Monday 24 November 2008

తెలుగుదనపు చీరకట్టు

వెల కట్టలేని జలతారు జరీ నూలు నేత కళల వెంకటగిరి.

ముచ్చటైన నేత అల్లికల విరితావుల ఝరి మన మంగళగిరి.

కొత్త కొత్త అందాల కొంగొత్త చీరలకు పెట్టని కోట కొత్తకోట.

నాకంటే నాకంటూ అతివలు అడిగే చీర నారాయణపేట.

చీర ని తన పేరులోనే ఇముడ్చుకున్న చేనేత చీరాల.

ఘనమైన పట్టు సరసన నూలు చీరని నిలిపిన గద్వాల.

పోల్చలేని రంగుల సంకలితం వివిధ వర్ణాల పోచంపల్లి.

ధరలో లెక్కచెప్పలేని సంప్రదాయ మేళవింపు ధర్మవరం.

గంటలకొద్దీ చూడాలనిపించే వెలిసిపోని నేత చీర గుంటూరు.

పోరాట పటిమను పెంచి స్వాతంత్ర్యోద్యమానికి ఖద్దరునిచ్చిన పొందూరు.

పురి విప్పిన నెమలి నాట్యపు తళుకుల కోక పుట్టపాక.

ఉల్లము ఝల్లుమనే మెత్తటి మెరుపుల నేతల ఉప్పాడ.

లేశమైనా రసాయనాలు లేని ప్రకృతి సిద్ధ అద్దకాల లేపాక్షి.

కలల్లోని ఇంద్రధనుస్సులని కళ్ళముందు నిలిపే కళ కలంకారీ.

అన్నీ కలిసి భారతీయమంతా ఒక్కటిగా చుట్టే చక్కటి తెలుగుదనపు చీరకట్టు !

4 comments:

Anonymous said...

చాలాబాగా చెప్పారు

Kottapali said...

ఇది మీర్రాసిందేనా? ఐతే అందుకోండి అభినందనలు. శ్రీపాదవారికి ప్రియమైన పుల్లంపేట జరీచీర కనబడదే? చీరల వెరైటీలతో పాటు తెలుగు మహిళల చీర ధారణ వెరైటీలని కూడా రాస్తే బాగుంటుంది.

Sky said...

శిరీష గారు,
చీర మీద మీ కవిత చాలా అందంగా వుంది. నా బ్లాగ్ లో నేను చీర మీద రాసినా ఇప్పుడు మీ "తెలుగుదనపు చీరకట్టు" ముందు నా "చీర" వెలవెల బోతుంది :( మీకు నా అభినందనలు. మీ బ్లాగ్ లోని అన్ని టపాలు చదివి మళ్ళీ రాస్తాను. అంతవరకు శలవు.


భవదీయుడు,

సతీష్ కుమార్ యనమండ్ర

విరజాజి said...

@లలితగారూ,

ధన్యవాదాలండీ ! చీరలంటే మనకి ప్రాణం లేచివస్తుంది కదండీ ఎంతైనా !!

@కొత్తపాళీ గారూ

మీరు చెప్పిన పుల్లంపేట జరీ చీర గురించి నాకు నిజంగా తెలీదండీ... కాకుంటే తెలిసిన పుల్లేటికుఱ్ఱు నేతచీర గురించి రాయలేకపోయాను. ఈసారి మన తెలుగు చేనేతలు కాకుండా, మొత్తం దేశంలో ఉన్న చేనేత చీరల గురించి రాద్దామని ఉంది. మీరు చెప్పినందుకైనా ఈసారి పుల్లంపేట జరీ చీర గురించి అందులో తప్పక రాస్తాను :-)

ఇక రక రకాల చీరకట్టు గురించి రాయాలని నాకూ ఉంది. కాస్త సమాచారం సేకరించి రాస్తాను. ధన్యవాదాలు.... ఒక టపా కి విషయాన్ని ఇచ్చారు.

@ సతీష్ గారూ

మగవారై ఉండి, మీరు చీర గురించి అంత చక్కగా రాసారు... మీకు ఎలా అభినందనలు చెప్పాలో తెలీక నేను ఈ కవిత రాసాను. మీ టపా చదివిన రోజు నేను పోచంపల్లి పట్టుచీర కట్టుకున్నాను.... మీరు చీరపై కట్టిన పాటల గురించి రాసారు... నేను చీరనే కట్టాను ..... అందుకని చీరలనే మాటలుగా అల్లిన కవిత మీముందు ఉంచాను.