Tuesday 13 July 2010

నేతి బొట్టు

అన్నం లోకి ఎంత మంచి ఆధరువులు ఉన్నప్పటికీ, ఒక్క నేతి బొట్టు అలా మెతుకులమీద పడనిదే - ముద్ద దిగదు నాకు. కొందరికి పచ్చళ్ళలో నూనె వేసుకుని తినే అలవాటు ఉంటుంది - కానీ అదేమిటో, మనకి నూనె తిరగమోత పెట్టినా, మళ్ళీ నెయ్యి పడాల్సిందే. చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని నేను. కానీ నెయ్యి అలా తింటూ ఉంటే - గుమ్మం పట్టకుండా తయారు అవుతానని వెక్కిరించేవారు నన్ను. పొరపాటున ఇంట్లో నెయ్యి అయిపోయిందా, ఆరోజు అన్నమే సహించేది కాదు. మా అమ్మమ్మ - నిన్ను నేతి బొట్టు సాయిబు కి ఇచ్చి పెళ్ళి చెయ్యాలే అని నవ్వుతూ ఉండేది. ఇంట్లో పాడి ఉండే వారికి నెయ్యీ, వెన్నా, మీగడా అలవాటు ఉండడం సహజం. నగరంలో పుట్టి పెరిగిన నాకు అవన్నీ లేకున్నా, మా ఇంట్లో ఎప్పుడూ బఱ్ఱెపాలు పోయించుకునే అలవాటు ఉండబట్టి, కాస్తో కూస్తో మంచి పాల ఉత్పత్తుల వాడకంతో పెరిగాము. నెయ్యికి మా ఇంట్లో నాతో మా చిన్న తమ్ముడు పోటీ పడేవాడు. ఏ విషయంలో నైనా సర్దుకునేదాన్ని కానీ నెయ్యి విషయంలో మాత్రం అస్సలు ఊరుకునేదాన్ని కాను. మా చుట్టాలు ఎవరి ఇంటికి వెళ్ళినా, బాగా నెయ్యి వేసి అన్నం పెట్టిన వాళ్ళే గొప్ప నాకు ! పిసినారి తనం చూపించకుండా మా మేనత్త వాళ్ళ ఇంట్లో, మా వెంకటలక్ష్మి అత్త వాళ్ళ ఇంట్లో మాత్రం మంచి నెయ్యి ఉండేది. ఇక మా అమ్మమ్మ వాళ్ళ పుట్టిల్లు చాలా పల్లెటూరు. అక్కడికి వెళ్ళామంటే పండగే పండగ. నెయ్యి, వెన్న, మీగడ పెరుగు - అన్నీ దండిగా తినేవాళ్ళం. మా అవ్వ (అమ్మమ్మ వాళ్ళ అమ్మ) మాకు మంచి నెయ్యి దొరకదని, అది పనిగా ఊరంతా గాలించి, మంచి వెన్న కొని, నెయ్యి చేసి పంపేది. ఆ నెయ్యి వచ్చిన రోజు మాత్రం మా అమ్మ ఎంత నెయ్యి అడిగినా వేసేది.
నెయ్యి బజారులో రకరకాలు దొరుకుతున్నప్పటికీ, ఇంటిలో తయారు చేసిన నెయ్యి రుచే వేరు. మా ఇంట్లో చిక్కని బఱ్ఱె పాల వాడకం వల్ల పెరుగు పైన చాలా మీగడ కట్టేది. ఆ మీగడ తీసిపెట్టి 4,5 రోజులకి ఒకసారి మజ్జిగ చిలికి, వెన్న తీసేది మా అమ్మ. వెన్న తీయగానే మొదట నిమ్మకాయంత వెన్నపూస మా ఇంట్లో కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి, మిగతాది కాచి నెయ్యి తయారు చేసేది. ఇక అన్నం తినడానికి తొందర పడేవాళ్ళం. ఎవరు ముందు తింటే వారికే వెన్న ముద్ద దక్కుతుందని! కానీ మా అమ్మ అందులోనూ భాగాలు పెట్టి, నాకూ మా తమ్ముళ్ళకీ సమానంగా కొంచెం కొంచెం పెట్టేది. ఆ రోజులు తలచుకుంటే ఇప్పటికీ నోరు ఊరుతుంది. మా ఇంట్ళో ఎప్పుడూ 2,3 రకాల పచ్చళ్ళు ఉండేవి - చద్దెన్నం లో పచ్చళ్ళు వేసుకుని, నెయ్యితో కలిపి తింటే - ఆ రుచే వేరు. సహజంగా మాకు తిఫ్ఫిన్ అలవాటు లేదు. నాలుగు పూటలా అన్నమే (బ్రేక్ఫాస్ట్, లంచ్, సాయంత్రం స్నాక్స్, దిన్నర్) తినేవాళ్ళం. కానీ నెయ్యి తోడుగా - ఏ ఊరగాయో పచ్చడో ఉంటే అదే చాలు ... పెద్ద గిన్నెలో కలిపి మా అమ్మమ్మ అందరికీ ముద్దలు పెట్టేది. ఆ మజా ఇప్పటి పిల్లలు నిజంగా అనుభవించట్లేదు. వాళ్ళ చుట్టూ అన్నం తినండిరా అని తిరగడమే సరిపోతోంది కానీ, తిండి దగ్గర మహా పేచీలు పెడుతున్నారు.
