Thursday 23 December 2010

లేడీస్ టైలర్

ప్రతీ ఒక సందర్భానికీ చీరలు కొంటూనే ఉంటాము. కానీ చీర కొన్న తరువాతే మొదలవుతాయి అసలు బాధలు. చీర ఎంత అందంగా ఉన్నా, జాకెట్టు సరిగ్గా లేనిదే చీర అందమే చెడిపోతుంది కదా! ఆ జాకెట్ల కోసం పడే పాట్లు అంతా ఇంతా కాదు. ఇంట్లో తమ జాకెట్లు తాము కుట్టుకునే వారు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది. చీర కొనేటప్పుడే - దానికి జాకెట్టు ఇచ్చాడో లేదో చూసుకోవడంతో మొదలవుతాయండీ కష్టాలు... ఒకవేళ జాకెట్టు ఇచ్చినా, అది ఎలా ఉందో చూసుకోవాలి... కొన్ని సార్లు చిన్న గుడ్డ ఇస్తారు. అలా కాకుండా జాకెట్టు గుడ్డ బాగుంటే అంతవరకూ మన పరిస్థితి నయమే ! అలా కాకుండా జాకెట్టు కూడా కొనాలనుకోండి, ఇక మన తిప్పలు ఆ బ్రహ్మ దేవుడికి ఎరుక. ఒక పక్క మనతో పాటు షాపింగుకి నసుగుతూ వచ్చిన పతిదేవులు తొందరగా కానిమ్మని హడావుడి పెడుతుంటే, చీరకు సరిపడ జాకెట్టు ముక్క వెతుక్కోవడంతో మన పుణ్య కాలం కాస్తా గడిచిపోతుంది. పోనీ మనకి ఎదో ఒక రకంగా చీరకు తగ్గ రంగు దొరికిందే అనుకుందాం - అది మనకు నచ్చని గుడ్డల రకంలో నే దొరుకుతుంది. అంటే - మనం టూ బై టూ అడిగితే పాలిస్టరు గుడ్డ దొరకడమో ; కాటన్ సిల్కు గుడ్డ అడిగితే మరింకేదో దొరకడమో కచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒకటి తీసుకుందూ, ఇంకా ఎన్ని చూస్తావు అని పక్కనే పలికే భర్తగారు మన బాధని అర్ధం చేసుకోలేరు. అక్కడనుచీ మన బాధలు మరింత రెట్టింపు అవుతాయి. చీర చాల్లే ఈ రోజుకి అని ఇంటికి వచ్చేస్తాము, మరోరోజు ఆ చీరని తీసుకుని, మాచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి తిరిగి, ఎట్టకేలకు, చిట్టచివరికి, తుట్టతుదకు - జాకెట్టు గుడ్డ సంపాదించేసరికీ తల ప్రాణం తోకకి వస్తుంది.

జాకెట్టు ముక్క ప్రహసనం అయిన తర్వాత మరో కొత్త రకం బాధ మొదలు. ఆ జాకెట్టు ని పట్టుకుని దర్జీల వెంట తిరగడం. ఒకడేమో - ఆ ముక్కని పైకీ, కిందకీ, తిప్పి - "అయ్యో అమ్మా, ఈ ముక్క మీకు సరిపోదమ్మా, ఇంకో పది పాయింట్లు ఎక్కువ గుడ్డ తెచ్చుకోవచ్చుకదా" అంటాడు. మరొకడి దగ్గరికి వెళ్తే, జాకెట్లు కుట్టాలంటే, టైం పడుతుందమ్మా - ఇంకో నెల దాకా ఇవ్వలేను అంటాడు. ఇంకోడు - ఈ మధ్య మేము జాకెట్లు కుట్టడం మానేశామమ్మా, రేట్లు అస్సలు సరిపోవట్లేదు (అక్కడికేదో వాడు ఫ్రీ గా కుట్టి పెడుతున్నట్లు) అంటాడు. మొత్తానికి అలా ఇలా కుట్టేవాడు దొరికినా, జాకెట్టు వాడు చెప్పే కుట్టు కూలీ విన్నాక కాసేపు మన "దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవడం" ఖాయం. మామూలు జాకెట్టు అయితె 100, లైనింగు వేసి కుడితే 200, లైనింగు గుడ్డకి మరో 30, డిజైను జాకెట్టు అయితే మరికొంత, ఇలా వాళ్ళ రక రకాల ధరల పట్టిక చూసి మనం ఈ చీర ఇప్పుడే కట్టుకోవడం అంత అవసరమా అని దీర్ఘంగా అలోచించి, ఈ సిటీలో ఇంతేలే, మన ఊరికి వెళ్ళినపుడు కుట్టించుకుందాములే - అక్కడ చవగ్గా కుడతారులే అని, మళ్ళీ బీరువాలో చీర, జాకెట్టు పెట్టేసి, గమ్మున బజ్జుంటాం. అంతలో పండగో, ఎదో సందర్భమో వస్తుంది, అప్పుడు మన శ్రీవారికి మన కొత్త చీర గుర్తుకి వస్తుంది - అంత కష్టపడి కొన్న చీర ఎందుకు కట్టుకోలేదు అని కాస్త బాధ పడి మన పుండు మీద కారం చల్లుతారు. ఇక ఊరికి వెళ్ళినప్పుడు జాకెట్టు కుట్టించుకుందామంటే, అక్కడా ప్రస్తుతం సిటీ కుట్టు కూలీలే ఉన్నాయని తెలుసుకుని, ఇంకా ఆలస్యం చేస్తే చీర చీకుడు పడుతుంది కనుక నోరు మూసుకుని ఎదో ఒక రకంగా జాకెట్టు కుట్టించుకోవల్సి వస్తుంది.

ఈ బాధలన్నీ పడలేక ఈ మధ్య నేను చేస్తున్న పని ఏమిటంటే, రెడీమేడ్ జాకెట్లు కొనుక్కోవడం. హైదరాబాదులో బడీ చౌడీలో చాలా దుకాణాలు ఉన్నాయి. అక్కడ కుట్టి ఉంచిన జాకెట్లు దొరుకుతాయి. ధర కూడా పర్లేదు. మనం జాకెట్ ముక్క కొని, కుట్టించడానికి ఎంత ఖర్చు అవుతుందో అంతకన్న ఒక 10 రూపాయలు తక్కువే. కాకుంటే కొందరికి ఆ కుట్టిన జాకెట్లు సరిగ్గా అతకకపోవచ్చు. కొందరికి చేతులు పొట్టిగా, జాకెట్టు పొడుగ్గా ఇలా రక రకాలు అలవాటు ఉన్న వారికి మాత్రం కుదరదు కానీ, మామూలు జాకెట్లు వేసుకునేవారు హాయిగా చీర తీసుకెళ్ళి కావలసిన రకపు జాకెట్టు తెచ్చుకోవచ్చు. మంచి జరీ జాకెట్లు, ఇప్పుడు వస్తున్న బనారస్ జాకెట్లు కూడా దొరుకుతాయండీ. లేకుంటే మరీ టైలర్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జాకెట్టు కుట్టడానికి 200 ఏమిటండీ బాబూ, మా బడీచౌడీ లో మంచి పట్టు జాకెట్టు, లైనింగ్ వేసి కుట్టినది, 200 రూపాయలకి దొరుకుతుంది. అక్కడ మరో మంచి సౌకర్యం కూడా ఉన్నదండీ ... రెండు మూడు షాపుల్లో గంటలో జాకెట్టు కుట్టి ఇస్తామని రాసి ఉంటారు - మరీ గంటలో కాకున్నా, కనీసం పొద్దున్న ఇస్తే మన పనులన్నీ చూసుకొని, సాయంత్రనికి వెళితే - జాకెట్టు కుట్టి ఇస్తారు. మనం ఆది జాకెట్టు సరైనది ఇవ్వాలి - చక్కగానే కుడతారు.

ఈ బాధలన్నీ పడలేక నేను జాకెట్లు కుట్టడం అర్జెంట్ గా నేర్చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నాననుకోండి! కాకుంటే నేర్చుకునే తీరికే కనబడట్లేదు. ఏదో - గుడ్డిలో మెల్ల సామెతగా, నా డ్రస్సులు నేనే కుట్టుకుంటాను కనుక అది కాస్త మేలు. లేకుంటే - మన దర్జీల ధరలకి డ్రస్సులు కుట్టించుకోవడం కూడానా! పంజాబీ డ్రస్సులు కుట్టడానికి కూడా టైలరును బట్టీ 100 నుంచీ 300 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు - కాకుంటే, డ్రస్సు కాస్త పెద్ద గుడ్డ, సల్వార్, కమీజు రెండూ కుట్టాలి కనుక కాస్త నయం అనుకోవచ్చ్హు. మరీ జాకెట్టుకు 200, 300 కుట్టుకూలీ ఏమిటండీ!!మొత్తానికి మా కాలనీలో ఒక కుట్టు మిషను తో మొదలు పెట్టిన టైలరు షాపు - దిన దిన ప్రవర్ధమానమై, 3 జాకెట్లూ 6 పంజాబీ డ్రస్సులు గా వర్ధిల్లుతూ ఉంది. దాన్ని ఆదర్శంగా తీసుకుని మరో నాలుగు లేడీస్ టైలర్లు వెలిశారు.

