Wednesday, 31 December 2008

తెలుగు జాతి

తెలుగు జాతి మూలాలకై తపిస్తూ తెలుగు వ్యాప్తికై కృషి చేస్తున్న సామల వెంకట రమేష్ గారి వ్యాసాలు తెలుగుపీపుల్.కాం లో ఉన్నాయి. మనకి తెలీని ఎన్నో విషయాల్ని ఆయన ఈ వ్యాసాల్లో రాశారు. కింది లంకెని చూడండి.

http://www.telugupeople.com/discussion/userArticles.asp?userId=CV_RAMESH

అదే విషయంపై వ్యాసాలు అందిస్తూన్న సుందరం గారి వ్యాసాలు కింది లంకెలో చూడగలరు.

http://www.telugupeople.com/discussion/userArticles.asp?userId=ట౦౦౩౩

Monday, 29 December 2008

బ్లాగ్మిత్రుల పరిచయం

ఒక్కోసారి మనం తెలీని భావోద్వేగానికి లోనై, మాటలు రాని మూగవాళ్ళమైపోతామని చాలా మంది అంటూ ఉంటే విని, క్షణమైనా నోరుమూసుకోని ఉండలేని వాగుడుకాయని, నేను మౌనంగా ఉండడమా? అనుకునేదాన్ని. కానీ ఇరవై ఐదవ తారీకున హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో అందరు బ్లాగ్మిత్రులని కలిసిన క్షణాన మాటలే కరువయ్యాయి. ఆ సంతోషాన్ని నిజంగానే నాకొచ్చిన కాసిని తెలుగు మాటల్లో వర్ణించలేనని అనిపించింది. ఎందరో తమ పనులని వదిలి, ఈ కాసిని రోజులూ నిస్వార్ధంగా తెలుగు భాషకి చేస్తున్న సేవ చూసి, నేనేమీ చెయ్యలేకపొయ్యానే అని బాధ కూడా కలిగింది. నేను అందరికీ తెలిసిన బ్లాగరిని కాను..... కుదిరినప్పుడు ఒక చిన్న టపా రాయడం, అప్పుడప్పుడూ కొన్ని బ్లాగుల్లో వ్యాఖ్యలు రాయడం తప్పితే పెద్దగా కని (విని) పించని పేరు నాది. కానీ కేవలం జ్యోతి గారి బ్లాగులో ప్రదర్శనకి వస్తానని రాసినందుకు చాలా మంది నన్ను గుర్తు పట్టారు. అక్కడ కూర్చుని కరపత్రాలమీద లేఖిని.ఆర్గ్; బరహ.కాం రాసి ఇవ్వడం ఒక్కటే నేను చేసిన పని. అలా రాస్తూ మధ్యలో ఒక్కోరితో మాటలు. మొదట మా స్కూలు టీచరు గారైన ఙ్ఞాన ప్రసూనగారిని కలిసాను అప్పటిదాకా ఆవిడని ఎక్కడో చూశానే అనుకుంటూ ఉన్నాను... మాటల సందర్భంలో తెలిసింది ఆవిడ మా మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలలో పని చేసారని, మా టీచరు, వారికి మంచి మిత్రురాలనీను ! ఒక్కసారి మళ్ళీ మా బడి గురించి గుర్తు చేసుకున్నాను. తర్వాత రవిగారు, తాడేపల్లిగారు, శ్రీధర్ గారు, వరూధినిగారు, చక్రవర్తి-స్వాతి గార్లు, అందరితో కొద్ది కొద్ది గా మాట్లాడాను..... ప్రసూనగారు వెళుతూ, వెళుతూ పూర్ణాలు ఇచ్చివెళ్ళారు....అవీ, జ్యోతిగారి సున్నుండలూ తినేసి..... సుజాతగారు తెచ్చిన మిరపకాయ బజ్జీలకి కూడా న్యాయం చేసి చూద్దునుకదా మా స్టాలు మొత్తం బ్లాగర్లతో నిండిపోయింది. అన్నిటికన్నా మా స్టాలులోనే సందడే సందడి. అంతలో మనవాళ్ళు ఫొటోలంటూ తెగ గోల పెట్టారు. అప్పుడు నన్ను ఎన్ని వందల తిట్లు తిట్టుకున్నానో... నా కెమెరా కూడా తెచ్చి, అందరి చిత్రాలనీ తీసుకుంటే బాగుండేదని! అయినా సరేలే, ఇందరు తీస్తున్నారు, వారి బ్లాగుల్లోనించీ తీసుకుందాం అని సమాధానపరచుకున్నా.....! శ్రీకాంత్, భార్గవ, పూర్ణిమ, రమణిగారు, అరుణపప్పు గారు అందరూ ఫోటోల్లో ఉన్నారు. అందరూ కలిసినప్పుడు అక్కడ ఎన్ని నవ్వుల పువ్వులు విరిసాయో ! ఇంకా కొద్దిసేపు అక్కడ ఉండాలి అనిపించినా... అప్పటికే చాలా సమయాభావం అయిపోయింది, పైగా మా ఇల్లు అక్కడికి చాలా దూరం కావడంతో అన్ని తీపి గురుతుల్నీ, కొత్త స్నేహాల్నీ కొంగున కట్టుకుని వెనుతిరిగాను. అందరినీ ఇలా వీలున్నప్పుడు తప్పక కలవాలని ఘఠ్ఠిగా నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు మాత్రం ఒకటి అనిపించింది.... కాస్త ప్రయత్నిస్తే తప్పక తెలుగు భాషకి మంచి రోజులు వస్తాయి. అవును..... మనమంతా కాస్త మన తెలుగు కోసం మన జీవితంలో కొన్ని గంటల్ని / రోజుల్ని కేటాయిస్తే, తెలుగు మళ్ళీ వెలిగి పోతుంది !

