నిజం ఎప్పుడూ నిష్టూరం గానే ఉంటుంది కానీ నిజాన్ని మనం ఒప్పుకోక తప్పదు. పెళ్ళి ఆలస్యం అయితే మానవ సంబంధాలు దెబ్బతినడం సరే... పెళ్ళి అయ్యేదెప్పుడు, పిల్లలు పుట్టేదెప్పుడు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేదెప్పుడు....? ఈ కాలం ఆడపిల్లలకి చాలా మందికి ఈ విషయం అర్ధం కావడం లేదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినరు. సరే, పోనీ మరి చదువుకున్నారు కదా వారి జీవితాన్ని సరిగ్గా నిర్దేశించుకోగలుగుతున్నారా అంటే అదీ తక్కువే. వారికి ఉన్న స్వేచ్ఛని సరిగ్గా ఉపయోగించుకోలేక పోతున్నారు. నాకు ఫలానా డిగ్రీ ఉన్న వరుడినే తీసుకురమ్మని తల్లి తండ్రుల్ని అడగడం తప్పు కాకపోవచ్చు. కానీ కొన్ని పోకడలే చాలా విచిత్రం గా ఉంటున్నాయి. ఇంటరు / డిగ్రీ తప్పిన అమ్మాయిలు కూడా కనీసం పోస్ట్ గ్రాడుయేట్ కావాలని చెప్తూన్న సందర్భాలు చాలా ఉన్నాయి. తనకంటూ ఇష్టాలు ఉండడం మంచిదే కానీ ...అంత చదువుకున్న వాడు తనకు తగ్గ పిల్లని చేసుకోవాలని అనుకోవడం సహజమే అని ఈ కాలం అమ్మాయిలు అలోచించడం లేదు.
తన చుట్టూ జరిగే పరిణామాలు చూసి, తన స్నేహితురాళ్ళకి గొప్ప సంబంధాలు రావడం చూసి, చాలామంది అనవసరంగా పోలికలు పెట్టుకుని తనకీ అలా జరగాలని కోరుకోవడం నేను ఈ మధ్యనే కాస్త ఎక్కువగా చూస్తున్నాను. ప్రతీ తల్లిదండ్రులకీ తమ కూతురికి మంచి సంబంధాన్ని తెచ్చి పెళ్ళి చేయాలనే కోరిక ఉంటుందనీ, వాళ్ళ ఆర్ధిక పరిమితులకి లోబడి వాళ్ళు తమ ప్రయత్నాలు చేస్తున్నారనీ తెలీని అమాయకులు కాదు ఈ తరం అమ్మాయిలు. ఆడపిల్లలమై పుట్టినంత మాత్రాన మేమే ఎందుకు సర్దుకుపోవాలీ అంటూ వితండ వాదానికి దిగుతున్నారు. ఈ విషయంలో చదువుకోని లేక సంపాదనా పరురాలు కాని అమ్మాయిలు కూడా ఏమీ మినహాయింపు కాదు.
ఈ బ్లాగు చదివే వారిలో అమ్మాయిలు చాలామందే ఉంటారు. వారందరికీ అపార్ధం చేసుకోవద్దని మనవి. ఈ తరం లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా చదువూ, సంపాదనా పెరిగే కొద్దీ పెళ్ళి జరగడం కష్టం గా ఉంది. పాత పద్ధతుల్లో అయిన వారి సంబంధాలు కుదిరినన్నాళ్ళూ ఈ బాధలు తక్కువే అని చెప్పవచ్చు. మరీ జన్యు పరమైన సమస్యలు వస్తున్నాయనుకుంటే, పూర్తి దగ్గర సంబంధాలు చేసుకోకున్నా, కనీసం వేలు విడిచిన మేన మామల్నో, బావల్నో పెళ్ళి చేసుకోడానికి కూడా చాలా మంది సుముఖత వ్యక్తం చెయ్యడం లేదు. చుట్టాల్లో చేసుకోం అని చెప్పడం ఈ కాలంలో అబ్బాయిలకీ, అమ్మాయిలకీ ఇద్దరికీ సర్వ సాధారణమై పోయింది.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే తల్లిదండ్రులు ఆడ పిల్లల పెళ్ళిళ్ళు చేయ్యాలంటే మునుపు మంచి సంబంధం కుదిరితే చాలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి నచ్చిన సంబంధం పిల్లకి కూడా నచ్చేలా చూడు దేవుడా ! అనుకుంటున్నారు. ఒక పెళ్ళి సంబంధం ఇంటి దాకా పెళ్ళి చూపుల వరకూ రావడానికి ముందు ఎంత ఆందోళన పడతారో, ఆ సంబంధం గురించి తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారో అమ్మాయిలకి అనవసరం. అబ్బాయికి బట్టతల ఉన్నదనో, అబ్బాయి మరీ లావుగా