అస్సలు ఇంత సోది ఎందుకు చెప్పానంటే, పోయిన సంవత్సరం మా గృహప్రవేశానికి అందరూ మాకు బట్టలు పెట్టారు. అందరూ పెట్టిన చీరల్ని కట్టుకోవాలి కదా, చచ్చినట్లు వాటికి జాకెట్లు కుట్టించుకోవాలని చూస్తే - వేల రూపాయల బిల్లు అయ్యేటట్లు ఉంది. అందుకని కొన్ని చీరలకి మంచి రెడీమేడ్ జాకెట్లు కొనేసుకొని, మంచి జాకెట్టు ముక్కలు మా అమ్మాయికి గౌన్లు, పావడాలు కుట్టేశా :-). అందుకే ఈ బాధలు పడలేక మరో 15 రోజుల్లో జాకెట్టు కుట్టడం నేర్చేసుకుని, జాం జాం అని మా అత్తగారికీ, నాకూ సంక్రాంతి పండగకి జాకెట్లు కుట్టేసుకోవాలని తెగ ప్రయత్నించేస్తున్నాను. మరి ఎంత కుదురుతుందో ... చూద్దాం.

Thursday 16 December 2010

తెలుగు చేనేతలు - పోచంపల్లి

ఈ మధ్య అస్సలు నా టపాలే లేవు. మామూలుగానే నా బ్లాగు చదివే వారు అంతంత మాత్రం. ఇక ఈ మధ్య అస్సలు కుదరక ఏమీ రాయనేలేదు. ముఖ్యంగా నా 50వ టపా మంచి విషయంపైన రాయాలని ఇన్నాళ్ళూ ఆగిపోయాను. ఎలాగూ తెలుగు బ్లాగర్లందరమూ పుస్తక ప్రదర్శనలో కలుస్తాము కదా - అప్పుడు నా బ్లాగు పేరు చెబితే ఎవ్వరికీ గుర్తు రానేమో అని అనుమానం కూడా కాస్త కలిగింది కూడాను! దాని పర్యవసానమే ఈ టపా!

మన తెలుగు నేల చేనేతలకి పెట్టింది పేరు. ఇంతకు ముందు ఈ ఫాషను ప్రపంచం ఇంత లేని రోజుల్లో కూడ మన చేనేతలు ప్రపంచ ప్రసిధ్ధి పొందాయి. నా మటుకు నాకు అస్సలు ఇన్ని రకాల చేనేతలు మరో ఏ రాష్ట్రం లోనూ ఉన్నాయా అని సందేహం కలుగుతుంది అప్పుడప్పుడూ. కాస్తో కూస్తో వేరే రాష్ట్రాల నుంచీ మనకు తెలిసిన మంచి చేనేతలు ఉన్నా, మన వాళ్ళలా మాత్రం ఎవ్వరూ నేయలేరని నాకు చాలా నిశ్చిత అభిప్రాయం. పైగా చిన్నప్పటినుంచీ మా అమ్మమ్మ, నాయనమ్మ చేనేత చీరలే కట్టటం చూడటం వల్ల, అవంటే మరీ ఇష్టం పెరిగిపోయింది. ఎప్పుడో నేను చేనేత చీరలపై కవిత రాసి, మీ ముందు ఉంచిన టపా ఉన్నా, మళ్ళీ నాకు తెలిసిన చేనేతల గురించి వ్రాయాలనిపించింది. అలా మన సంస్కృతిలోని ఒక మంచి హస్తకళ గురించి చెప్పినట్లూ ఉంటుంది, నేతన్నల వెతలు చూసి, కాస్తైనా మన బాధ్యతగా, వారంలో ఒక రోజు మనం చేనేతలు ధరిద్దామని గుర్తు చేద్దామని అనిపించింది.ఒక్కో చేనేత గురించీ ఒక్కో టపా అవుతుందేమో అనిపించి ఈ టపాల పరంపరని మొదలు పెడుతున్నాను. కనీసం వారానికి ఒకటి అయినా రాద్దామని అనుకుంటుంటున్నాను.

మొదటగా నేను పోచంపల్లి చేనేతల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. మొదటగా పోచంపల్లినే ఎన్నుకోడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది. మన చేనేతల్లో మొట్ట మొదటగా పేటెంట్ హక్కులు పొందిన ప్రత్యేకత దీనికి ఉంది. అస్సలు ఆ నేతలో ఎన్ని పొందు పరుస్తారో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ రంగుల దారాల్లో నెమళ్ళు నర్తిస్తాయి. చిలుకలు నవ్విస్తాయి. ఏనుగులు గంభీరంగా నిలబడతాయి. పూవులు విరబూస్తాయి. ఆకులు రెపరెపలాడుతాయి. రకరకాల ఆకృతులు మన ముందు ఆవిష్కరింపబడతాయి. భారీ జరీలు నిండిన చీరలకు విరుధ్ధంగా, రంగుల మాయాజాలానికే ప్రాధాన్యత ఉంటుంది.

బట్టలు నేసిన తరువాత రంగులద్దడం చాలా సులువు. కానీ పోచంపల్లి నేత ప్రత్యేకత ఏమిటంటే, నేయడానికి తీసి పెట్టుకున్న దారానికి రంగులద్ది, దాని తరువాత నేస్తారు. పడుగు, పేక సమంగా కలవకుంటే, ఆ అకృతి నేతలో రానే రాదు. చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రక్రియ కనుకనే పేటెంట్ లభించింది. వీటి ధరలు కూడా నేతలో ఆకృతులు పెరిగే కొద్దీ పెరుగుతుంటాయి. నూలు, పట్టు రకాలలో ఈ చేనేతలు అందుబాటులో ఉన్నాయి. మహిళల చీరల భండాగారంలో ఎన్ని రకాలు ఉన్నా, పోచంపల్లి పట్టుచీర లేకపోతే ఏదొ తక్కువైనట్లు భావించేవారు చాలా మంది తారసపడతారు. పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకే కాకుండా, రోజువారీగా కట్టుకోడానికి హుందాగా ఉంటాయని వీటిని ఎక్కువగా ఉద్యోగినులు ఇష్టపడటం కద్దు.

పోచంపల్లి మన భాగ్య నగరానికి చాలా చేరువలో ఉంది. హైదరాబాదు కి 50 - 60 కి.మీ. ల దూరంలో పోచంపల్లి గ్రామం ఉంది. మనం ఆ ఊరికి వెళ్ళి చేనేతలు కొనుక్కుంటే తక్కువలో లభిస్తాయని అంటారు. అస్సలు ఇలాటి ప్రదేశాలని మంచి పర్యాటక ప్రదేశంగా అభివృధ్ధి చేయవచ్చేమో అనిపిస్తుంది. మనం కట్టుకునే బట్టలు ఎంత కష్టపడి నేస్తే ఇంత అందంగా తయారు అయ్యాయో తెలుకునే అవకాశం కలుగుతుంది కదా!! పోచంపల్లి గ్రామానికి మరో విశిష్టత కూడా ఉంది. అది భూదాన్ ఉద్యమం తో ముడిపడి ఉంది. భూదాన్ ఉద్యమం ఇక్కడనుంచే ప్రారంభం అయినదానికి గుర్తుగా ఈ ఊరి పేరు "భూదాన్ పోచంపల్లి" గా మారిపోయింది. ఆచార్య వినోభా భావే మందిరం కూడా పోచంపల్లి లో ఉంది.

హైదరాబాదునుంచీ ఆటవిడుపుగా మౌంట్ ఒపేరా లేక రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలని వెళ్ళేవారు - అదే దారిని వెళ్ళి పోచంపల్లిని కూడా ఒకసారి చూసి రావచ్చు. అలాగే ఇంట్లో శుభకార్యాలేవైనా ఉంటే, పోచంపల్లి గ్రామానికే వెళ్ళి పట్టుచీరలు కొనుక్కురావచ్చు. మనం అక్కడ కొంటే చవకగా కొనుక్కోడమే కాకుండా దళారీలకి చెల్లించేది తగ్గి, నేతన్న కి కాస్త లాభిస్తుంది కదా!!

పోచంపల్లి చేనేతలంటే కేవలం చీరలే కాదండోయ్, డ్రస్ మెటీరియల్, కిటికీలకి ద్వారాలకీ తెరలు, దుప్పట్లు, దిండుగలీబులు, దీవాన్ పై పరిచేందుకు దుప్పట్లు, మగవారికి రక రకాల పట్టు చొక్కా గుడ్డలు, పోచంపల్లి నేత గుడ్డలతో కుట్టిన చేతి సంచులు, ఇలా చాలా రకాలు ఉన్నాయి. "అవును - వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు" సినిమా సెట్టింగులో దుప్పట్లు, కర్టెన్లు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎంత బాగున్నాయో కదా! మరి, మిమ్మల్ని, మీ ఇంటిని అందంగా మార్చేయడానికి పోచంపల్లి ఎప్పుడు వెళ్తున్నారు?