నెయ్యి సంగతి ఎలా ఉన్నా, కొన్ని పచ్చళ్ళలో మటుకు వెన్న పూస నంజుకుని తింటే మహదానందంగా ఉంటుంది, పచ్చిమిరపకాయల పచ్చడి, గోంగూర పచ్చడి, పండు మిరపకాయల కారం - వీటిల్లోకి వెన్న పూసే సెహబాసూ! అనిపించుకుంటుంది. మా అమ్మమ్మ చెప్పేది, వాళ్ళ చిన్నప్పుడు, సన్న అన్నం తినడం అంటే చాలా లగ్జరీ అని లెక్కట! జొన్న అన్నం, వరిగె అన్నం, సజ్జన్నం, సజ్జ రొట్టెలు - రోజు వారీ తినేవారుట. కానీ ఆ ఆహారాల్లోకి పచ్చళ్ళే కలుపుకునే వారట. అయితే కావలసినంత నెయ్యి / వెన్నపూస కూడా దట్టించే వారట. మరి ఇంక రుచిగా ఉండక చస్తున్నా మరి ... చెప్పండి? మరో విషయం కూడా ఉందండోయ్! గారెలు నూనెలో కాదు, నెయ్యిలో నే వేయించుకు తినేవారట! మరి అంత నెయ్యి తిన్నా వారికేమీ కాలేదంటే, ఆ రోజుల్లో చేసే శారీరక శ్రమ వల్ల కొవ్వు పేరుకు పోకుండా ఉండేది.
అప్పుడే రోట్లో నూరిన గోంగూర పచ్చడో, చింతకాయ పచ్చడో, కందిపొడి వేసి అన్నంలో కలిపి, దానికి రవ్వంత నెయ్యి చేరిస్తే ... ఆ రుచే వేరు. ఇక నిత్య ప్రసాదం ఆవకాయ ఉండనే ఉంది. పప్పూ + ఆవకాయ + నెయ్యి మన తెలుగు వారి ప్రత్యేక కాంబినేషన్ కదా! పచ్చళ్ళకే గానీ వేరే దేనిలోనూ నెయ్యి అక్కరలేదనుకుంటే - పప్పులో కాలేసినట్లే! పప్పులో నెయ్యి వేసుకుంటే మహ కమ్మగా ఉంటుంది. ఇక సాంబారులోనూ, చారులోనూ కాసింత నెయ్యి తగిలిస్తే బహు పసందు గా చవులూరిస్తుంది. మా అమ్మ చారుకి మటుకు తప్పని సరిగా నేతి తిరగమోత పెట్టేది.
టిఫిన్ల విషయంలోనూ నెయ్యి పాత్ర తక్కువేమీ కాదు. వేడి ఇడ్లీల పైన నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇక దోసెలు కూడా నెక్కితో కాలిస్తే మహా రుచిగా ఉంటాయి. మా నెల్లూరులో కారం + నెయ్యి దోసెలు చాలా ఫేమస్. ఇక నేతి పెసరట్టు మాట వేరే చెప్పాలా ? ఉప్పు పొంగలిలోనూ, ఉప్మాలోనూ పైన నెయ్యి వెయ్యనిదే అస్సలు బాగుండదు. చపాతీలు, పరాఠాలు కాలిస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. తిఫిన్లోకి వేసుకునే కారప్పొడిలోనూ, ఉల్లి/వెల్లుల్లి కారంలోనూ, అల్లంపచ్చడిలోనూ కాస్త నెయ్యి తగిలిస్తే అమృతంలా ఉంటుంది.
