Monday, 29 December 2008

బ్లాగ్మిత్రుల పరిచయం

ఒక్కోసారి మనం తెలీని భావోద్వేగానికి లోనై, మాటలు రాని మూగవాళ్ళమైపోతామని చాలా మంది అంటూ ఉంటే విని, క్షణమైనా నోరుమూసుకోని ఉండలేని వాగుడుకాయని, నేను మౌనంగా ఉండడమా? అనుకునేదాన్ని. కానీ ఇరవై ఐదవ తారీకున హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో అందరు బ్లాగ్మిత్రులని కలిసిన క్షణాన మాటలే కరువయ్యాయి. ఆ సంతోషాన్ని నిజంగానే నాకొచ్చిన కాసిని తెలుగు మాటల్లో వర్ణించలేనని అనిపించింది. ఎందరో తమ పనులని వదిలి, ఈ కాసిని రోజులూ నిస్వార్ధంగా తెలుగు భాషకి చేస్తున్న సేవ చూసి, నేనేమీ చెయ్యలేకపొయ్యానే అని బాధ కూడా కలిగింది. నేను అందరికీ తెలిసిన బ్లాగరిని కాను..... కుదిరినప్పుడు ఒక చిన్న టపా రాయడం, అప్పుడప్పుడూ కొన్ని బ్లాగుల్లో వ్యాఖ్యలు రాయడం తప్పితే పెద్దగా కని (విని) పించని పేరు నాది. కానీ కేవలం జ్యోతి గారి బ్లాగులో ప్రదర్శనకి వస్తానని రాసినందుకు చాలా మంది నన్ను గుర్తు పట్టారు. అక్కడ కూర్చుని కరపత్రాలమీద లేఖిని.ఆర్గ్; బరహ.కాం రాసి ఇవ్వడం ఒక్కటే నేను చేసిన పని. అలా రాస్తూ మధ్యలో ఒక్కోరితో మాటలు. మొదట మా స్కూలు టీచరు గారైన ఙ్ఞాన ప్రసూనగారిని కలిసాను అప్పటిదాకా ఆవిడని ఎక్కడో చూశానే అనుకుంటూ ఉన్నాను... మాటల సందర్భంలో తెలిసింది ఆవిడ మా మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలలో పని చేసారని, మా టీచరు, వారికి మంచి మిత్రురాలనీను ! ఒక్కసారి మళ్ళీ మా బడి గురించి గుర్తు చేసుకున్నాను. తర్వాత రవిగారు, తాడేపల్లిగారు, శ్రీధర్ గారు, వరూధినిగారు, చక్రవర్తి-స్వాతి గార్లు, అందరితో కొద్ది కొద్ది గా మాట్లాడాను..... ప్రసూనగారు వెళుతూ, వెళుతూ పూర్ణాలు ఇచ్చివెళ్ళారు....అవీ, జ్యోతిగారి సున్నుండలూ తినేసి..... సుజాతగారు తెచ్చిన మిరపకాయ బజ్జీలకి కూడా న్యాయం చేసి చూద్దునుకదా మా స్టాలు మొత్తం బ్లాగర్లతో నిండిపోయింది. అన్నిటికన్నా మా స్టాలులోనే సందడే సందడి. అంతలో మనవాళ్ళు ఫొటోలంటూ తెగ గోల పెట్టారు. అప్పుడు నన్ను ఎన్ని వందల తిట్లు తిట్టుకున్నానో... నా కెమెరా కూడా తెచ్చి, అందరి చిత్రాలనీ తీసుకుంటే బాగుండేదని! అయినా సరేలే, ఇందరు తీస్తున్నారు, వారి బ్లాగుల్లోనించీ తీసుకుందాం అని సమాధానపరచుకున్నా.....! శ్రీకాంత్, భార్గవ, పూర్ణిమ, రమణిగారు, అరుణపప్పు గారు అందరూ ఫోటోల్లో ఉన్నారు. అందరూ కలిసినప్పుడు అక్కడ ఎన్ని నవ్వుల పువ్వులు విరిసాయో ! ఇంకా కొద్దిసేపు అక్కడ ఉండాలి అనిపించినా... అప్పటికే చాలా సమయాభావం అయిపోయింది, పైగా మా ఇల్లు అక్కడికి చాలా దూరం కావడంతో అన్ని తీపి గురుతుల్నీ, కొత్త స్నేహాల్నీ కొంగున కట్టుకుని వెనుతిరిగాను. అందరినీ ఇలా వీలున్నప్పుడు తప్పక కలవాలని ఘఠ్ఠిగా నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు మాత్రం ఒకటి అనిపించింది.... కాస్త ప్రయత్నిస్తే తప్పక తెలుగు భాషకి మంచి రోజులు వస్తాయి. అవును..... మనమంతా కాస్త మన తెలుగు కోసం మన జీవితంలో కొన్ని గంటల్ని / రోజుల్ని కేటాయిస్తే, తెలుగు మళ్ళీ వెలిగి పోతుంది !

2 comments:

సుజాత వేల్పూరి said...

విరజాజి గారు,
ఆ మర్నాడే ఊరికెళ్లడం వల్ల మీ పోస్టు ఇవాళే చూస్తున్నాను! అలా అందరం కలుసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది. తెలుగు భాష కోసం పని చేయగలిగే వాళ్ళు ఉన్నారన్న ధైర్యం కల్గింది. మన తెలుగు కేమీ పర్వాలేదన్న భరోసా కలిగింది.

దైవానిక said...

శిరీష గారు,
మిమ్మల్నందరిని కలవడం నాకు భలే అనిపించింది. ఆరోజు మొదలుకొని మళ్ళా ఇవ్వాలే ఆఫీసుకొచ్చాను :)