Friday 13 August 2010

బంగారు 'కొండ' లు

కొన్నేళ్ళ క్రితం రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. ఊరంతా ఎక్కడ చూసినా నా అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళే ఉండేవారు. అక్కడక్కడా మా మధ్య కాస్త పచ్చదనంతో చిన్ని చెట్లు మొలిచినా, మా అందాలు పెరిగేవే కానీ తరిగేవి కావు. తమాషాగా పిల్లలు మా మీద ఎక్కి ఆడినప్పుడు మాకు కాలమే తెలిసేది కాదు.
మబ్బువారిందంటే చాలు - వాటిని ఆపడానికి మా పెద్దన్నలు పోటీ పడేవారు. మా మీదనిచీ జారుకుంటూ వర్షపు నీళ్ళన్నీ చెరువుల్లోకి చేరుతున్నపుడు మేము స్నానం చేసి ముఱికిని వదిలించుకున్నట్లు మెరిసిపోయే వారం. మా పై కూర్చొని పిల్లనగోవి వాయిస్తూ గొడ్లని కాసే పిల్లవాడు ఆనందించేవాడు. మా పై నిదురిస్తూ, పక్షులూ జంతువులూ సేద తీరేవి. మా లో ఉన్న గుహల్లో తలదాచుకోడానికి జంతు జాలమంతా పోటీ పడేది.

కదలకుండా నవ్వుతూ నిలబడ్డ మేమే ఈ ఊరికి అందమని సంతోషంతో తల మునకలయ్యే వాళ్ళం. మా పక్కనే పచ్చదనం. మా నీడన వెచ్చదనం. మా లోపల కఱకుదనం. మా మనసున మెత్తదనం. ఈ ఊరిని మేము అలంకరించేశం...! మాపై ఒక నవాబు అందమైన కోట కట్టాడు. మమ్మల్ని కలుపుతూ కోటగోడ కట్టాడు. మా సాయంతో పెద్ద బుఱుజులు కట్టాడు. మా పైకి ఎక్కడానికి శత్రువులు భయపడేవారు. మా కోట చరిత్ర వింటూ ప్రజలు తన్మయులయ్యేవారు.

చిన్నగా మనుషులు మారుతున్నారు. ఊరు పెద్దదవుతోంది. ఆహా నా ఊరు పెరుగుతోంది అని సంతోషిస్తున్నాము. కానీ మా సంతోషం ఎక్కువగా నిలవలేదు. మాపైన చిత్ర విచిత్ర భవంతులు వెలిసాయి. మాపై ఇళ్ళు కట్టడానికి కొద్ది కొద్దిగా మమ్మల్ని కరగించి వేశారు. ఊరిలో మనుషులు పెరిగారు - కానీ మా సంఖ్య తగ్గి చెఱువుల్లోకి నీళ్ళు చేరవేసే దారి లేక నీళ్ళు తగ్గాయి. చెరువుల్లో నీరు తగ్గితే - భూజలాల మట్టం తగ్గింది. చిన్న చిన్నగా చెఱువులు మాయమయ్యాయి - భూజలాలు పాతాళానికి పోయాయి. మరో పక్క చూస్తే మా పెద్దన్నలని నిలువునా ముక్కలు చేసి, ఆకాశ హర్మ్యాలు వెలుస్తున్నాయి.

మా బంధువర్గమంతా నిలువునా నిలబడలేక, ముక్కలు ముక్కలై, దిక్కులేని చావు చస్తున్నారు. మాతో అందాన్ని, అనుబంధాన్ని పెంచుకున్న ఊరు - మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతూంటే -మారు మాట్లాడకుండా ఒఱిగిపోతున్నాం. వేల సంవత్సరాల మా ఆయుష్షు ముగిసి - చివరికి మా ఊరి ఇళ్ళకి పునాదులౌతున్నాం. ప్రకృతి మాత మమ్మల్ని చూసి దుఃఖిస్తోంటే - నిశ్శబ్దంగా మలిగిపోతున్నాం. కానీ నాటికీ, నేటికీ ఒక్క మాట నిజం ! మావల్లే ఈ ఊరికి ఎనలేని అందం!

Thursday 12 August 2010

పంద్రాగస్టు

మా ఊర్ల నేను పుట్టినప్పటి సంది జూస్తున్న - గీ పంద్రాగస్టు దినమంటే మస్తు ఇష్టం అందరికీ. పోరల్లంత ఇస్కూలుకు వొయి జెండా వందనం జేస్తరు గానీ, తొవ్వ తొవ్వల, జాగ జాగల మొత్తం మా ఊర్ల జెండాలెగురుతయి. జెండా లేని చౌరస్త ఉండది. జెండా లేని పేట ఉండది. ఇగ జెండా వందనానికి మస్తుగ హిందీ పాటలన్ని లౌడు ఇస్పీకర్ ల వెట్టి అందరికీ ఇనిపిస్తం భీ.

ఇస్కూలుకు వొయి వచ్చె పొరల్లందరు ఒకటో రెండో జెండా వందనాల కాడ ఆగి, మిఠాయిలు దిన్నంకనే ఇంటికి వోతరు. గోర్నమెంట్ కొలువులున్న జాగల మొత్తం జెండాలెగిరేస్తరు. కానీ సదువులు లేని మా బస్తీలల్ల భీ అంతకన్న మంచిగ జెండాలెగిరేస్తరు. పండగ లెక్క మస్తు రంగు కాయిదాలు కడ్తరు. గాంధీ, నెహ్రూ, నేతాజీ, ఒక్కోసారి ఇందిరగాంధీ ఫోటలైనా జెండా తాన వెడ్తరు. అగ్గో ఎంత మంచిగ జేస్తరో మాటలాల్ల సెప్పలేము సూడున్రి.

నేను, మాయక్క, మాయన్న, మా తమ్మి అందరం గలిసి మా ఇంటితాన జెండా వందనానికి వొయెటోల్లము. జెండా ఎగిరేసినంక మేమందరం జనగనమన పాడెటొల్లం. తియ్య బూంది పాకిటు ఇచ్చెటోల్లు జెండా వందనమయినంక. ఇస్కూల్ల ఒక చాక్లెట్టు, రెండు బిస్కెట్లు ఇచ్చెటోల్లు. ఇస్కూలుకి మమ్ముల తెల్ల బట్టలేసుకొని రమ్మనెటోల్లు. మా పంతులమ్మలు భి అందరు తెల్ల చీరలే కట్టుకొని వచ్చెటోల్లు. ఇగ కొన్ని పెద్ద పెద్ద ఇండ్ల పైన భి జెండా ఎగిరేసేటోల్లు. మా ఇంటి పక్కన చంద్రయ్య తాత తప్పక జెండా ఎగిరేస్తుండే.

ఆ దినమంత ఒక ఆవేశం వచ్చెడిది. తెల్లోల్ల మీద మస్తు కోపం భీ వచ్చెడిది. గా తెల్లోడు మనల ఎంత సతాయించిన్రో అని మస్తు బుగులు వడెటోల్లం. దేసభక్తి పాటలన్ని ఇనెటోల్లం. పంద్రగస్టు, చబ్బీస్ జన్వరి గీ రెండు దినాలూ మా హైద్రబాద్ల మస్తు జేస్తరు. గా నిజాం కొడుకు సొసంత్రం వచ్చినంక గూడ మమ్ముల సొసంత్రం గ బత్కనియ్యలేదని - మన దేసంల జల్ది కల్వనియ్యలేదని, మన దేశంల కలిసిన సంది గిట్లనే సొసంత్రం పండగ - పందాగస్టు జేస్తున్నరట, మా పెద్దోల్లు జెప్పిన్రు. అందుకోసానికి అమ్మలారా, అయ్యలారా - మన దేసం గురించి గా ఒక్క దినమైన ఆలోచించుండ్రి.

Tuesday 3 August 2010

వేదన

బాధ, కోపం, ఉక్రోషం - ఏదీ చెయ్యలేని నిస్సహాయత! ఇలా ప్రతీదీ మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు జీవితం మీద విరక్తి పుడుతుంది. అలాటి సమయంలోనే అది డిప్రెషన్ కి దారి తీస్తుందనిపిస్తోంది. ఆ పరిస్తితి అనుభవిస్తేనే గానీ తెలియదు. ఆ బాధని వేరే ఎవ్వరికీ చెప్పుకోలేము కూడా!!

తెలీని బాధ నిరంతరం మెలిపెడుతూ ఉంటుంది.... తనివి తీరా ఏడవాలనిపిస్తుంది.... ఒక్కోసారి అస్సలు బ్రతకడం దేనికీ ...? చచ్చిపోదాంలే అనిపిస్తుంది... చచ్చి ఏమి సాధిస్తావూ అంటే... బ్రతికి ఇప్పుడు సాధిస్తున్నదేమైనా ఉన్నది కనుకనా అనిపిస్తుంది... బాధ ఎక్కువైన ప్రతీసారీ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ - ఆశ కల్పించుకుంటూ బ్రతుకుతున్నా, అన్ని సార్లూ మన మనసు మన స్వాధీనంలో ఉండదు కదా... అప్పుడప్పుడూ కొన్ని భావోద్వేగాలు అన్నిటినీ మించి మనసుని వేదనకి గురి చేస్తాయి .

మనసు బాధని అక్షర రూపంలో పెడితే - కాస్తైనా బరువు తీరుతుందని చిన్ని ప్రయత్నం చేస్తున్నా!! నాకై నాకు ఉన్న ప్రత్యేక నేస్తం నా బ్లాగే కదా అనిపిస్తుంది. మనలోకి మనం తొంగి చూసుకోవడం మనం అందరం ఎపుడో ఒక అపుడు చేసే పనే అని నా నమ్మకం .