ఉన్నాడనో, అబ్బాయి పొడుగు తక్కువనో (పూర్తిగా 5 అడుగులు ఎత్తు లేని అమ్మాయికి కూడా 6 అడుగులకి దగ్గరగా ఉండే పెళ్ళికొడుకే కావాలి !) కాబోయే అత్త మామలు చదువుకోని వారనో లేక పల్లెటూరి వాళ్ళనో, అబ్బాయి మరీ నల్లగా ఉన్నాడనో, అబ్బాయి ఉద్యోగం లేక అతను పని చేసే కంపెనీ మంచిది కాదనో, అబ్బాయికి బాధ్యతలు (ఇంటికి పెద్ద కొడుకు కావడమో, ఒకే కొడుకై ఎక్కువమంది అక్క చెల్లెళ్ళు ఉండడమో) ఎక్కువనో వంకలు పెట్టి పెళ్ళి దాకా వచ్చిన సంబంధాలని కూడా చిన్న చిన్న కారణాలతో చెడగొట్టుకుంటున్నారు. మళ్ళీ ఆ తల్లిదండ్రులకు త్రిప్పట, అలసట ! అక్కడక్కడా అరుదుగా చాలా ఎక్కువ కోరికలు పెట్టుకోకుండా, మితంగా కేవలం కావలసిన విషయాలు ... అంటే అబ్బాయి చదువు / ఉద్యోగం, అబ్బాయి గుణగణాలూ మాత్రమే చూసుకుని జీవిత సత్యాలకి దగ్గరగా అలోచించే అమ్మాయిలు కనిపిస్తారు. వారిలో చాలా మందికి చాలా మంచి సంబంధాలు కుదరడం నేను ఎరుగుదును. వయసు ఎక్కువయ్యేకొద్దీ పిల్ల పెళ్ళి కాలేదని తల్లిదండ్రులు బాధ పడడం తెలిసినా కూడా కొందరు అమ్మాయిలు వాళ్ళ మితి మీఱిన కోరికలతో ఏళ్ళపాటు సాగదీసి, ముఖ్యమైన జీవిత కాలాన్ని పోగొట్టుకొని, ఆఖరికి ముందు వచ్చిన సంబంధాలకంటే హీనమైన సంబంధాలు వచ్చినా ఇంక గత్యంతరం లేక ఒప్పుకుంటున్నారు ! ఈ సర్దుకోవడం ఏదో ముందే చేసి ఉంటే ఆన్ని ఎక్కువ రోజులైనా చక్కగా వైవాహిక జీవితాన్ని అనుభవించి ఉండేవారు కాదా ? అందుకే పెద్దలు ఏ వయసుకి ఆ ముచ్చట అన్నారు !!
అన్నీ అమ్మాయిల గురించే చెప్పి ఊరుకుంటే, ఈ కాలపు అబ్బాయిలంతా పాపం బాధ పడిపోతారు కదా.... ఇక వారి ప్రతాపాన్ని కూడా చెప్పవద్దూ ? కాస్త మంచి చదువూ, ఉద్యోగం ఉంటే చాలు...ఇక కోరికల చిట్టా పుట్టుకొస్తుంది. అమ్మాయి ఇలా ఉండాలి, అలా ఉండాలి..... అని ఊహల్లో బతుకుతూ ఉంటారు. ముందు "అందమైన" అమ్మాయి కావాలి (తాను పగలు చూస్తే రాత్రి కలలో కి వచ్చేంత భయంకరంగా ఉన్నా పరవాలేదు. ఆ అమ్మాయి ఎన్ని మంచి లక్షణాలున్నదైనా అందంగా ఉండకపోతే అస్సలు ఒప్పుకోరు). అందంగా ఉండడమే కాదు. అమ్మాయి ఉద్యోగం చెయ్యకపోయినా బాగా చదువుకొని ఉండాలి (అవసరమైనపుడు, తాను చెప్పినపుడు ఉద్యొగం చెయ్యడానికి అన్నమాట!) ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లైతే, ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేసే విధంగా ఉండాలి. ఆమె చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా తన మాటే వినాలి ....కట్నం విషయం లో వాళ్ళ అమ్మా నాన్నా చెప్పిన రేటుకు దగ్గరగా ఇచ్చే ఆర్ధిక స్తోమత ఉండాలి. తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి ...ఇంకా ఇలాటివి చాలా ఉన్నాయి. తనకి తగ్గట్టు మామూలుగా ఉన్న, తమకు తగ్గ సంబంధం దొరికితే చాలు... అమ్మాయి మన కుటుంబంలో కలిసిపోయేలా ఉండి, అర్ధం చేసుకునే అమ్మాయిలు చాలు అనుకునే అబ్బాయిలు కూడా ఉండకపోలేదు... కానీ సర్దుకుపోవడం శాతం అబ్బాయిల విషయంలో తక్కువే !! సర్డుకుపోమ్మని తమ అమ్మాయిలకి చెప్పినట్లుగా అబ్బాయిలకి హితబోధ చేసే తల్లిదండ్రులూ చాలా తక్కువగానే కనిపిస్తారు.
