మనలో చాలామందికి చినుకులు పడ్డపుడు రేగే మట్టి వాసన ఇష్టం. కానీ ఇపుడు వాన పడ్డా తడవడానికి మట్టేదీ? నాగరికత (నగరాలు పెరగడం) ఎక్కువ అయిపోయి, మనకి నేల తల్లి కనిపించడమే లేదు. ఎటు చూసినా కాంక్రీటు సమూహాలే. ఇల్లు అంటే, ఇప్పుడు అపార్టుమెంటే ! పోనీ, ఆ బహుళ అంతస్థుల భవనాల చుట్టూ అయినా కాస్త మట్టి ఉంటుందా అంటే, అదీ లేదు. ఒక క్రమ పధ్ధతి లో కట్టిన భవనాలైనా చుట్టూరూ ఎంతో కొంత మేర స్థలం వదిలినా, దాన్ని మళ్ళీ టైల్స్ తోనో, సిమెంట్ తోనో, కప్పేసి, అందరి కాళ్ళకీ మట్టి అంటకుండా శుభ్రత పాటిస్తున్నారు. ప్రతీ చోటా ఇలా భూమిని కప్పేస్తే, నేల తడిని ఎక్కడినించీ పీలుస్తుంది? భూమి లోకి మరి నీళ్ళు ఎలా చేరతాయి? ఒకప్పుడు 15 - 20 అడుగుల లోతు తవ్వితే నీళ్ళ ఆనవాలు దొరికే భూగర్భ జల సంపద నిండిన ప్రాంతాలన్నిటిలో కూడా నేడు నీటి కొఱత ఏర్పడక మరి ఏమవుతుంది?
మనం పాత రోజుల్ని తలచుకుంటే, కాస్తో కూస్తో రహదారులన్నిటిపైనా పెద్ద వృక్షాలు ఉండేవి. చాలా ఇళ్ళల్లో చెట్లు నాటి పెంచుకోవడం అలవాటుగా ఉండేది. చెట్లకి పోసిన నీరు కొంత చెట్టు పీల్చుకున్నా, కొంత భూమిలోకి కూడా ఇంకేది. అదీ కూడా కాక చాలా మంది ఇళ్ళముందు మట్టి వాకిలే ఉండేది. రోజూ ఇళ్ళ ముందు, మట్టి వాకిట్లో నీళ్ళు జల్లి ముగ్గులు పెట్టడం వల్ల కూడా కొంత నీరు భూమిలోకి ఇంకేది. అలా కాస్త ఖాళీ నేల ఉండడం వల్ల, వానలు పడ్డప్పుడు కొద్దో గొప్పో నీరు నేల లోపలికి చేరేది.
ఇప్పుడున్న స్థలాభావ పరిస్థితులలో మనం ఉండడానికే చోటు లేదు, ఇక మనం చెట్లు ఎక్కడ పెట్టుకుంటాం? అని నిఃస్పృహ చెందుతూ కూర్చుంటే, మన పర్యావరణ సమతౌల్యానికి ఇంకా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు, ఇంకుడు గుంతల గురించీ, మన ఇంటి పైకప్పుమీద పడేటటువంటి వర్షం నీళ్ళని ఫిల్టరు చేసి వాడుకోవడం గురించీ చాలా సంగతుల్ని వివరంగా ప్రభుత్వం ప్రచారం చేసింది. అప్పుడు వాటన్నిటికీ మంచి ఆదరణ లభించింది కూడా. చాలా ముఖ్య రహదారుల్లో సైతం వాన నీరు మురుగు నీటిలో కలవకుండా మునిసిపల్ అధికారులు ఇంకుడు గుంతలు తవ్వించారు. అయితే, ప్రభుత్వం మారగానే ఇలాటి మంచి పధ్ధతులన్నిటికీ తిలోదకాలు ఇవ్వడంతో, చాలా చోట్ల ఇంకుడు గుంతలు పూడుకుపోయాయి. వర్షాకాలానికి ముందే కాస్త దృష్టి సారించి ఉంటే, రోడ్లన్నీ ఇంత జలమయం అయ్యేవి కావేమో.
ప్రభుత్వం సరే, ప్రజల్లో కూడా ఈ అవగాహన లోపించడం చాలా బాధాకరం. చదువుకున్న వారు సైతం ఇల్లు కొనేటప్పుడు అపార్టుమెంట్ లో ఉండే సౌకర్యాలని గురించి అడుగుతున్నారు తప్పిస్తే, "వర్షపు నీళ్ళ వాడుక / ఇంకుడుగుంతలు " మొదలైనవి ఆ బిల్డరు సమకూరుస్తున్నాడో లేదో పట్టించుకోవడం లేదు. ఇక ఇండిపెండెంట్ ఇళ్ళ సంగతి చెప్పనే అక్కరలేదు. కనీసం వాళ్ళ ఇంటిలో అయినా ఒక చిన్న ఇంకుడుగుంత ఏర్పాటు చేసుకుందామని అలోచించరు. పైపెచ్చు ఉన్న కాస్త ఖాళీ స్థలం కూడా బండలు పరిచి మట్టి ఆనవాలు కూడా లేకుండా చేస్తున్నారు. మనం వృధా చేసే నీరు కూడా ఇంకుడుగుంత లోకి వెళ్ళేలా జాగ్రత్తలు తీసుకుంటే, అవి కూడా కొంత శుధ్ధి అయి భూమిలోకి వెళితే మన భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటాయి.
మన కోసమే మనం భూగర్భ జలాల అభివృధ్ధికి ప్రయత్నించాలి. దీనికై అందరూ తమ ప్రతిపాదనల్ని అందరితో నా బ్లాగు ద్వారా పంచుకుంటే, చాలా బాగుంటుందని భావిస్తున్నాను. నా ప్రతిపాదనల్ని ఒక వరుస క్రమం లో రేపు అందజేస్తాను.
1 comment:
మీరు చెప్పింది నిజమేనండి.నేడు సమజంలో అన్ని కలుషితమైపొతున్నాయి.దానిలోనే ఈ నేలకూడా కలుషితమైపొవడంలో ఆశ్చర్యమేముంది.. మంచి పదజాలం.. మంచి భావొద్వేగం..చాలా బాగుంది...
మీ శ్రీసత్య...
Post a Comment