బాధ బరువుని ఎడద మోయలేనపుడు -

వేదనా తాపాన్ని హృదయం భరించలేనపుడు -

ఆవేదనా భారాన్ని మనసు తట్టుకోలేనపుడు -

నేనొంటరినై చీకటి కుటిలో మగ్గి మగ్గి,

నిరంతరంగా కన్నీటి స్రవంతిలో కుంగి కుంగి,

చల్లటి పలకరింపే లేని వేసవిలో వేగి వేగి,

నిబిడ నిర్లిప్త నిరాశా నిస్పృహ నలిపివేస్తుంటే -

కలనైన కనుగొనని కలత కలచివేస్తుంటే -

అంతులేని గాఢ శూన్యం ఆవరిస్తుంటే -

వెళ్ళదీయలేని కాలం విసిగిస్తుంది.

చెప్పలేని మౌనం హింసిస్తుంది.

ఇంకెందుకీ బ్రతుకు అనిపిస్తుంది.

Saturday 31 July 2010

తేట తెలుగు

తెలుగు, భారత దేశములోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు అధికార భాష, మరియు దాని ప్రక్క రాష్ట్రములయిన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, చత్తీస్ గఢ్ ప్రజలు మాట్లాడే భాష. ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడే వాటిలో పదిహేనవ స్థానములోనూ, భారత దేశములో రెండవ స్థానములోను నిలుస్తుంది. ప్రపంచంలో అచ్చులతో అంతమయ్యే కేవలం 5 భాషల్లో తెలుగు ఒకటి. మధురమైన మంజులకర కోమల భాష మన తెలుగు. సుమధురమైన భాషగా, సంగీత తుల్యమైన భాషగా తెలుగు కవులచేతనేగాక, ఎందరో ఇతరభాషల కవుల, విద్వాంసులచే "తేనె కన్న తీయనిది"గా, చెవులకు ఇంపైన భాషగా పొగడబడ్డ భాష మన తెలుగు భాష. మన భాషని గురించి ఎందరో మహానుభావులు ఏమన్నారంటే....

దేశ భాషలందు తెలుగు లెస్స —శ్రీ కృష్ణదేవ రాయలు"..

..సుందర తెలుంగినిల్ పాట్టిసైతు తోనిగల్ ఓట్టి విళయాడి వరువోం.."(..సుందర తెలుగులో పాటలు పాడుతూపడవల్లో యాత్రా కేళికి వెళ్ళొద్దాం.) — తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి.15 వ శతాబ్దం నుంచీ పాశ్చాత్యులచే "తెలుగు - ఇటాలియన్ అఫ్ ద ఈస్ట్ " గా కీర్తించబడ్డ భాష.

ప్రాచీన భాషగా ప్రస్తుతం గుర్తింపబడ్డ తెలుగు భాషకి దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర ఉన్నదని చరిత్రకారులు, భాషా పరిశోధన కారులూ చెప్తున్నారు. వేల ఏళ్ళనించీ వాడుకలో ఉన్న తెలుగు భాషకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రాచీన హోదా ఇవ్వడం నిస్సందేహంగా తెలుగు భాషాభిమానులందరికీ ఎంతో సంతోషకరమైన విషయం.

వివిధ అలంకారాలు నిండిన చందోబద్ధమైన పద్యం మన సొంతం. అవధానం తెలుగు భాష ఇంటి పేరు. పద్య కవిత తో పాటు పద కవిత్వం వెల్లి విరిసి, కర్నాటక శాస్త్రీయ సంగీతాన్ని వేల వేల కీర్తనలతో సుసంపన్నం చేసిన వాగ్గేయకారులు తెలుగు వారు. వివిధ రకాల చందస్సులతో కూడిన పద్యం, గద్యం, దండకం, గేయం, నాటకం, జానపద సాహిత్యం, కధ, నవలిక, గల్పిక...ఇలా తెలుగు సాహిత్యంలో ఉన్నన్ని ప్రక్రియలు మరే భాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదేమో...!! కీర్తన, సంకీర్తన, పదం, కృతి, యక్షగానం, కావ్యం, ప్రబంధం, శతకం అనేవెన్నో తెలుగు భాషలో వెన్నెలలు వర్షింప చేసాయి. భారత భాషల్లో తెలుగు భాషకు అత్యంత విలువను కొని తెచ్చాయి.

సంగీతాత్మకమైన భాషగా ఎందరో సంగీత విద్వాంసులచే మన్ననలు పొందిన భాష తెలుగు. తెలుగు భాష లో 56 అక్షరాలు - ప్రాచీన భాషగా ఎప్పటినుంచో గుర్తింపు ఉన్న సంస్కృతం లో కూడా అన్ని అక్షరాలు లేవు. తెలుగు వారిగా పుట్టడం మనం ఎంతో గర్వించాల్సిన విషయం. ప్రపంచ సాహిత్య రంగంలో అయిదవ స్థానంలో ఉజ్వలంగా ఒక్క వెలుగు వెలిగిన తెలుగుభాష, నేడు తన అస్థిత్వాన్నే కోల్పోతూండడం ఎంతో బాధాకరమైన విషయం. మన ఉద్యోగ అవసరాలకి ఎన్ని భాషలని నేర్చుకున్నా, మన మాతృభాష ని మరచిపోకుండా కాపాడి, ముందు తరాల వారికి మన తెలుగు సాహితీ సుగంధాన్ని పంచాలి.

స్వాతంత్ర్యానికి పూర్వం ఆంగ్లేయులు జిల్లా అధికారులుగా నియమించబడాలంటే హిందీ లేక తెలుగు ఈ రెండు భారతీయభాషల్లో ఒకటి తప్పనిసరిగా నేర్చుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉండేవి. ఆ రోజుల్లో ఉత్తర భారత దేశానికి హిందీ ఎలాగో దక్షిణ భారత దేశంలో తెలుగు అలా వాడుకలో ఉండేది. మరి నేటి పరిస్థితి చూస్తే అదంతా పూర్తిగా మారిపోయింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల ఎక్కువగా నష్టం జరిగింది తెలుగు వారికే. తెలుగు వారు ఉంటూన్న దాదాపు 10 జిల్లాలు పొరుగు రాష్ట్రాల వారికి వెళ్ళిపోయాయి. అక్కడ తెలుగు బడులు లేని దుస్థితి చూస్తే చాలా బాధ కలుగక మానదు. (ఇటీవలి కాలంలో తమిళనాడు లోని కృష్ణగిరి జిల్లాలో తెలుగు భాష కోసం తెలుగు వారు పోఋఆడడం అందరికీ తెలిసిందే!) పద్యం మన సొంతం అని చెప్పుకుంటూ ధాటిగా ఒక్క పద్యాన్ని కనీసం చూసి చదవలేని దుఃస్థితి లో చాలామందిమి తెలుగు వాళ్ళం ఉండడం ఎంతో దురదృష్టకరం. వెలలేని మన సాహితీ సంపదను మన పెద్దలు ఎంతో శ్రధ్ధతో కాపాడుకుంటూ వచ్చారు. కనీసం కాసిని వేమన పద్యాలూ, కొన్ని సుమతీ పద్యాలూ, పోతన భాగవతంలో గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరితం, రుక్మిణీ కళ్యాణం ఘట్టాల్లోని కొన్ని పద్యాలైనా తెలుగు వారి నాలుకలమీద నాట్యమాడేవి. మరి నేడో? --- వేగంగా అంతరించిపోతున్న భాషల్లో తెలుగు కూడా ఒకటి. ఈ పరిస్థితి చెయ్యి దాటకముందే మన భాషని, మన సాహితీ సంపదని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిదీ ! మన భాషలోని సొగసును, మాధుర్యాన్ని చవి చూడక, చాలా మంది తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారు.

"తేనియలకే తీపి పెంచే తెలుగులో మాటాడుకో.

తెలుగు జాతి సమైక్య గీతి పదే పదే నువు పాడుకో.

ఏ ప్రదేశంలోన ఉన్నా ఏ విదేశంలోన ఉన్నా,

జీవనిదిగా నీకు మిగిలిన స్వీయ సంస్కృతి నిలుపుకో.

స్వాభిమానం కేతనంగా సామరస్యం స్యందనంగాతరలిపోతూ నిత్యనవ చైతన్య దీప్తిని పెంచుకో."

అన్న పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సి.నారాయణ రెడ్డి గారి సుమధుర భావాభిరామంతో మనందరం ఏకీభవిస్తూ అమ్మ భాషను ఆదరిద్దాం.

"గట్లనే" అని తెలంగాణా మాండలికంలో అన్నా, "అలగలగే" అని ఉత్తరాంధ్ర యాసలో చెప్పినా, "ఆయ్, అలాగేనండీ" అని గోదారి జిల్లాల యాసలో మాట్లాడినా, "అట్లాగే/ అట్టాగే" అని కృష్ణా/గుంటూరు మాండలికంలో నొక్కి వక్కాణించినా, "అట్నే" అని నెల్లూరు / చిత్తూరు ప్రాంతాల మాటల్లో తెలిపినా, "అట్లే" అని రాయలసీమ భాషలో నుడివినా, అది మన తెలుగు భాషలోని అందమే. పైన చెప్పిన అన్ని మాండలికాల్లో అన్నట్లు మనం "అలాగే" నని మన భాషా సేవకై ఏకీభవిస్తూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.