ఇక మిఠాయిల్లో నెయ్యి వాడనిదే అస్సలు రుచే రాదు - మా నాయనమ్మ మైసూరు పాక్ అద్భుతంగా చేసేది. ఇంట్లో వెన్న కాచిన కమ్మని నేతితో చేస్తే మరి ఎందుకు బాగుండదూ ? పరవాన్నం గిన్నెలో పైన నెయ్యి తేలాల్సిందే ! చక్కెర పొంగలి చేతికి అంటుకోకుండా ఉండేలా నెయ్యి పోయాల్సిందే! మరి బూరెలు, బొబ్బట్ల మాటో....? బూరెకి కన్నం చేసి, దానిలో నెయ్యి పోసుకుని తినాలని పాక శాస్త్రఙ్ఞుల ఉవాచ. బొబ్బట్లపైనా నెయ్యి వేసుకుని తింటే - ఆహా అదుర్స్, అనకుండా ఉండగలమా?
మంచి వెన్న కాస్తుంటే, ఆ కమ్మటి ఘుఘుమల సువాసనలకి జిహ్వ గ్రంధులకి ప్రాణం లేచి రాదా? వెన్న కాచిన తరువాత నెయ్యి అట్టడుగున పేరుకున్న గసి / గోకుడు కూడా చాలా మందికి ఇష్టం. దానిలో చక్కెర వేసుకుని తినేవాళ్ళం మేము.
మా ఇంటిలో ఇప్పటికీ వెన్న కాచిన నెయ్యే వాడతాము ! ఇంట్లో వెన్న చేయడం కుదరకపోతే - బజారులో దొరికే కొకింగ్ బటర్ అయినా తెచ్చి కరగబెట్టి నెయ్యి చేసుకుంటాము. నూక నూక గా పేరుకున్న నెయ్యిని వేడి వేడి అన్నంలో వేసుకుంటే, ఆ నెయ్యి అన్నం పిల్లలకి కూడా చాలా మంచిదంటారు.
నెయ్యి అభికరించకుండా దేవుడికి నైవేద్యం పెట్టకూడదు. పంచామృతాల్లో నెయ్యి ఒకటి. యఙ్ఞ యాగాదుల్లో ఆవు నేయ్యినే వాడతారు. పంక్తి భోజనాల్లో, ఆధరువులు అన్నీ వడ్డించి, అన్నం వడ్డించాక నెయ్యి వేయనిదే - భోజనాలు మొదలు పెట్టం కదా! ఆయుర్వేదంలో సైతం నెయ్యి తెలివి తేటల్ని పెంచుతుందనీ, మెదడు కి మంచిదనీ చెప్పారు. పైగా నూనె కన్నా, నెయ్యి వంటికి చాలా మంచిదని చెప్తారు. గర్భిణులు మొదటి ముద్దను నెయ్యితో తింటే మంచిదని అంటారు. గర్భంతో ఉన్నవారు తినే మొదటి ముద్ద బిడ్డకే పోతుందని, దాని వల్ల బిడ్డ మెదడు బాగా వికసిస్తుందని అలా పెద్దవాళ్ళు చెప్పారు. పాలిచ్చే తల్లులు కూడా నెయ్యి బాగా తింటే మంచిదని చెబుతారు.
సౌందర్య పోషణలోనూ నెయ్యి పాత్ర ఏమీ తక్కువ కాదండొయ్! బాగా తలకి నెయ్యి మర్దించి తరువాత తలస్నానం చేస్తే, జుట్టు పట్టులా మెరవడమే కాక, వంట్లో వేడి కూడా తగ్గుతుంది. ఇప్పుడు డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుంటున్నారు - నెయ్యి తింటే మొటిమలు వస్తాయని చాలా మంది మానేస్తున్నారు. కానీ కేవలం నెయ్యి మానేస్తే మొటిమలు తగ్గవు - హాయిగా నెయ్యి తినండి; కాకుంటే అవసరమైతే పరిమాణం కాస్త తగ్గించండి అంటాను నేను!
ఏ వంటకమైనా నేతితో చేస్తే దాని రుచే వేరు. హైదరాబాదు లో పేరు పొందిన వంటకం బిరియానీలో కూడా నెయ్యినే విరివిగా వాడతారు. సులభంగా చేసే సున్ని ఉండలు, ఎవైనా పిండిలడ్డూలకి మంచి నెయ్యి వాడనిదే కుదరనే కుదరదు! అలాగే కొన్ని కూరల్లోనూ నెయ్యి తో చేస్తే చాలా బాగుంటాయి. వెయ్యేల, నెయ్యి కి సమానమైనది మరొకటి లేదు, ఉండదు, ఉండబోదు కూడా!
మొత్తానికి ఈ టపాలో అందరినీ నెయ్యిలో వేపుకు తిన్నాను. మీరంతా నిత్యం నెయ్యిలో మునిగి తేలుతారని ఆశిస్తూ - సర్వం నెయ్యార్పణమస్తు!!

