు ఉన్న సంస్కృతం లో కూడా అన్ని అక్షరాలు లేవు. తెలుగు వారిగా పుట్టడం మనం ఎంతో గర్వించాల్సిన విషయం. ప్రపంచ సాహిత్య రంగంలో అయిదవ స్థానంలో ఉజ్వలంగా ఒక్క వెలుగు వెలిగిన తెలుగుభాష, నేడు తన అస్థిత్వాన్నే కోల్పోతూండడం ఎంతో బాధాకరమైన విషయం. మన ఉద్యోగ అవసరాలకి ఎన్ని భాషలని నేర్చుకున్నా, మన మాతృభాష ని మరచిపోకుండా కాపాడి, ముందు తరాల వారికి మన తెలుగు సాహితీ సుగంధాన్ని పంచాలి.

స్వాతంత్ర్యానికి పూర్వం ఆంగ్లేయులు జిల్లా అధికారులుగా నియమించబడాలంటే హిందీ లేక తెలుగు ఈ రెండు భారతీయభాషల్లో ఒకటి తప్పనిసరిగా నేర్చుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉండేవి. ఆ రోజుల్లో ఉత్తర భారత దేశానికి హిందీ ఎలాగో దక్షిణ భారత దేశంలో తెలుగు అలా వాడుకలో ఉండేది. మరి నేటి పరిస్థితి చూస్తే అదంతా పూర్తిగా మారిపోయింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల ఎక్కువగా నష్టం జరిగింది తెలుగు వారికే. తెలుగు వారు ఉంటూన్న దాదాపు 10 జిల్లాలు పొరుగు రాష్ట్రాల వారికి వెళ్ళిపోయాయి. అక్కడ తెలుగు బడులు లేని దుస్థితి చూస్తే చాలా బాధ కలుగక మానదు. (ఇటీవలి కాలంలో తమిళనాడు లోని కృష్ణగిరి జిల్లాలో తెలుగు భాష కోసం తెలుగు వారు పోఋఆడడం అందరికీ తెలిసిందే!) పద్యం మన సొంతం అని చెప్పుకుంటూ ధాటిగా ఒక్క పద్యాన్ని కనీసం చూసి చదవలేని దుఃస్థితి లో చాలామందిమి తెలుగు వాళ్ళం ఉండడం ఎంతో దురదృష్టకరం. వెలలేని మన సాహితీ సంపదను మన పెద్దలు ఎంతో శ్రధ్ధతో కాపాడుకుంటూ వచ్చారు. కనీసం కాసిని వేమన పద్యాలూ, కొన్ని సుమతీ పద్యాలూ, పోతన భాగవతంలో గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరితం, రుక్మిణీ కళ్యాణం ఘట్టాల్లోని కొన్ని పద్యాలైనా తెలుగు వారి నాలుకలమీద నాట్యమాడేవి. మరి నేడో? --- వేగంగా అంతరించిపోతున్న భాషల్లో తెలుగు కూడా ఒకటి. ఈ పరిస్థితి చెయ్యి దాటకముందే మన భాషని, మన సాహితీ సంపదని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిదీ ! మన భాషలోని సొగసును, మాధుర్యాన్ని చవి చూడక, చాలా మంది తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారు.

"తేనియలకే తీపి పెంచే తెలుగులో మాటాడుకో.

తెలుగు జాతి సమైక్య గీతి పదే పదే నువు పాడుకో.

ఏ ప్రదేశంలోన ఉన్నా ఏ విదేశంలోన ఉన్నా,

జీవనిదిగా నీకు మిగిలిన స్వీయ సంస్కృతి నిలుపుకో.

స్వాభిమానం కేతనంగా సామరస్యం స్యందనంగాతరలిపోతూ నిత్యనవ చైతన్య దీప్తిని పెంచుకో."

అన్న పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సి.నారాయణ రెడ్డి గారి సుమధుర భావాభిరామంతో మనందరం ఏకీభవిస్తూ అమ్మ భాషను ఆదరిద్దాం.

"గట్లనే" అని తెలంగాణా మాండలికంలో అన్నా, "అలగలగే" అని ఉత్తరాంధ్ర యాసలో చెప్పినా, "ఆయ్, అలాగేనండీ" అని గోదారి జిల్లాల యాసలో మాట్లాడినా, "అట్లాగే/ అట్టాగే" అని కృష్ణా/గుంటూరు మాండలికంలో నొక్కి వక్కాణించినా, "అట్నే" అని నెల్లూరు / చిత్తూరు ప్రాంతాల మాటల్లో తెలిపినా, "అట్లే" అని రాయలసీమ భాషలో నుడివినా, అది మన తెలుగు భాషలోని అందమే. పైన చెప్పిన అన్ని మాండలికాల్లో అన్నట్లు మనం "అలాగే" నని మన భాషా సేవకై ఏకీభవిస్తూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.