ఈరోజే గుల్మొహర్ బ్లాగులో తెలుగు జాతీయత గురించి చదివాక నేను మా కార్యాలయంలో ప్రారంభించిన తెలుగు సాహితి అనే తెలుగు సాహితీ సమాఖ్య ఆహ్వానంలో తెలుగు గురించి రాసిన నాలుగు మాటలు మీ ముందు ఉంచాలని అనిపించింది. చంద్రచూడ్ శాండిల్య గారికి ఈ విధంగా అభినందనలు తెలపాలని అనిపించింది.

Monday 19 July 2010

వా .....! నా పన్ను పీకేశారు !!

రెండు రోజులుగా తీవ్రమైన పన్ను నొప్పితో బాధపడుతూ - మొన్న డాక్టరు దగ్గరకి వెళ్లాను. పన్నుకి ఎక్స్ రే తీయించుకుని రమ్మన్నాడు. ఆ రాత్రికే బుగ్గ బూరెలా వాచిపోయింది. నిన్నసాయంత్రం ఎక్స్ రే తీసుకుని వెళ్ళాను. చావుకబురు చల్లగా చెప్పాడు మహానుభావుడు. మీ పన్ను ఆఖరి స్థితిలో ఉంది, పీకకపోతే, దానిలోని ఇన్ఫెక్షన్ మిగతా వాటికి సోకుతుంది. ఆఖరికి అన్నీ పోతాయి అన్నాడు. ఇక చేసేదేముంది, ఒక పన్ను కోసం అన్నిటినీ పోగొట్టుకోలేము కదా, బయట కూర్చొని ఉన్న మా వారిని పిలిచి, పక్కన కూచోబెట్టుకుని, పీకేయి..... అన్నాను. అన్నానే గానీ, ఎంత బాధో అప్పుడు తెలీలేదు. కాస్త కెలికి, లోపలి చీము అంతా తీసాక ఒక పట్టకారుతో పన్ను పీకాడు. (అప్పటికీ ఎనస్థీషియా ఇచ్చాడు - కానీ పని అది పూర్తిగా పని చేయదని కూడా చెప్పాడు హీ ... హీ.. ) బాబోయ్ ..... ఆ పది క్షణాలూ చచ్చి బతికాననుకోండి. అమ్మో... పిల్లలు పుట్టినపుడు ఆపరేషనులు అయినా ఇంత నొప్పి కలగలేదు ! అదే మాట డాక్టరుతో అంటే, గుండె పోటు కన్నా చాలా రెట్లు ఎక్కువైనది పన్ను పోటు అని చెప్పాడు నవ్వుతూ.... !! (అయినా పన్ను పీకేవాడికేం తెలుస్తుంది - పీకించుకునేవారి నొప్పి!!) రాత్రి అంతా నొప్పి. మా పాప కి పాలు కూడా అర్ధరాత్రి వరకూ ఇవ్వలేక పోయాను. ఇప్పుడు కధ ఏమిటంటే, మూడు రోజులు నేను ఏమీ తినకూడదు. కేవలం ఐస్ క్రీము / చల్లని పాలు మాత్రం తీసుకోమన్నాడు. ఫామిలీ పాక్ తెచ్చి పెట్టారు. మా వారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. అందువల్ల బ్లాగు మిత్రులారా, పన్ను నొప్పిని అస్సలు అశ్రద్ధ చేయకండి. లేకుంటే పన్ను కే మోసం వస్తుంది. నాలా మీరు ఎవ్వరూ పన్ను కోల్పోకూడదని ఆశిస్తూ - మళ్ళీ ఒకసారి అందరికీ జాగ్రత్త చెబుతున్నాను.

