Friday 13 August 2010

బంగారు 'కొండ' లు

కొన్నేళ్ళ క్రితం రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. ఊరంతా ఎక్కడ చూసినా నా అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళే ఉండేవారు. అక్కడక్కడా మా మధ్య కాస్త పచ్చదనంతో చిన్ని చెట్లు మొలిచినా, మా అందాలు పెరిగేవే కానీ తరిగేవి కావు. తమాషాగా పిల్లలు మా మీద ఎక్కి ఆడినప్పుడు మాకు కాలమే తెలిసేది కాదు.
మబ్బువారిందంటే చాలు - వాటిని ఆపడానికి మా పెద్దన్నలు పోటీ పడేవారు. మా మీదనిచీ జారుకుంటూ వర్షపు నీళ్ళన్నీ చెరువుల్లోకి చేరుతున్నపుడు మేము స్నానం చేసి ముఱికిని వదిలించుకున్నట్లు మెరిసిపోయే వారం. మా పై కూర్చొని పిల్లనగోవి వాయిస్తూ గొడ్లని కాసే పిల్లవాడు ఆనందించేవాడు. మా పై నిదురిస్తూ, పక్షులూ జంతువులూ సేద తీరేవి. మా లో ఉన్న గుహల్లో తలదాచుకోడానికి జంతు జాలమంతా పోటీ పడేది.

కదలకుండా నవ్వుతూ నిలబడ్డ మేమే ఈ ఊరికి అందమని సంతోషంతో తల మునకలయ్యే వాళ్ళం. మా పక్కనే పచ్చదనం. మా నీడన వెచ్చదనం. మా లోపల కఱకుదనం. మా మనసున మెత్తదనం. ఈ ఊరిని మేము అలంకరించేశం...! మాపై ఒక నవాబు అందమైన కోట కట్టాడు. మమ్మల్ని కలుపుతూ కోటగోడ కట్టాడు. మా సాయంతో పెద్ద బుఱుజులు కట్టాడు. మా పైకి ఎక్కడానికి శత్రువులు భయపడేవారు. మా కోట చరిత్ర వింటూ ప్రజలు తన్మయులయ్యేవారు.

చిన్నగా మనుషులు మారుతున్నారు. ఊరు పెద్దదవుతోంది. ఆహా నా ఊరు పెరుగుతోంది అని సంతోషిస్తున్నాము. కానీ మా సంతోషం ఎక్కువగా నిలవలేదు. మాపైన చిత్ర విచిత్ర భవంతులు వెలిసాయి. మాపై ఇళ్ళు కట్టడానికి కొద్ది కొద్దిగా మమ్మల్ని కరగించి వేశారు. ఊరిలో మనుషులు పెరిగారు - కానీ మా సంఖ్య తగ్గి చెఱువుల్లోకి నీళ్ళు చేరవేసే దారి లేక నీళ్ళు తగ్గాయి. చెరువుల్లో నీరు తగ్గితే - భూజలాల మట్టం తగ్గింది. చిన్న చిన్నగా చెఱువులు మాయమయ్యాయి - భూజలాలు పాతాళానికి పోయాయి. మరో పక్క చూస్తే మా పెద్దన్నలని నిలువునా ముక్కలు చేసి, ఆకాశ హర్మ్యాలు వెలుస్తున్నాయి.

మా బంధువర్గమంతా నిలువునా నిలబడలేక, ముక్కలు ముక్కలై, దిక్కులేని చావు చస్తున్నారు. మాతో అందాన్ని, అనుబంధాన్ని పెంచుకున్న ఊరు - మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతూంటే -మారు మాట్లాడకుండా ఒఱిగిపోతున్నాం. వేల సంవత్సరాల మా ఆయుష్షు ముగిసి - చివరికి మా ఊరి ఇళ్ళకి పునాదులౌతున్నాం. ప్రకృతి మాత మమ్మల్ని చూసి దుఃఖిస్తోంటే - నిశ్శబ్దంగా మలిగిపోతున్నాం. కానీ నాటికీ, నేటికీ ఒక్క మాట నిజం ! మావల్లే ఈ ఊరికి ఎనలేని అందం!

Thursday 12 August 2010

పంద్రాగస్టు

మా ఊర్ల నేను పుట్టినప్పటి సంది జూస్తున్న - గీ పంద్రాగస్టు దినమంటే మస్తు ఇష్టం అందరికీ. పోరల్లంత ఇస్కూలుకు వొయి జెండా వందనం జేస్తరు గానీ, తొవ్వ తొవ్వల, జాగ జాగల మొత్తం మా ఊర్ల జెండాలెగురుతయి. జెండా లేని చౌరస్త ఉండది. జెండా లేని పేట ఉండది. ఇగ జెండా వందనానికి మస్తుగ హిందీ పాటలన్ని లౌడు ఇస్పీకర్ ల వెట్టి అందరికీ ఇనిపిస్తం భీ.

ఇస్కూలుకు వొయి వచ్చె పొరల్లందరు ఒకటో రెండో జెండా వందనాల కాడ ఆగి, మిఠాయిలు దిన్నంకనే ఇంటికి వోతరు. గోర్నమెంట్ కొలువులున్న జాగల మొత్తం జెండాలెగిరేస్తరు. కానీ సదువులు లేని మా బస్తీలల్ల భీ అంతకన్న మంచిగ జెండాలెగిరేస్తరు. పండగ లెక్క మస్తు రంగు కాయిదాలు కడ్తరు. గాంధీ, నెహ్రూ, నేతాజీ, ఒక్కోసారి ఇందిరగాంధీ ఫోటలైనా జెండా తాన వెడ్తరు. అగ్గో ఎంత మంచిగ జేస్తరో మాటలాల్ల సెప్పలేము సూడున్రి.