10 comments:

Anonymous said...

బావుందండీ మీ నెయ్యి వ్యాసం :P వేడి వేడి ఇడ్లీ ని కరిగిన నేతిలో ముంచి, పంచదారలొ అద్దుకుని తినడం నా చిన్నప్పటి ఇష్టం.

sunita said...

చాలా బాగా రాసారు. అలాగే మీకు నెయ్యి అంటే ఎంత ప్రేమో, ఇష్టమో కూడా రాసారు. అర్జంట్గా ఈ టపా మొత్తం ఏదన్నా పేపర్ కి పంపించండి. చాలా బాగా రాసారు నెయ్యి గురించి అన్నీ మనకు తెలిసినవే ఐనా వాటిని వరసలో పెట్టిన తీరు బాగుంది.

విరజాజి said...

@ photodummy గారూ, @ సునీత గారూ,

నా నెయ్యి వ్యాసం మీకు నచ్చినందుకు చాలా ధన్యవాదాలండీ!

sravya said...

maadi kuda nellore
hotel venkata ramana lo Ghee+karam dosa super gaa vuntundi.
nenu vellina prati saari compulsary gaa tintanu

మధురవాణి said...

సునీత గారు నా బ్లాగులో లింక్ ఇవ్వడం వాళ్ళ మీ నెయ్యి పోస్టు చూసే భాగ్యం దక్కింది. సూపర్ గా రాసారండీ! :)
వీలుంటే నా నెయ్యి టపా చూడండి.
http://madhuravaani.blogspot.com/2010/10/blog-post.html

కొత్తావకాయ said...

నేతి బొట్టంత కమ్మగా చెప్పారు. చెప్పకేం.. నేతిని అస్వాదించడానికీ ఓ రుచీ, కళాహృదయం ఉండాల్లెండి. కొవ్వుకి భయపడి నాలిక కట్టేసుకొనే రోజులొచ్చేసాయ్. కలికాకం. ప్చ్..

విరజాజి said...

కొత్తావకాయ గారూ, ట్ గారూ, మధురవాణిగారూ ధన్యవాదాలండీ!!

మధురవాణిగారూ, నాన్యీఇ టపాకన్నా, మీ నెయ్యికధే మహ మధురంగా ఉందండీ!

కొత్తావకాయగారూ, మీతో కందిపొడిని జోడించి ఆ పై నెయ్యి వేసుకుంటే, స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాము సుమండీ!

అన్వేషి said...

చాలా అద్భుతంగా ఉంది మీ వివరణ! శ్రీశ్రీ గారన్నట్లు కాదేదీ బ్లాగ్గనర్హం గదా. నేతి సున్నుండలు మరచినట్లున్నారు. ప్రమో(మాకాదు)ద వసాత్తు మీనేతిలొ కన్నుపడిందీ రోజు.

అన్వేషి said...

చాలా అద్భుతంగా ఉంది మీ వివరణ! శ్రీశ్రీ గారన్నట్లు కాదేదీ బ్లాగ్గనర్హం గదా. నేతి సున్నుండలు మరచినట్లున్నారు. ప్రమో(మాకాదు)ద వసాత్తు మీనేతిలొ కన్నుపడిందీ రోజు.

విరజాజి said...

అన్వేషి గారూ -

మీ కన్ను కదండోయ్! చూపు విరిగి నేతిలో పడిందన్న మాట. ధన్యవాదాలు.