Tuesday 13 July 2010

నేతి బొట్టు

అన్నం లోకి ఎంత మంచి ఆధరువులు ఉన్నప్పటికీ, ఒక్క నేతి బొట్టు అలా మెతుకులమీద పడనిదే - ముద్ద దిగదు నాకు. కొందరికి పచ్చళ్ళలో నూనె వేసుకుని తినే అలవాటు ఉంటుంది - కానీ అదేమిటో, మనకి నూనె తిరగమోత పెట్టినా, మళ్ళీ నెయ్యి పడాల్సిందే. చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని నేను. కానీ నెయ్యి అలా తింటూ ఉంటే - గుమ్మం పట్టకుండా తయారు అవుతానని వెక్కిరించేవారు నన్ను. పొరపాటున ఇంట్లో నెయ్యి అయిపోయిందా, ఆరోజు అన్నమే సహించేది కాదు. మా అమ్మమ్మ - నిన్ను నేతి బొట్టు సాయిబు కి ఇచ్చి పెళ్ళి చెయ్యాలే అని నవ్వుతూ ఉండేది. ఇంట్లో పాడి ఉండే వారికి నెయ్యీ, వెన్నా, మీగడా అలవాటు ఉండడం సహజం. నగరంలో పుట్టి పెరిగిన నాకు అవన్నీ లేకున్నా, మా ఇంట్లో ఎప్పుడూ బఱ్ఱెపాలు పోయించుకునే అలవాటు ఉండబట్టి, కాస్తో కూస్తో మంచి పాల ఉత్పత్తుల వాడకంతో పెరిగాము. నెయ్యికి మా ఇంట్లో నాతో మా చిన్న తమ్ముడు పోటీ పడేవాడు. ఏ విషయంలో నైనా సర్దుకునేదాన్ని కానీ నెయ్యి విషయంలో మాత్రం అస్సలు ఊరుకునేదాన్ని కాను. మా చుట్టాలు ఎవరి ఇంటికి వెళ్ళినా, బాగా నెయ్యి వేసి అన్నం పెట్టిన వాళ్ళే గొప్ప నాకు ! పిసినారి తనం చూపించకుండా మా మేనత్త వాళ్ళ ఇంట్లో, మా వెంకటలక్ష్మి అత్త వాళ్ళ ఇంట్లో మాత్రం మంచి నెయ్యి ఉండేది. ఇక మా అమ్మమ్మ వాళ్ళ పుట్టిల్లు చాలా పల్లెటూరు. అక్కడికి వెళ్ళామంటే పండగే పండగ. నెయ్యి, వెన్న, మీగడ పెరుగు - అన్నీ దండిగా తినేవాళ్ళం. మా అవ్వ (అమ్మమ్మ వాళ్ళ అమ్మ) మాకు మంచి నెయ్యి దొరకదని, అది పనిగా ఊరంతా గాలించి, మంచి వెన్న కొని, నెయ్యి చేసి పంపేది. ఆ నెయ్యి వచ్చిన రోజు మాత్రం మా అమ్మ ఎంత నెయ్యి అడిగినా వేసేది.
నెయ్యి బజారులో రకరకాలు దొరుకుతున్నప్పటికీ, ఇంటిలో తయారు చేసిన నెయ్యి రుచే వేరు. మా ఇంట్లో చిక్కని బఱ్ఱె పాల వాడకం వల్ల పెరుగు పైన చాలా మీగడ కట్టేది. ఆ మీగడ తీసిపెట్టి 4,5 రోజులకి ఒకసారి మజ్జిగ చిలికి, వెన్న తీసేది మా అమ్మ. వెన్న తీయగానే మొదట నిమ్మకాయంత వెన్నపూస మా ఇంట్లో కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి, మిగతాది కాచి నెయ్యి తయారు చేసేది. ఇక అన్నం తినడానికి తొందర పడేవాళ్ళం. ఎవరు ముందు తింటే వారికే వెన్న ముద్ద దక్కుతుందని! కానీ మా అమ్మ అందులోనూ భాగాలు పెట్టి, నాకూ మా తమ్ముళ్ళకీ సమానంగా కొంచెం కొంచెం పెట్టేది. ఆ రోజులు తలచుకుంటే ఇప్పటికీ నోరు ఊరుతుంది. మా ఇంట్ళో ఎప్పుడూ 2,3 రకాల పచ్చళ్ళు ఉండేవి - చద్దెన్నం లో పచ్చళ్ళు వేసుకుని, నెయ్యితో కలిపి తింటే - ఆ రుచే వేరు. సహజంగా మాకు తిఫ్ఫిన్ అలవాటు లేదు. నాలుగు పూటలా అన్నమే (బ్రేక్ఫాస్ట్, లంచ్, సాయంత్రం స్నాక్స్, దిన్నర్) తినేవాళ్ళం. కానీ నెయ్యి తోడుగా - ఏ ఊరగాయో పచ్చడో ఉంటే అదే చాలు ... పెద్ద గిన్నెలో కలిపి మా అమ్మమ్మ అందరికీ ముద్దలు పెట్టేది. ఆ మజా ఇప్పటి పిల్లలు నిజంగా అనుభవించట్లేదు. వాళ్ళ చుట్టూ అన్నం తినండిరా అని తిరగడమే సరిపోతోంది కానీ, తిండి దగ్గర మహా పేచీలు పెడుతున్నారు.
నెయ్యి సంగతి ఎలా ఉన్నా, కొన్ని పచ్చళ్ళలో మటుకు వెన్న పూస నంజుకుని తింటే మహదానందంగా ఉంటుంది, పచ్చిమిరపకాయల పచ్చడి, గోంగూర పచ్చడి, పండు మిరపకాయల కారం - వీటిల్లోకి వెన్న పూసే సెహబాసూ! అనిపించుకుంటుంది. మా అమ్మమ్మ చెప్పేది, వాళ్ళ చిన్నప్పుడు, సన్న అన్నం తినడం అంటే చాలా లగ్జరీ అని లెక్కట! జొన్న అన్నం, వరిగె అన్నం, సజ్జన్నం, సజ్జ రొట్టెలు - రోజు వారీ తినేవారుట. కానీ ఆ ఆహారాల్లోకి పచ్చళ్ళే కలుపుకునే వారట. అయితే కావలసినంత నెయ్యి / వెన్నపూస కూడా దట్టించే వారట. మరి ఇంక రుచిగా ఉండక చస్తున్నా మరి ... చెప్పండి? మరో విషయం కూడా ఉందండోయ్! గారెలు నూనెలో కాదు, నెయ్యిలో నే వేయించుకు తినేవారట! మరి అంత నెయ్యి తిన్నా వారికేమీ కాలేదంటే, ఆ రోజుల్లో చేసే శారీరక శ్రమ వల్ల కొవ్వు పేరుకు పోకుండా ఉండేది.
అప్పుడే రోట్లో నూరిన గోంగూర పచ్చడో, చింతకాయ పచ్చడో, కందిపొడి వేసి అన్నంలో కలిపి, దానికి రవ్వంత నెయ్యి చేరిస్తే ... ఆ రుచే వేరు. ఇక నిత్య ప్రసాదం ఆవకాయ ఉండనే ఉంది. పప్పూ + ఆవకాయ + నెయ్యి మన తెలుగు వారి ప్రత్యేక కాంబినేషన్ కదా! పచ్చళ్ళకే గానీ వేరే దేనిలోనూ నెయ్యి అక్కరలేదనుకుంటే - పప్పులో కాలేసినట్లే! పప్పులో నెయ్యి వేసుకుంటే మహ కమ్మగా ఉంటుంది. ఇక సాంబారులోనూ, చారులోనూ కాసింత నెయ్యి తగిలిస్తే బహు పసందు గా చవులూరిస్తుంది. మా అమ్మ చారుకి మటుకు తప్పని సరిగా నేతి తిరగమోత పెట్టేది.
టిఫిన్ల విషయంలోనూ నెయ్యి పాత్ర తక్కువేమీ కాదు. వేడి ఇడ్లీల పైన నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇక దోసెలు కూడా నెక్కితో కాలిస్తే మహా రుచిగా ఉంటాయి. మా నెల్లూరులో కారం + నెయ్యి దోసెలు చాలా ఫేమస్. ఇక నేతి పెసరట్టు మాట వేరే చెప్పాలా ? ఉప్పు పొంగలిలోనూ, ఉప్మాలోనూ పైన నెయ్యి వెయ్యనిదే అస్సలు బాగుండదు. చపాతీలు, పరాఠాలు కాలిస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. తిఫిన్లోకి వేసుకునే కారప్పొడిలోనూ, ఉల్లి/వెల్లుల్లి కారంలోనూ, అల్లంపచ్చడిలోనూ కాస్త నెయ్యి తగిలిస్తే అమృతంలా ఉంటుంది.
ఇక మిఠాయిల్లో నెయ్యి వాడనిదే అస్సలు రుచే రాదు - మా నాయనమ్మ మైసూరు పాక్ అద్భుతంగా చేసేది. ఇంట్లో వెన్న కాచిన కమ్మని నేతితో చేస్తే మరి ఎందుకు బాగుండదూ ? పరవాన్నం గిన్నెలో పైన నెయ్యి తేలాల్సిందే ! చక్కెర పొంగలి చేతికి అంటుకోకుండా ఉండేలా నెయ్యి పోయాల్సిందే! మరి బూరెలు, బొబ్బట్ల మాటో....? బూరెకి కన్నం చేసి, దానిలో నెయ్యి పోసుకుని తినాలని పాక శాస్త్రఙ్ఞుల ఉవాచ. బొబ్బట్లపైనా నెయ్యి వేసుకుని తింటే - ఆహా అదుర్స్, అనకుండా ఉండగలమా?
మంచి వెన్న కాస్తుంటే, ఆ కమ్మటి ఘుఘుమల సువాసనలకి జిహ్వ గ్రంధులకి ప్రాణం లేచి రాదా? వెన్న కాచిన తరువాత నెయ్యి అట్టడుగున పేరుకున్న గసి / గోకుడు కూడా చాలా మందికి ఇష్టం. దానిలో చక్కెర వేసుకుని తినేవాళ్ళం మేము.
మా ఇంటిలో ఇప్పటికీ వెన్న కాచిన నెయ్యే వాడతాము ! ఇంట్లో వెన్న చేయడం కుదరకపోతే - బజారులో దొరికే కొకింగ్ బటర్ అయినా తెచ్చి కరగబెట్టి నెయ్యి చేసుకుంటాము. నూక నూక గా పేరుకున్న నెయ్యిని వేడి వేడి అన్నంలో వేసుకుంటే, ఆ నెయ్యి అన్నం పిల్లలకి కూడా చాలా మంచిదంటారు.
నెయ్యి అభికరించకుండా దేవుడికి నైవేద్యం పెట్టకూడదు. పంచామృతాల్లో నెయ్యి ఒకటి. యఙ్ఞ యాగాదుల్లో ఆవు నేయ్యినే వాడతారు. పంక్తి భోజనాల్లో, ఆధరువులు అన్నీ వడ్డించి, అన్నం వడ్డించాక నెయ్యి వేయనిదే - భోజనాలు మొదలు పెట్టం కదా! ఆయుర్వేదంలో సైతం నెయ్యి తెలివి తేటల్ని పెంచుతుందనీ, మెదడు కి మంచిదనీ చెప్పారు. పైగా నూనె కన్నా, నెయ్యి వంటికి చాలా మంచిదని చెప్తారు. గర్భిణులు మొదటి ముద్దను నెయ్యితో తింటే మంచిదని అంటారు. గర్భంతో ఉన్నవారు తినే మొదటి ముద్ద బిడ్డకే పోతుందని, దాని వల్ల బిడ్డ మెదడు బాగా వికసిస్తుందని అలా పెద్దవాళ్ళు చెప్పారు. పాలిచ్చే తల్లులు కూడా నెయ్యి బాగా తింటే మంచిదని చెబుతారు.
సౌందర్య పోషణలోనూ నెయ్యి పాత్ర ఏమీ తక్కువ కాదండొయ్! బాగా తలకి నెయ్యి మర్దించి తరువాత తలస్నానం చేస్తే, జుట్టు పట్టులా మెరవడమే కాక, వంట్లో వేడి కూడా తగ్గుతుంది. ఇప్పుడు డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుంటున్నారు - నెయ్యి తింటే మొటిమలు వస్తాయని చాలా మంది మానేస్తున్నారు. కానీ కేవలం నెయ్యి మానేస్తే మొటిమలు తగ్గవు - హాయిగా నెయ్యి తినండి; కాకుంటే అవసరమైతే పరిమాణం కాస్త తగ్గించండి అంటాను నేను!
ఏ వంటకమైనా నేతితో చేస్తే దాని రుచే వేరు. హైదరాబాదు లో పేరు పొందిన వంటకం బిరియానీలో కూడా నెయ్యినే విరివిగా వాడతారు. సులభంగా చేసే సున్ని ఉండలు, ఎవైనా పిండిలడ్డూలకి మంచి నెయ్యి వాడనిదే కుదరనే కుదరదు! అలాగే కొన్ని కూరల్లోనూ నెయ్యి తో చేస్తే చాలా బాగుంటాయి. వెయ్యేల, నెయ్యి కి సమానమైనది మరొకటి లేదు, ఉండదు, ఉండబోదు కూడా!
మొత్తానికి ఈ టపాలో అందరినీ నెయ్యిలో వేపుకు తిన్నాను. మీరంతా నిత్యం నెయ్యిలో మునిగి తేలుతారని ఆశిస్తూ - సర్వం నెయ్యార్పణమస్తు!!

