Monday 19 July 2010

వా .....! నా పన్ను పీకేశారు !!

రెండు రోజులుగా తీవ్రమైన పన్ను నొప్పితో బాధపడుతూ - మొన్న డాక్టరు దగ్గరకి వెళ్లాను. పన్నుకి ఎక్స్ రే తీయించుకుని రమ్మన్నాడు. ఆ రాత్రికే బుగ్గ బూరెలా వాచిపోయింది. నిన్నసాయంత్రం ఎక్స్ రే తీసుకుని వెళ్ళాను. చావుకబురు చల్లగా చెప్పాడు మహానుభావుడు. మీ పన్ను ఆఖరి స్థితిలో ఉంది, పీకకపోతే, దానిలోని ఇన్ఫెక్షన్ మిగతా వాటికి సోకుతుంది. ఆఖరికి అన్నీ పోతాయి అన్నాడు. ఇక చేసేదేముంది, ఒక పన్ను కోసం అన్నిటినీ పోగొట్టుకోలేము కదా, బయట కూర్చొని ఉన్న మా వారిని పిలిచి, పక్కన కూచోబెట్టుకుని, పీకేయి..... అన్నాను. అన్నానే గానీ, ఎంత బాధో అప్పుడు తెలీలేదు. కాస్త కెలికి, లోపలి చీము అంతా తీసాక ఒక పట్టకారుతో పన్ను పీకాడు. (అప్పటికీ ఎనస్థీషియా ఇచ్చాడు - కానీ పని అది పూర్తిగా పని చేయదని కూడా చెప్పాడు హీ ... హీ.. ) బాబోయ్ ..... ఆ పది క్షణాలూ చచ్చి బతికాననుకోండి. అమ్మో... పిల్లలు పుట్టినపుడు ఆపరేషనులు అయినా ఇంత నొప్పి కలగలేదు ! అదే మాట డాక్టరుతో అంటే, గుండె పోటు కన్నా చాలా రెట్లు ఎక్కువైనది పన్ను పోటు అని చెప్పాడు నవ్వుతూ.... !! (అయినా పన్ను పీకేవాడికేం తెలుస్తుంది - పీకించుకునేవారి నొప్పి!!) రాత్రి అంతా నొప్పి. మా పాప కి పాలు కూడా అర్ధరాత్రి వరకూ ఇవ్వలేక పోయాను. ఇప్పుడు కధ ఏమిటంటే, మూడు రోజులు నేను ఏమీ తినకూడదు. కేవలం ఐస్ క్రీము / చల్లని పాలు మాత్రం తీసుకోమన్నాడు. ఫామిలీ పాక్ తెచ్చి పెట్టారు. మా వారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. అందువల్ల బ్లాగు మిత్రులారా, పన్ను నొప్పిని అస్సలు అశ్రద్ధ చేయకండి. లేకుంటే పన్ను కే మోసం వస్తుంది. నాలా మీరు ఎవ్వరూ పన్ను కోల్పోకూడదని ఆశిస్తూ - మళ్ళీ ఒకసారి అందరికీ జాగ్రత్త చెబుతున్నాను.

5 comments:

Overwhelmed said...

pannu ventana teeyakapothe migilinavi kuda potayi annadi correct kaadandi. Intection ki mandu istaru. Naku ila ayindi, anni pallu unnayi, emi kaaledu.

మాలా కుమార్ said...

అయ్యో పాపం పన్ను పీకేసారా . ఎంతపని జరిగింది .

పోనీలెండి ఐస్ క్రీం బాగా లాగించేయండి . మంచి తరుణం మించిన దొరకు .

విరజాజి said...

బేబీ గారూ -- తప్పదు కనుకే పన్ను తీయించుకున్నానండీ!

మాలా కుమార్ గారూ - నాకన్నా మావారూ, మా అబ్బాయీ బ్రహ్మాండంగా ఐస్ క్రీం లాగించేస్తున్నారండీ

Anonymous said...

అదృష్టవంతులండీ మీరు . పన్ను నొప్పని వెళితే మన ఆస్తంతా తరిగిపోయేవరకూ తిప్పించుకుని తమకొచ్చిన అన్ని రకాల ట్రీట్మెంట్లూ ( సిమెంటు కాంక్రీటు వగైరాలు కూరేపని) చేసి ఎప్పుడో చివర్న మనకి విసుగొచ్చి మరో డాక్టర్ దగ్గరకి పోతాం అని బెదిరిస్తే తప్ప పీకని పన్ను మీకు మొదటిసారే పీకిపారేసాడంటే వాడెవడో బొత్తిగా బతకటం చాతకాని డాక్టర్లా వున్నాడు.

విరజాజి said...

అయ్యో లలిత గారూ, విషయం ఏమిటంటే, మరో రెండు పళ్ళూ పుచ్చిపోయాయి, వాటికి సిమెంటూ, గట్రా వేయాలి అన్నాడండీ! ప్రస్తుతం ఒక పన్ను పీకాక, మరో పన్ను బాగు చేసే పనిలో ఉన్నాడు. కాకుంటే - నా పన్ను పోయాక హైదరాబాదులో సందుకో డెంటల్ క్లినిక్ ఉండడం గమనించి, పన్ను పీకుడు లో హెంత లాభం ఉందో అర్ధం అయ్యింది. (అదే రోడ్డులో రోజూ పోతున్నా, నా పన్ను పోయాక గానీ డెంటల్ క్లినిక్కులని నేను చూడలేదన్నమాట :-) )