Thursday 16 December 2010

తెలుగు చేనేతలు - పోచంపల్లి

ఈ మధ్య అస్సలు నా టపాలే లేవు. మామూలుగానే నా బ్లాగు చదివే వారు అంతంత మాత్రం. ఇక ఈ మధ్య అస్సలు కుదరక ఏమీ రాయనేలేదు. ముఖ్యంగా నా 50వ టపా మంచి విషయంపైన రాయాలని ఇన్నాళ్ళూ ఆగిపోయాను. ఎలాగూ తెలుగు బ్లాగర్లందరమూ పుస్తక ప్రదర్శనలో కలుస్తాము కదా - అప్పుడు నా బ్లాగు పేరు చెబితే ఎవ్వరికీ గుర్తు రానేమో అని అనుమానం కూడా కాస్త కలిగింది కూడాను! దాని పర్యవసానమే ఈ టపా!

మన తెలుగు నేల చేనేతలకి పెట్టింది పేరు. ఇంతకు ముందు ఈ ఫాషను ప్రపంచం ఇంత లేని రోజుల్లో కూడ మన చేనేతలు ప్రపంచ ప్రసిధ్ధి పొందాయి. నా మటుకు నాకు అస్సలు ఇన్ని రకాల చేనేతలు మరో ఏ రాష్ట్రం లోనూ ఉన్నాయా అని సందేహం కలుగుతుంది అప్పుడప్పుడూ. కాస్తో కూస్తో వేరే రాష్ట్రాల నుంచీ మనకు తెలిసిన మంచి చేనేతలు ఉన్నా, మన వాళ్ళలా మాత్రం ఎవ్వరూ నేయలేరని నాకు చాలా నిశ్చిత అభిప్రాయం. పైగా చిన్నప్పటినుంచీ మా అమ్మమ్మ, నాయనమ్మ చేనేత చీరలే కట్టటం చూడటం వల్ల, అవంటే మరీ ఇష్టం పెరిగిపోయింది. ఎప్పుడో నేను చేనేత చీరలపై కవిత రాసి, మీ ముందు ఉంచిన టపా ఉన్నా, మళ్ళీ నాకు తెలిసిన చేనేతల గురించి వ్రాయాలనిపించింది. అలా మన సంస్కృతిలోని ఒక మంచి హస్తకళ గురించి చెప్పినట్లూ ఉంటుంది, నేతన్నల వెతలు చూసి, కాస్తైనా మన బాధ్యతగా, వారంలో ఒక రోజు మనం చేనేతలు ధరిద్దామని గుర్తు చేద్దామని అనిపించింది.ఒక్కో చేనేత గురించీ ఒక్కో టపా అవుతుందేమో అనిపించి ఈ టపాల పరంపరని మొదలు పెడుతున్నాను. కనీసం వారానికి ఒకటి అయినా రాద్దామని అనుకుంటుంటున్నాను.

మొదటగా నేను పోచంపల్లి చేనేతల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. మొదటగా పోచంపల్లినే ఎన్నుకోడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది. మన చేనేతల్లో మొట్ట మొదటగా పేటెంట్ హక్కులు పొందిన ప్రత్యేకత దీనికి ఉంది. అస్సలు ఆ నేతలో ఎన్ని పొందు పరుస్తారో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ రంగుల దారాల్లో నెమళ్ళు నర్తిస్తాయి. చిలుకలు నవ్విస్తాయి. ఏనుగులు గంభీరంగా నిలబడతాయి. పూవులు విరబూస్తాయి. ఆకులు రెపరెపలాడుతాయి. రకరకాల ఆకృతులు మన ముందు ఆవిష్కరింపబడతాయి. భారీ జరీలు నిండిన చీరలకు విరుధ్ధంగా, రంగుల మాయాజాలానికే ప్రాధాన్యత ఉంటుంది.