Monday 28 June 2010

మన పీ వీ జయంతి

చెప్పుకుంటే సిగ్గుచేటు.....ఒక మహా మనిషి మహాభినిష్క్రమణాన్ని కూడా రాజకీయం చేసి, ఆయన శవాన్ని అవమానించారు!
మన నాయకుణ్ణి అవమానిస్తుంటే చూస్తూ ఊరుకున్న తెలుగు నాయకులందరికీ సిగ్గుండాలి.....!
నేడు పి వి జయంతి ... ఢిల్లీలో ఒక స్మారక చిహ్నానికైనా నోచుకోని ఆయన గురించి తలచే అర్హత కూడా ఈ కాంగ్రెసు నాయకులకి లేదు. అన్ని పాపాలనీ పి వి కి అంటగడుతున్నారు! ఆయన ఇప్పటి నాయకుల్లాగా లక్షల కోట్లు మూట కట్టుకోలేదు. అవినీతికి పాల్పడలేదు. స్వంతవారిని అందలాలెక్కించలేదు. దేశం కోసం అలోచించారు ..... దేశం కోసం జీవించారు .... 16 భాషలు అనర్గళంగా మాట్లాడగల దిట్ట. సాహిత్యంలో తనదంటూ ఒక ముద్ర వేసిన పుంభావ సరస్వతి. దేశ భాషలే కాదు, విదేశీ భాషల్లో సైతం ప్రావీణ్యత సాధించి, ఎన్నో రోజులు విదేశాంగ శాఖ మంత్రిగా ఖ్యాతి గడించిన పండితుడు. దేశాన్ని సంస్కరణల బాట పట్టించి, నేటి భారతాన్ని ఇంత సంపదతో తులతూగేలా చేసిన మేధావి. సోనియమ్మ భజన చేసే తెలుగు కాంగ్రెసు నాయకులంతా .... అన్ని పాపాలు ఆయనకి అంటగడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నరో నాకు అర్ధం కావట్లేదు! ఆయన ఒక తెలుగు వాడు కనుకే ఈ అన్యాయం జరుగుతోంది, అదే ఏ తమిళుడో, గుజరాతీనో, బెంగాలీ నో అయి ఉంటే - ఆకాశానికి ఎత్తే వారు, అలా ఆకాశానికి ఎత్తేవరకూ, ఆ రాష్త్రం వారు ఊరుకునేవారు కాదు. అవునులే - అందరికీ వారి జాతి పై అభిమానం ఉంటుంది, ఒక్క తెలుగు వారికే - తన తెలుగు జాతి పై అస్సలు ప్రేమ ఉండదు ... పైగా అదొక గొప్ప విషయంగా చెప్పుకుంటారు! ఈ రోజు ఇంత బీరాలు పలుకుతున్న తెలంగాణా నాయకులంతా, పీ వీ కి అంత అవమానం జరుగుతుంటే ఊరుకుంటున్నారేం? మొత్తానికి ఆయన చచ్చిపోయి, బ్రతికిపోయారు. లేకుంటే ఈ ఆరోపణలు విని తట్టుకోలేకపోయేవారు! తన శిష్యుడైన మన్మోహన్ సైతం అందరిముందూ ఆయన పేరు ఎత్తుకోలేక పోవడాన్ని చూసి, గుండె ఆగిపోయేదేమో!! నిజమైన దేశభక్తుడు, భూదానం చేసి, పేదలకు ఆస్తి పంచి - మాటలు కాక చేతల్లో ప్రతీ పనినీ చేసి చూపి, ఈ తరం వారు ఇంత హాయిగా బ్రతికేందుకు రాచ బాట వేసిన మా పీ వీ తాతయ్యకి (మా తాతయ్య లా అనిపిస్తారు ఆయన!!)నా ఘన నివాళి! కనీసం ఇప్పుడైనా తెలుగు నేతలు మేల్కొని, ఆయనపై బుఱద చల్లనివ్వకుండా చూసుకుంటే - అదే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది.

Monday 17 May 2010

చిన్నారి శ్రీయుక్త

మా చిన్నారి పాప లలితా శ్రీయుక్త పుట్టటం వల్ల కొద్ది కాలంగా బ్లాగులోకానికి దూరంగా ఉన్నాను. ఈ రోజే మా పాపకి మూడో నెల వచ్చింది. మా పాపని అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ - మీ విరజాజి.

Wednesday 20 January 2010

అమరవీరులంటే ఎవరు?

బ్రతకడం చాత కాక, బ్రతుకు విలువ తెలీక, అవగాహనా రాహిత్యంతో ప్రాణాలు తీసుకునేవారు అమరవీరులు అవుతారా? తెలంగాణా సాయుధ పోరాటంలో నేలకొరిగిన ఎందరో సామాన్య ప్రజలు అమరవీరులు - వారు కనీసం ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కున్నారు. అన్యాయానికి ఎదురు నిలిచారు. సాహసంతో ముందుకు ఉరికారు. వారితో ఈ ఆత్మహత్యా వీరులని పోల్చి, ఆ నిజమైన అమరవీరులని అవమానిచడానికి ఈ జే ఏ సీ నాయకులకి, తెలంగాణా వేర్పాటువాదులకి మనసు ఎలా ఒప్పింది? మన గడ్డపై ఎందరో యోధులు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారు. కానీ ఒక్కరు కూడా పిఱికి తనంతో ఆత్మహత్య చేసుకోలేదు. వారి పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలుపుకొని, వారు నిజంగా అమరులైనారు ! నిరాశతో, నిస్పృహతో తమ తనువు చాలించేవారు వీరులెలా అవుతారు? జీవితం ఎంతో విలువైనది. మనకు కావలసింది దక్కకుంటే ఎవ్వరికైనా ఆశాభంగం కలుగుతుంది. అయితే, ఆశలు నెరవేరే మార్గం కోసం ప్రయత్నించాలిగానీ, జీవితాన్ని అంతం చేసుకుంటే ఆశ ఫలిస్తుందా? మన పై ఎన్నో ఆశలు పెట్టుకుని, మనలని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు, మనకు చేదోడు వాదోడుగా ఉన్న కుటుంబ సభ్యులు మన మరణంతో ఎంత కృంగిపోతారో ఒక్కసారి ఆలోచిస్తే, ఇలాటి పిచ్చి పనులు ఎవ్వరూ చేయరు. కానీ ఇలా తమని తాము చంపుకొన్న వారికి అమరత్వాన్ని ఆపాదించి అమర వీరులుగా కీర్తించి, హీరోలుగా చిత్రీకరిస్తే, ఇంకెందరు ఆ భావోద్వేగంలో కొట్టుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటారో అన్న కనీస విచక్షణ ఈ నాయకులకి లేదా? తెలంగాణా రాష్ట్రం వస్తే, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మీడియా అంతా చనిపోయిన ఒక విద్యార్ధిని గురించి అంతగా ఘోషిస్తూ ఉంటే - ఇంకెందరు తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ అమరత్వాన్ని పొందుదామని స్ఫూర్తి పొందుతారో వీరికి అర్ధం కాదా? ఇలాటి చావులకి ప్రభుత్వాలు కాదు, వారి మైండ్ సెట్ ని ప్రభావితం చేస్తున్న వేర్పాటు వాదులు, విభజన వీరులు, మీడియా బాధ్యత వహించాలి. మనుషులని చంపే ఉద్యమాలు కాదు - చేతనైతే, మానవీయ విలువలని కాపాడే ఉద్యమాలు మనకి ఇప్పుడు అవసరం. చిన్నారి తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా - చెప్పుడు మాటలు విని, బంగారు భవిష్యత్తుని మీరు మీ చేతులతో నాశనం చేసుకోకండి. మీ చదువులను పాడు చేసుకోకండి. విద్యార్ధి జీవితం ఒకసారి పోతే మళ్ళీ రాదు, మీజ్ఞానాన్ని పెంచుకుని, దేశానికి ఉపయోగపడే పనులు చెయ్యండి. మీ చదువులు పూర్తి చేయడానికి కష్టపడండి, తప్పక తరువాత ఆ కష్టం విలువ మీకు తెలిసి వస్తుంది. చేతనైతే ఒకరినుంచీ మంచి నేర్చుకోండి - అంతే గానీ విద్వేషాలు మనసుల్లో నింపుకోకండి. మన తల్లితండ్రుల కలలు మన ద్వారానే సాకారం అవుతాయని గ్రహించండి. జీవితాన్ని జీవించండి. ఈరోజు మిమ్మల్ని రెచ్చగొడుతున్న ఈ నాయక గణంలో ఒక్కరి పిల్లలు కూడా ప్రాణాలు తీసుకోవడంలేదు - అది గమనించండి. ఆత్మహత్య ఏనాటికీ అమరత్వం కాదని గుర్తెరగండి. రాష్ట్రం వస్తే, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మీడియా అంతా చనిపోయిన ఒక విద్యార్ధిని గురించి అంతగా ఘోషిస్తూ ఉంటే - ఇంకెందరు తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ అమరత్వాన్ని పొందుదామని స్ఫూర్తి పొందుతారో వీరికి అర్ధం కాదా? ఇలాటి చావులకి ప్రభుత్వాలు కాదు, వారి మైండ్ సెట్ ని ప్రభావితం చేస్తున్న వేర్పాటు వాదులు, విభజన వీరులు, మీడియా బాధ్యత వహించాలి. మనుషులని చంపే ఉద్యమాలు కాదు - చేతనైతే, మానవీయ విలువలని కాపాడే ఉద్యమాలు మనకి ఇప్పుడు అవసరం. చిన్నారి తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా - చెప్పుడు మాటలు విని, బంగారు భవిష్యత్తుని మీరు మీ చేతులతో నాశనం చేసుకోకండి. మీ చదువులను పాడు చేసుకోకండి. విద్యార్ధి జీవితం ఒకసారి పోతే మళ్ళీ రాదు, మీజ్ఞానాన్ని పెంచుకుని, దేశానికి ఉపయోగపడే పనులు చెయ్యండి. మీ చదువులు పూర్తి చేయడానికి కష్టపడండి, తప్పక తరువాత ఆ కష్టం విలువ మీకు తెలిసి వస్తుంది. చేతనైతే ఒకరినుంచీ మంచి నేర్చుకోండి - అంతే గానీ విద్వేషాలు మనసుల్లో నింపుకోకండి. మన తల్లితండ్రుల కలలు మన ద్వారానే సాకారం అవుతాయని గ్రహించండి. జీవితాన్ని జీవించండి. ఈరోజు మిమ్మల్ని రెచ్చగొడుతున్న ఈ నాయక గణంలో ఒక్కరి పిల్లలు కూడా ప్రాణాలు తీసుకోవడంలేదు - అది గమనించండి. ఆత్మహత్య ఏనాటికీ అమరత్వం కాదని గుర్తెరగండి.