ఏది ఏమైనా ఈ కాలపు పిల్లల్ని పెంచడం ఒక ఎత్తూ, వాళ్ళ పెళ్ళి చేయడం మరో ఎత్తూ అయిపోయింది... అందుకే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు తమకి తాముగా ఎవరినైనా ఎన్నుకున్నారని తెలిసినపుడు అది కులాంతరమైనా, మతాంతరమైనా - వారితో పెళ్ళి చేయ్యడానికి సంసిధ్ధత వ్యక్తం చేస్తున్నారనిపిస్తుంది...!! అవును మరి..... ఎంతైనా కన్నవారు కదా - పిల్లల సంతోషం కంటే వారికి కావలసిందేముంటుంది ?
4 comments:
బాగా చెప్పారు.
good post
@ వికటకవి గారూ
@ బొల్లోజు బాబా గారూ
ధన్యవాదాలు.
1. అవునండి.. ప్రతీ అబ్బాయికి తను, వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి, అక్క అందరూ నల్లగా ఉన్నాసరె, తనకి మాత్రం ఎర్రగా ఉన్న అమ్మాయి కావాలి... ఈ విషయంలో కొంచెం కూడా స్వాభిమానం ఉండదు... మన రాష్ట్రంలో తక్కువ మంది అమ్మాయిలు అలా ఉంటారు అన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తారు...
2. తన ఎత్తు ఐదడుగుల ఐదంగుళాలైనా తనకి మాత్రం పొట్టి అమ్మాయి వద్దు... ఇందులోను స్వాభిమానం ఉండదు...
3. తన ఆస్తి తక్కువున్నా, తనకి మాత్రం ఎక్కువ ఆస్తి ఉన్న అమ్మాయి కావాలి
4. ఇంకా తన కన్న ఎక్కువ అర్హత ఉండకూడదు...
5. ఫాస్ట్గా అంటే ఏక్టివ్గా ఉండకూడదు...
ఇంక అమ్మాయిల విషయానికి వస్తే పైన చెప్పిన మొదటి 4 (ఎందుకో 1,3 అంశాలకి కొంచెం వెసులుబాటు కల్పిస్తారు అప్పుడప్పుడు) అంశాలతో పాటూ, 28 ఏళ్ళు వచ్చే సరికి ప్రతి పది మందిలో ఆరుగురుకి కొంచెమైన బట్టతల ఉంటుంది అనే నిజాన్ని గ్రహించకుండా, కేవలం కొంచెం బట్ట తల ఉంది అన్న కారణంతో మంచి మంచి సంభంధాలని వదిలేసుకుంటారు...
ఆ అమ్మాయి సంపాదిస్తునా లేకపోయినా మంచి సంపాదన ఉండాలి అబ్బాయికి...
ఈ మధ్య ఎవరిని కదిలించినా మహేష్ బాబు పేరు చెప్తున్నారు...
మెట్రోల్లొ మాత్రమే పని చెయ్యాలి...
ఇంకా మన తెలుగు వాళ్ళ కర్మ ఏంటంటే ఐతే బెంగులూరు, లేకపోతే విదేశం... హైదరాబాదు కూడా పనికి రాదు ( చుట్టాల తాకిడి ఎక్కువంట)... చెప్పుకోడానికి కూడా బాగోదంట!
అమ్మాయికి పని ఎక్కువైపోతుందంట!
ఇంకా చాలా సరదాగా ఉండాలి...
ఇంకేంటేంటో ఉంటాయి...
మొత్తానికి మా తరం వాళ్ళకి కాబోయే జీవిత భాగస్వామి మీద అంచనాలు గతం వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువైపోయాయి... గతంలో కుటుంబం, కొన్ని సంధర్భాల్లో ఆస్తి ని చూసుకునే వారు... ఈ కాలంలో అవి మాత్రమే కాదు, ఇంకొన్ని పదుల అంశాలు కలిస్తేనే గానీ, అప్పటికీ ఎవరికి వారు మేము కాంప్రమైజ్ అవుతున్నాము అనుకుంటూ ఒప్పుకుంటున్నారు...
ఇన్ని అంచనాలతో పెళ్ళిళ్ళు అవ్వడం కష్టమైపోతుంది... పెళ్ళిళ్ళు అవ్వకపోయేసరికి, అమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారు అనే భ్రమలోకి వెళ్ళిపోతున్నారు...
Post a Comment