ఈరోజే గుల్మొహర్ బ్లాగులో తెలుగు జాతీయత గురించి చదివాక నేను మా కార్యాలయంలో ప్రారంభించిన తెలుగు సాహితి అనే తెలుగు సాహితీ సమాఖ్య ఆహ్వానంలో తెలుగు గురించి రాసిన నాలుగు మాటలు మీ ముందు ఉంచాలని అనిపించింది. చంద్రచూడ్ శాండిల్య గారికి ఈ విధంగా అభినందనలు తెలపాలని అనిపించింది.

Monday, 19 July 2010

వా .....! నా పన్ను పీకేశారు !!

రెండు రోజులుగా తీవ్రమైన పన్ను నొప్పితో బాధపడుతూ - మొన్న డాక్టరు దగ్గరకి వెళ్లాను. పన్నుకి ఎక్స్ రే తీయించుకుని రమ్మన్నాడు. ఆ రాత్రికే బుగ్గ బూరెలా వాచిపోయింది. నిన్నసాయంత్రం ఎక్స్ రే తీసుకుని వెళ్ళాను. చావుకబురు చల్లగా చెప్పాడు మహానుభావుడు. మీ పన్ను ఆఖరి స్థితిలో ఉంది, పీకకపోతే, దానిలోని ఇన్ఫెక్షన్ మిగతా వాటికి సోకుతుంది. ఆఖరికి అన్నీ పోతాయి అన్నాడు. ఇక చేసేదేముంది, ఒక పన్ను కోసం అన్నిటినీ పోగొట్టుకోలేము కదా, బయట కూర్చొని ఉన్న మా వారిని పిలిచి, పక్కన కూచోబెట్టుకుని, పీకేయి..... అన్నాను. అన్నానే గానీ, ఎంత బాధో అప్పుడు తెలీలేదు. కాస్త కెలికి, లోపలి చీము అంతా తీసాక ఒక పట్టకారుతో పన్ను పీకాడు. (అప్పటికీ ఎనస్థీషియా ఇచ్చాడు - కానీ పని అది పూర్తిగా పని చేయదని కూడా చెప్పాడు హీ ... హీ.. ) బాబోయ్ ..... ఆ పది క్షణాలూ చచ్చి బతికాననుకోండి. అమ్మో... పిల్లలు పుట్టినపుడు ఆపరేషనులు అయినా ఇంత నొప్పి కలగలేదు ! అదే మాట డాక్టరుతో అంటే, గుండె పోటు కన్నా చాలా రెట్లు ఎక్కువైనది పన్ను పోటు అని చెప్పాడు నవ్వుతూ.... !! (అయినా పన్ను పీకేవాడికేం తెలుస్తుంది - పీకించుకునేవారి నొప్పి!!) రాత్రి అంతా నొప్పి. మా పాప కి పాలు కూడా అర్ధరాత్రి వరకూ ఇవ్వలేక పోయాను. ఇప్పుడు కధ ఏమిటంటే, మూడు రోజులు నేను ఏమీ తినకూడదు. కేవలం ఐస్ క్రీము / చల్లని పాలు మాత్రం తీసుకోమన్నాడు. ఫామిలీ పాక్ తెచ్చి పెట్టారు. మా వారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. అందువల్ల బ్లాగు మిత్రులారా, పన్ను నొప్పిని అస్సలు అశ్రద్ధ చేయకండి. లేకుంటే పన్ను కే మోసం వస్తుంది. నాలా మీరు ఎవ్వరూ పన్ను కోల్పోకూడదని ఆశిస్తూ - మళ్ళీ ఒకసారి అందరికీ జాగ్రత్త చెబుతున్నాను.