నేను, మాయక్క, మాయన్న, మా తమ్మి అందరం గలిసి మా ఇంటితాన జెండా వందనానికి వొయెటోల్లము. జెండా ఎగిరేసినంక మేమందరం జనగనమన పాడెటొల్లం. తియ్య బూంది పాకిటు ఇచ్చెటోల్లు జెండా వందనమయినంక. ఇస్కూల్ల ఒక చాక్లెట్టు, రెండు బిస్కెట్లు ఇచ్చెటోల్లు. ఇస్కూలుకి మమ్ముల తెల్ల బట్టలేసుకొని రమ్మనెటోల్లు. మా పంతులమ్మలు భి అందరు తెల్ల చీరలే కట్టుకొని వచ్చెటోల్లు. ఇగ కొన్ని పెద్ద పెద్ద ఇండ్ల పైన భి జెండా ఎగిరేసేటోల్లు. మా ఇంటి పక్కన చంద్రయ్య తాత తప్పక జెండా ఎగిరేస్తుండే.

ఆ దినమంత ఒక ఆవేశం వచ్చెడిది. తెల్లోల్ల మీద మస్తు కోపం భీ వచ్చెడిది. గా తెల్లోడు మనల ఎంత సతాయించిన్రో అని మస్తు బుగులు వడెటోల్లం. దేసభక్తి పాటలన్ని ఇనెటోల్లం. పంద్రగస్టు, చబ్బీస్ జన్వరి గీ రెండు దినాలూ మా హైద్రబాద్ల మస్తు జేస్తరు. గా నిజాం కొడుకు సొసంత్రం వచ్చినంక గూడ మమ్ముల సొసంత్రం గ బత్కనియ్యలేదని - మన దేసంల జల్ది కల్వనియ్యలేదని, మన దేశంల కలిసిన సంది గిట్లనే సొసంత్రం పండగ - పందాగస్టు జేస్తున్నరట, మా పెద్దోల్లు జెప్పిన్రు. అందుకోసానికి అమ్మలారా, అయ్యలారా - మన దేసం గురించి గా ఒక్క దినమైన ఆలోచించుండ్రి.

Tuesday 3 August 2010

వేదన

బాధ, కోపం, ఉక్రోషం - ఏదీ చెయ్యలేని నిస్సహాయత! ఇలా ప్రతీదీ మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు జీవితం మీద విరక్తి పుడుతుంది. అలాటి సమయంలోనే అది డిప్రెషన్ కి దారి తీస్తుందనిపిస్తోంది. ఆ పరిస్తితి అనుభవిస్తేనే గానీ తెలియదు. ఆ బాధని వేరే ఎవ్వరికీ చెప్పుకోలేము కూడా!!

తెలీని బాధ నిరంతరం మెలిపెడుతూ ఉంటుంది.... తనివి తీరా ఏడవాలనిపిస్తుంది.... ఒక్కోసారి అస్సలు బ్రతకడం దేనికీ ...? చచ్చిపోదాంలే అనిపిస్తుంది... చచ్చి ఏమి సాధిస్తావూ అంటే... బ్రతికి ఇప్పుడు సాధిస్తున్నదేమైనా ఉన్నది కనుకనా అనిపిస్తుంది... బాధ ఎక్కువైన ప్రతీసారీ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ - ఆశ కల్పించుకుంటూ బ్రతుకుతున్నా, అన్ని సార్లూ మన మనసు మన స్వాధీనంలో ఉండదు కదా... అప్పుడప్పుడూ కొన్ని భావోద్వేగాలు అన్నిటినీ మించి మనసుని వేదనకి గురి చేస్తాయి .

మనసు బాధని అక్షర రూపంలో పెడితే - కాస్తైనా బరువు తీరుతుందని చిన్ని ప్రయత్నం చేస్తున్నా!! నాకై నాకు ఉన్న ప్రత్యేక నేస్తం నా బ్లాగే కదా అనిపిస్తుంది. మనలోకి మనం తొంగి చూసుకోవడం మనం అందరం ఎపుడో ఒక అపుడు చేసే పనే అని నా నమ్మకం .

బాధ బరువుని ఎడద మోయలేనపుడు -

వేదనా తాపాన్ని హృదయం భరించలేనపుడు -

ఆవేదనా భారాన్ని మనసు తట్టుకోలేనపుడు -

నేనొంటరినై చీకటి కుటిలో మగ్గి మగ్గి,

నిరంతరంగా కన్నీటి స్రవంతిలో కుంగి కుంగి,

చల్లటి పలకరింపే లేని వేసవిలో వేగి వేగి,

నిబిడ నిర్లిప్త నిరాశా నిస్పృహ నలిపివేస్తుంటే -

కలనైన కనుగొనని కలత కలచివేస్తుంటే -

అంతులేని గాఢ శూన్యం ఆవరిస్తుంటే -

వెళ్ళదీయలేని కాలం విసిగిస్తుంది.

చెప్పలేని మౌనం హింసిస్తుంది.

ఇంకెందుకీ బ్రతుకు అనిపిస్తుంది.