Tuesday 5 January 2010

హైదరాబాదు 1956 లోనే చాలా అభివృధ్ధి చెంది ఉంది

"హైదరాబాదు 1956 లోనే చాలా అభివృధ్ధి చెంది ఉంది - కొత్తగా అభివృధ్ధి చెందినది ఏమీ లేదు" - (హైదరాబాదు కోసం తెలంగాణా వారు చెప్పే పేద్ద అబద్ధం)

అలా అయితే - 1956 తరువాత హైదరాబాదులో పెట్టిన పరిశ్రమలను, విశ్వ విద్యాలయాలను, పాఠశాలలను, కళాశాలలను, ఐ.ఐ.టీ, ఐ.యెస్.బి లాటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలను, అనేక కార్యాలయాల ప్రధాన శాఖలను, అలాగే ప్రతీఎ ఒక్క పెద్ద రోడ్డునూ, ఫ్లై ఒవర్ బ్రిడ్జీలనూ - అన్నీ తెచ్చినది సీమాంధ్ర ముఖ్య మంత్రులే కనుక, సీమాంధ్ర కి ఇచ్చేస్తారా? మా తెలుగు లిపి ని మాకు ఇచ్చి తెలంగాణాకి వేరే లిపిని పెట్టుకుంటారా? ఇక్కడ లక్షలు పెట్టి ఇళ్ళు కట్టుకున్న ప్రతీ ఒక్కరికీ ఎంత ఖర్చుపెట్టారో అంత డబ్బు ఇచ్చేస్తారా? ఊరికే మాట్లాడడం సులభం. మీరు కష్ట పడి సంపాదించిన ఆస్థి ఎవరైనా లాగేసుకుంటే - తీసుకొమ్మని ఇచ్చేస్తారా? ఈ రాష్ట్రం అందరిదీ అని అన్ని ప్రదేశాలకీ పరిశ్రమలు తీసుకు వస్తే - తెలంగాణా లో ఉన్నవన్నీ నావి. అని ఈ రోజు మాట్లాడుతున్నారు. అలాగే ఇంతకు మునుపు నిజాం ఏలుబడిలో ఉన్న మహారాష్ట్ర జిల్లాలనీ, కర్ణాటకా జిల్లాలనీ తెలంగాణా రాష్ట్రంలో కలపాలి కదా.... కేవలం ఈ 10 జిల్లాలే విడిపోతే అది సరి అయింది ఎలా అవుతుంది? తెలంగాణా లో ప్రాజెక్టులు కట్టే అవకాశం నిజంగా ఉన్నదా? సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న దక్కను పీఠభూమిలో ఎంతవరకూ డాములు కట్టగలము? తెలంగణా ప్రత్యేక రాష్ట్రం అయిపోతే ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి? చిన్న రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు అవసరం? అప్పుడు మరి ఈ ఉద్యమించిన నిరుద్యోగులు ఏమి చేస్తారు? ప్రత్యేక వరంగల్, ప్రత్యేక అదీలాబాద్ కావాలంటారా? కృష్ణా, గోదావరీ నదుల నీరు ఎన్ని జిల్లాలకి సరిపోతుంది? అస్సలు అక్కడ ప్రాజెక్టులు కట్టడం ఎంత వరకూ నిజంగా సాధ్యం? అస్సలు ముందు ఈ రాజకీయ నాయకుల పొట్టలు నింపడానికి వచ్చే నిధులు సరిపోతాయా? హైదరాబాదులో అన్ని రాష్ట్రాల వారూ ఉన్నారని చెబుతున్న వీరంతా అందరికన్నా ఎక్కువగా ఉన్న సాటి తెలుగువారిని ఎంత హీనంగా చూస్తున్నారు? "మాకు అన్యాయం జరిగింది.... మమ్మల్ని దోచుకుంటున్నారు.... మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం.... మా రాష్ట్రం మాకు ఇవ్వండి....." ఎన్ని సార్లు అలా మాట్లాడుతారు? "తెలంగాణాకి అడ్డమొస్తే అడ్డంగా నఱికేస్తాం" అని నినదిస్తున్న వారు విద్యార్ధులా? అలాగైతే ప్రతీ ఒక్క చిన్న రాష్ట్రాన్నీ ఇచ్చేయాలి. సర్దార్ వల్లభ్ భాయి పటేల్ భారత ప్రభుత్వంలో విలీనం చేసిన సంస్థానాలన్నీ ఒక్కో రాష్ట్రంగా అవతరిస్తాయి. మళ్ళీ ఇంకో సారి మనం పర పాలనకి తెరలు తీద్దాం ! కష్టపడి సాధించుకున్న స్వరాజ్యాన్ని మళ్ళీ పరతంత్ర్యంగా మార్చేద్దాం. ఒకడి క్రింద బతకలేమని చెప్పి - మనలో మనమే కుమ్ముకొని వేరే వాడికి భారత దేశాన్ని సమర్పిద్దాం ! అమ్మా తెలుగు తల్లీ, నిన్ను దయ్యం అనేవారి నాలుకల్లో పలికే ఒక్కో తెలుగు మాటా సరైనదిలా వచ్చేలా చూడు తల్లీ! తెలుగు జాతికి సద్బుధ్ధి ప్రసాదించు - మాలో మాకు తగవులు పెడుతున్న వారిని గుర్తించి మమ్మల్ని ఒక్కటిగా ఉండేలా దీవించు తల్లీ! మూర్ఖులకి తెలివి నిచ్చి జాతి సమైక్యత ని విఛ్ఛిన్నం కాకుండా చూడు తల్లీ! నాకు తెలుసు - మళ్ళీ తెలంగాణా వాదులు చాలా పిచ్చి మాటలు రాస్తారని.... కానీ వారందరికీ ఒకటే విన్నపం. ఈ రాష్ట్రం అందరిదీ. అలాగే హైదరాబాదు నా రాష్త్ర రాజధాని కనుక నాది అనే హక్కు ప్రతీ ఒక్క తెలుగు వ్యక్తికీ ఉన్నది. నేను ముందు తెలుగు వాడిని, నా రాష్త్రం తెలుగు వారికి ప్రతీక కనుక నా రాష్త్రం విడిపోకూడదు అని ఆశించడం ప్రతీ ఒక్కరి హక్కూ, బాధ్యత కూడా. ఇప్పుడు జరిగిన అందోళనల వల్ల కలిగిన నష్టాన్ని ఉపయోగించి మన రాష్త్రంలో చాలా వెనుక బడి ఉన్న ప్రాంతాలని అభివృధ్ధి చేయగలిగే వారం. ఎదుటివారిని తిట్టడం సంస్కారం కాదు - చేతనైతే ఎదుటివారివద్దనుంచీ మంచి విషయాలను నేర్చుకోండి. కష్టపడకుండా ఎవ్వరూ ఏమీ సాధించలేరు. ఏ ప్రాంతం వారైనా కష్టపడగలిగే వారు తప్పక పైకి వస్తారు. మనది అనే మాటకి ఉన్న బలం నాది అనే మాటకి లేనే లేదు. ఐకమత్యంగా ఉంటే మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవాల్సి వస్తుందని - కొందరు పన్నిన ఎత్తుగడ ఫలించి, వేర్పాటువాదం ఎక్కువ అయ్యింది..... హైదరాబాదుకి రావలసిన ప్రాజెక్టులన్నీ చెన్నయ్ కీ, బెంగుళూరుకీ తరలిపోతున్నాయి. మన చేతులతో మనమే మన భవిష్యత్తు పాడు చేసుకుంటున్నాము.... అది గుర్తించండి. ఎదుటివారికి అవకాశాలు వస్తున్నాయని వాపోకుండా వారిలా మీరూ కష్టపడండి. మన చేతకాని తనాన్ని ఎదుటి వాడి దోపిడీ అనకండి -- హైదరాబాదు శివారు గ్రామాల్లో ఎకరాలకి ఎకరాలు కోట్లు కుమ్మరించి కొన్న వారిలో ఎక్కువ శాతం తెలంగాణేతరులే ! కష్టపడి పని చేయాలనుకునే ఎవ్వరూ మన అభివృధ్ధిని అపలేరు. ఇప్పుడున్న పోటీ వాతావరణంలో అదే ముఖ్యం. కానీ చదువులు మానేసి, రోడ్ల మీదికి ఎక్కితే అది వారికే నష్టం. ఈ సంగతి ఉద్యమాలు చేస్తున్న విద్యార్ధులందరూ అర్ధం చేసుకోవాలి.