Tuesday, 13 July 2010

నేతి బొట్టు

అన్నం లోకి ఎంత మంచి ఆధరువులు ఉన్నప్పటికీ, ఒక్క నేతి బొట్టు అలా మెతుకులమీద పడనిదే - ముద్ద దిగదు నాకు. కొందరికి పచ్చళ్ళలో నూనె వేసుకుని తినే అలవాటు ఉంటుంది - కానీ అదేమిటో, మనకి నూనె తిరగమోత పెట్టినా, మళ్ళీ నెయ్యి పడాల్సిందే. చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని నేను. కానీ నెయ్యి అలా తింటూ ఉంటే - గుమ్మం పట్టకుండా తయారు అవుతానని వెక్కిరించేవారు నన్ను. పొరపాటున ఇంట్లో నెయ్యి అయిపోయిందా, ఆరోజు అన్నమే సహించేది కాదు. మా అమ్మమ్మ - నిన్ను నేతి బొట్టు సాయిబు కి ఇచ్చి పెళ్ళి చెయ్యాలే అని నవ్వుతూ ఉండేది. ఇంట్లో పాడి ఉండే వారికి నెయ్యీ, వెన్నా, మీగడా అలవాటు ఉండడం సహజం. నగరంలో పుట్టి పెరిగిన నాకు అవన్నీ లేకున్నా, మా ఇంట్లో ఎప్పుడూ బఱ్ఱెపాలు పోయించుకునే అలవాటు ఉండబట్టి, కాస్తో కూస్తో మంచి పాల ఉత్పత్తుల వాడకంతో పెరిగాము. నెయ్యికి మా ఇంట్లో నాతో మా చిన్న తమ్ముడు పోటీ పడేవాడు. ఏ విషయంలో నైనా సర్దుకునేదాన్ని కానీ నెయ్యి విషయంలో మాత్రం అస్సలు ఊరుకునేదాన్ని కాను. మా చుట్టాలు ఎవరి ఇంటికి వెళ్ళినా, బాగా నెయ్యి వేసి అన్నం పెట్టిన వాళ్ళే గొప్ప నాకు ! పిసినారి తనం చూపించకుండా మా మేనత్త వాళ్ళ ఇంట్లో, మా వెంకటలక్ష్మి అత్త వాళ్ళ ఇంట్లో మాత్రం మంచి నెయ్యి ఉండేది. ఇక మా అమ్మమ్మ వాళ్ళ పుట్టిల్లు చాలా పల్లెటూరు. అక్కడికి వెళ్ళామంటే పండగే పండగ. నెయ్యి, వెన్న, మీగడ పెరుగు - అన్నీ దండిగా తినేవాళ్ళం. మా అవ్వ (అమ్మమ్మ వాళ్ళ అమ్మ) మాకు మంచి నెయ్యి దొరకదని, అది పనిగా ఊరంతా గాలించి, మంచి వెన్న కొని, నెయ్యి చేసి పంపేది. ఆ నెయ్యి వచ్చిన రోజు మాత్రం మా అమ్మ ఎంత నెయ్యి అడిగినా వేసేది.
నెయ్యి బజారులో రకరకాలు దొరుకుతున్నప్పటికీ, ఇంటిలో తయారు చేసిన నెయ్యి రుచే వేరు. మా ఇంట్లో చిక్కని బఱ్ఱె పాల వాడకం వల్ల పెరుగు పైన చాలా మీగడ కట్టేది. ఆ మీగడ తీసిపెట్టి 4,5 రోజులకి ఒకసారి మజ్జిగ చిలికి, వెన్న తీసేది మా అమ్మ. వెన్న తీయగానే మొదట నిమ్మకాయంత వెన్నపూస మా ఇంట్లో కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి, మిగతాది కాచి నెయ్యి తయారు చేసేది. ఇక అన్నం తినడానికి తొందర పడేవాళ్ళం. ఎవరు ముందు తింటే వారికే వెన్న ముద్ద దక్కుతుందని! కానీ మా అమ్మ అందులోనూ భాగాలు పెట్టి, నాకూ మా తమ్ముళ్ళకీ సమానంగా కొంచెం కొంచెం పెట్టేది. ఆ రోజులు తలచుకుంటే ఇప్పటికీ నోరు ఊరుతుంది. మా ఇంట్ళో ఎప్పుడూ 2,3 రకాల పచ్చళ్ళు ఉండేవి - చద్దెన్నం లో పచ్చళ్ళు వేసుకుని, నెయ్యితో కలిపి తింటే - ఆ రుచే వేరు. సహజంగా మాకు తిఫ్ఫిన్ అలవాటు లేదు. నాలుగు పూటలా అన్నమే (బ్రేక్ఫాస్ట్, లంచ్, సాయంత్రం స్నాక్స్, దిన్నర్) తినేవాళ్ళం. కానీ నెయ్యి తోడుగా - ఏ ఊరగాయో పచ్చడో ఉంటే అదే చాలు ... పెద్ద గిన్నెలో కలిపి మా అమ్మమ్మ అందరికీ ముద్దలు పెట్టేది. ఆ మజా ఇప్పటి పిల్లలు నిజంగా అనుభవించట్లేదు. వాళ్ళ చుట్టూ అన్నం తినండిరా అని తిరగడమే సరిపోతోంది కానీ, తిండి దగ్గర మహా పేచీలు పెడుతున్నారు.