బట్టలు నేసిన తరువాత రంగులద్దడం చాలా సులువు. కానీ పోచంపల్లి నేత ప్రత్యేకత ఏమిటంటే, నేయడానికి తీసి పెట్టుకున్న దారానికి రంగులద్ది, దాని తరువాత నేస్తారు. పడుగు, పేక సమంగా కలవకుంటే, ఆ అకృతి నేతలో రానే రాదు. చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రక్రియ కనుకనే పేటెంట్ లభించింది. వీటి ధరలు కూడా నేతలో ఆకృతులు పెరిగే కొద్దీ పెరుగుతుంటాయి. నూలు, పట్టు రకాలలో ఈ చేనేతలు అందుబాటులో ఉన్నాయి. మహిళల చీరల భండాగారంలో ఎన్ని రకాలు ఉన్నా, పోచంపల్లి పట్టుచీర లేకపోతే ఏదొ తక్కువైనట్లు భావించేవారు చాలా మంది తారసపడతారు. పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకే కాకుండా, రోజువారీగా కట్టుకోడానికి హుందాగా ఉంటాయని వీటిని ఎక్కువగా ఉద్యోగినులు ఇష్టపడటం కద్దు.

పోచంపల్లి మన భాగ్య నగరానికి చాలా చేరువలో ఉంది. హైదరాబాదు కి 50 - 60 కి.మీ. ల దూరంలో పోచంపల్లి గ్రామం ఉంది. మనం ఆ ఊరికి వెళ్ళి చేనేతలు కొనుక్కుంటే తక్కువలో లభిస్తాయని అంటారు. అస్సలు ఇలాటి ప్రదేశాలని మంచి పర్యాటక ప్రదేశంగా అభివృధ్ధి చేయవచ్చేమో అనిపిస్తుంది. మనం కట్టుకునే బట్టలు ఎంత కష్టపడి నేస్తే ఇంత అందంగా తయారు అయ్యాయో తెలుకునే అవకాశం కలుగుతుంది కదా!! పోచంపల్లి గ్రామానికి మరో విశిష్టత కూడా ఉంది. అది భూదాన్ ఉద్యమం తో ముడిపడి ఉంది. భూదాన్ ఉద్యమం ఇక్కడనుంచే ప్రారంభం అయినదానికి గుర్తుగా ఈ ఊరి పేరు "భూదాన్ పోచంపల్లి" గా మారిపోయింది. ఆచార్య వినోభా భావే మందిరం కూడా పోచంపల్లి లో ఉంది.

హైదరాబాదునుంచీ ఆటవిడుపుగా మౌంట్ ఒపేరా లేక రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలని వెళ్ళేవారు - అదే దారిని వెళ్ళి పోచంపల్లిని కూడా ఒకసారి చూసి రావచ్చు. అలాగే ఇంట్లో శుభకార్యాలేవైనా ఉంటే, పోచంపల్లి గ్రామానికే వెళ్ళి పట్టుచీరలు కొనుక్కురావచ్చు. మనం అక్కడ కొంటే చవకగా కొనుక్కోడమే కాకుండా దళారీలకి చెల్లించేది తగ్గి, నేతన్న కి కాస్త లాభిస్తుంది కదా!!

పోచంపల్లి చేనేతలంటే కేవలం చీరలే కాదండోయ్, డ్రస్ మెటీరియల్, కిటికీలకి ద్వారాలకీ తెరలు, దుప్పట్లు, దిండుగలీబులు, దీవాన్ పై పరిచేందుకు దుప్పట్లు, మగవారికి రక రకాల పట్టు చొక్కా గుడ్డలు, పోచంపల్లి నేత గుడ్డలతో కుట్టిన చేతి సంచులు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. "అవును - వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు" సినిమా సెట్టింగులో దుప్పట్లు, కర్టెన్లు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎంత బాగున్నాయో కదా! మరి, మిమ్మల్ని, మీ ఇంటిని అందంగా మార్చేయడానికి పోచంపల్లి ఎప్పుడు వెళ్తున్నారు?

1 comment:

రసజ్ఞ said...

చాల బాగా చెప్పారండీ! నాకు కూడా ఈ పోచెంపల్లి చీరలంటే ఇష్టం!