నెయ్యి సంగతి ఎలా ఉన్నా, కొన్ని పచ్చళ్ళలో మటుకు వెన్న పూస నంజుకుని తింటే మహదానందంగా ఉంటుంది, పచ్చిమిరపకాయల పచ్చడి, గోంగూర పచ్చడి, పండు మిరపకాయల కారం - వీటిల్లోకి వెన్న పూసే సెహబాసూ! అనిపించుకుంటుంది. మా అమ్మమ్మ చెప్పేది, వాళ్ళ చిన్నప్పుడు, సన్న అన్నం తినడం అంటే చాలా లగ్జరీ అని లెక్కట! జొన్న అన్నం, వరిగె అన్నం, సజ్జన్నం, సజ్జ రొట్టెలు - రోజు వారీ తినేవారుట. కానీ ఆ ఆహారాల్లోకి పచ్చళ్ళే కలుపుకునే వారట. అయితే కావలసినంత నెయ్యి / వెన్నపూస కూడా దట్టించే వారట. మరి ఇంక రుచిగా ఉండక చస్తున్నా మరి ... చెప్పండి? మరో విషయం కూడా ఉందండోయ్! గారెలు నూనెలో కాదు, నెయ్యిలో నే వేయించుకు తినేవారట! మరి అంత నెయ్యి తిన్నా వారికేమీ కాలేదంటే, ఆ రోజుల్లో చేసే శారీరక శ్రమ వల్ల కొవ్వు పేరుకు పోకుండా ఉండేది.
అప్పుడే రోట్లో నూరిన గోంగూర పచ్చడో, చింతకాయ పచ్చడో, కందిపొడి వేసి అన్నంలో కలిపి, దానికి రవ్వంత నెయ్యి చేరిస్తే ... ఆ రుచే వేరు. ఇక నిత్య ప్రసాదం ఆవకాయ ఉండనే ఉంది. పప్పూ + ఆవకాయ + నెయ్యి మన తెలుగు వారి ప్రత్యేక కాంబినేషన్ కదా! పచ్చళ్ళకే గానీ వేరే దేనిలోనూ నెయ్యి అక్కరలేదనుకుంటే - పప్పులో కాలేసినట్లే! పప్పులో నెయ్యి వేసుకుంటే మహ కమ్మగా ఉంటుంది. ఇక సాంబారులోనూ, చారులోనూ కాసింత నెయ్యి తగిలిస్తే బహు పసందు గా చవులూరిస్తుంది. మా అమ్మ చారుకి మటుకు తప్పని సరిగా నేతి తిరగమోత పెట్టేది.
టిఫిన్ల విషయంలోనూ నెయ్యి పాత్ర తక్కువేమీ కాదు. వేడి ఇడ్లీల పైన నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇక దోసెలు కూడా నెక్కితో కాలిస్తే మహా రుచిగా ఉంటాయి. మా నెల్లూరులో కారం + నెయ్యి దోసెలు చాలా ఫేమస్. ఇక నేతి పెసరట్టు మాట వేరే చెప్పాలా ? ఉప్పు పొంగలిలోనూ, ఉప్మాలోనూ పైన నెయ్యి వెయ్యనిదే అస్సలు బాగుండదు. చపాతీలు, పరాఠాలు కాలిస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. తిఫిన్లోకి వేసుకునే కారప్పొడిలోనూ, ఉల్లి/వెల్లుల్లి కారంలోనూ, అల్లంపచ్చడిలోనూ కాస్త నెయ్యి తగిలిస్తే అమృతంలా ఉంటుంది.
ఇక మిఠాయిల్లో నెయ్యి వాడనిదే అస్సలు రుచే రాదు - మా నాయనమ్మ మైసూరు పాక్ అద్భుతంగా చేసేది. ఇంట్లో వెన్న కాచిన కమ్మని నేతితో చేస్తే మరి ఎందుకు బాగుండదూ ? పరవాన్నం గిన్నెలో పైన నెయ్యి తేలాల్సిందే ! చక్కెర పొంగలి చేతికి అంటుకోకుండా ఉండేలా నెయ్యి పోయాల్సిందే! మరి బూరెలు, బొబ్బట్ల మాటో....? బూరెకి కన్నం చేసి, దానిలో నెయ్యి పోసుకుని తినాలని పాక శాస్త్రఙ్ఞుల ఉవాచ. బొబ్బట్లపైనా నెయ్యి వేసుకుని తింటే - ఆహా అదుర్స్, అనకుండా ఉండగలమా?
మంచి వెన్న కాస్తుంటే, ఆ కమ్మటి ఘుఘుమల సువాసనలకి జిహ్వ గ్రంధులకి ప్రాణం లేచి రాదా? వెన్న కాచిన తరువాత నెయ్యి అట్టడుగున పేరుకున్న గసి / గోకుడు కూడా చాలా మందికి ఇష్టం. దానిలో చక్కెర వేసుకుని తినేవాళ్ళం మేము.
మా ఇంటిలో ఇప్పటికీ వెన్న కాచిన నెయ్యే వాడతాము ! ఇంట్లో వెన్న చేయడం కుదరకపోతే - బజారులో దొరికే కొకింగ్ బటర్ అయినా తెచ్చి కరగబెట్టి నెయ్యి చేసుకుంటాము. నూక నూక గా పేరుకున్న నెయ్యిని వేడి వేడి అన్నంలో వేసుకుంటే, ఆ నెయ్యి అన్నం పిల్లలకి కూడా చాలా మంచిదంటారు.
నెయ్యి అభికరించకుండా దేవుడికి నైవేద్యం పెట్టకూడదు. పంచామృతాల్లో నెయ్యి ఒకటి. యఙ్ఞ యాగాదుల్లో ఆవు నేయ్యినే వాడతారు. పంక్తి భోజనాల్లో, ఆధరువులు అన్నీ వడ్డించి, అన్నం వడ్డించాక నెయ్యి వేయనిదే - భోజనాలు మొదలు పెట్టం కదా! ఆయుర్వేదంలో సైతం నెయ్యి తెలివి తేటల్ని పెంచుతుందనీ, మెదడు కి మంచిదనీ చెప్పారు. పైగా నూనె కన్నా, నెయ్యి వంటికి చాలా మంచిదని చెప్తారు. గర్భిణులు మొదటి ముద్దను నెయ్యితో తింటే మంచిదని అంటారు. గర్భంతో ఉన్నవారు తినే మొదటి ముద్ద బిడ్డకే పోతుందని, దాని వల్ల బిడ్డ మెదడు బాగా వికసిస్తుందని అలా పెద్దవాళ్ళు చెప్పారు. పాలిచ్చే తల్లులు కూడా నెయ్యి బాగా తింటే మంచిదని చెబుతారు.
సౌందర్య పోషణలోనూ నెయ్యి పాత్ర ఏమీ తక్కువ కాదండొయ్! బాగా తలకి నెయ్యి మర్దించి తరువాత తలస్నానం చేస్తే, జుట్టు పట్టులా మెరవడమే కాక, వంట్లో వేడి కూడా తగ్గుతుంది. ఇప్పుడు డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుంటున్నారు - నెయ్యి తింటే మొటిమలు వస్తాయని చాలా మంది మానేస్తున్నారు. కానీ కేవలం నెయ్యి మానేస్తే మొటిమలు తగ్గవు - హాయిగా నెయ్యి తినండి; కాకుంటే అవసరమైతే పరిమాణం కాస్త తగ్గించండి అంటాను నేను!
ఏ వంటకమైనా నేతితో చేస్తే దాని రుచే వేరు. హైదరాబాదు లో పేరు పొందిన వంటకం బిరియానీలో కూడా నెయ్యినే విరివిగా వాడతారు. సులభంగా చేసే సున్ని ఉండలు, ఎవైనా పిండిలడ్డూలకి మంచి నెయ్యి వాడనిదే కుదరనే కుదరదు! అలాగే కొన్ని కూరల్లోనూ నెయ్యి తో చేస్తే చాలా బాగుంటాయి. వెయ్యేల, నెయ్యి కి సమానమైనది మరొకటి లేదు, ఉండదు, ఉండబోదు కూడా!
మొత్తానికి ఈ టపాలో అందరినీ నెయ్యిలో వేపుకు తిన్నాను. మీరంతా నిత్యం నెయ్యిలో మునిగి తేలుతారని ఆశిస్తూ - సర్వం నెయ్యార్పణమస్తు!!