Monday, 24 November 2008

తెలుగుదనపు చీరకట్టు

వెల కట్టలేని జలతారు జరీ నూలు నేత కళల వెంకటగిరి.

ముచ్చటైన నేత అల్లికల విరితావుల ఝరి మన మంగళగిరి.

కొత్త కొత్త అందాల కొంగొత్త చీరలకు పెట్టని కోట కొత్తకోట.

నాకంటే నాకంటూ అతివలు అడిగే చీర నారాయణపేట.

చీర ని తన పేరులోనే ఇముడ్చుకున్న చేనేత చీరాల.

ఘనమైన పట్టు సరసన నూలు చీరని నిలిపిన గద్వాల.

పోల్చలేని రంగుల సంకలితం వివిధ వర్ణాల పోచంపల్లి.

ధరలో లెక్కచెప్పలేని సంప్రదాయ మేళవింపు ధర్మవరం.

గంటలకొద్దీ చూడాలనిపించే వెలిసిపోని నేత చీర గుంటూరు.

పోరాట పటిమను పెంచి స్వాతంత్ర్యోద్యమానికి ఖద్దరునిచ్చిన పొందూరు.

పురి విప్పిన నెమలి నాట్యపు తళుకుల కోక పుట్టపాక.

ఉల్లము ఝల్లుమనే మెత్తటి మెరుపుల నేతల ఉప్పాడ.

లేశమైనా రసాయనాలు లేని ప్రకృతి సిద్ధ అద్దకాల లేపాక్షి.

కలల్లోని ఇంద్రధనుస్సులని కళ్ళముందు నిలిపే కళ కలంకారీ.

అన్నీ కలిసి భారతీయమంతా ఒక్కటిగా చుట్టే చక్కటి తెలుగుదనపు చీరకట్టు !

Friday, 21 November 2008

ఇరుగు - పొరుగు -1

మన చిన్నప్పటి విషయాల్ని గుర్తు చేసుకుంటే, ఆ మధుర స్మృతుల్లో గుర్తు వచ్చేది మన కుటుంబమూ, మన ఇల్లూ, మన స్నేహితులూ... మన ఇంటిని తలచుకున్నపుడో లేక మన స్నేహితుల్ని తలచుకున్నపుడో తప్పనిసరిగా గుర్తుకు వచ్చేది మన ఇంటి చుట్టుపక్కన ఉండేవాళ్ళే..! మన చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ చాలా ఎక్కువ శాతం మన పక్కింటి పిల్లలతోనో, ఎదురింటి వారితోనో అయి ఉండేది. ఇరుగూ పొరుగున ఉండే వారితో మన అనుబంధం కాస్త ఎక్కువగానే ఉండేది మరి. "ఆంటీ" / "అంకుల్" సంస్కృతి ఇంకా అంత పెరగని రొజుల్లో పక్కింటి పిన్నిగారో... ఎదురింటి బామ్మగారో, వెనకింటి బాబాయిగారో....ఎవరో ఒకరు మనకి రోజూ తారసపడుతూనే ఉండేవారు. ప్రతి చిన్న విషయానికీ ఇరుగు పొరుగు వారి సహాయం తీసుకోవడం ఆ రోజుల్లో పరిపాటి. కొత్తగా పెళ్ళయి కాపురం పెట్టిన అమ్మాయిలకి ఏ విషయమైనా తెలీకుంటే, పక్కింటి బామ్మగార్లు, పిన్నిగార్లే శరణ్యం ! (ఆ రోజుల్లో ఇంత సమాచార వ్యవస్థ లేదు కదా.... అన్నిటికీ కార్డుముక్క రాయాల్సిందే!) పక్కింట్లో పిండివంటలు చెయ్యడం ఆలస్యం.. మన ఇంట్లోకి ఒక పిండివంటల ప్లేట్ ఖచ్చితంగా వచ్చేసేది. వాళ్ళింట్లో చేసారని మళ్ళీ మనింట్లో కూడా ఏదో ఒకటి చెయ్యమని అమ్మని మనం సతాయించడం కూడా జరిగేది - అప్పుడు మన ఇంట్లోనించీ పిండివంటల ప్లేట్ వాళ్ళింట్లోకి వెళ్ళేది. ఇక పండగలప్పుడు ఈ పిండివంటల ఎక్స్చేంజీ బలే తమాషా గా ఉండేది. ఇక శుభకార్యాలు జరిగితే చుట్టాలకన్నా మన ఇరుగు పొరుగు వారిదే హడావుడి ఎక్కువగా ఉండేది. అయితే పాపం సహాయం కూడా చాలా చేసేవారండోయ్ ! ఇప్పుడంటే పుట్టిన రోజు "కేక్" కొయ్యకపోతే అదేదో అపరాధం జరిగినట్లు బాధ పడిపోతున్నారు పిల్లలు. కానీ మా చిన్నపుడు పుట్టినరోజు అంటే చుట్టుపక్కల వాళ్ళకి చాక్లెట్ ఇవ్వడమే. ఆ ఒక్కరోజు ఎన్ని ఇళ్ళు తిరిగినా అమ్మా వాళ్ళు తిట్టేవాళ్ళు కాదు. ఇక ఏదైనా సందర్బానికి పేరంటానికి పిలవాలంటే చుట్టుపక్కల ఉన్న ముత్తైదువలందరినీ లెక్క వేసుకునేవాళ్ళం. వరలక్ష్మీ వ్రతానికీ, బొమ్మల కొలువు పెట్టినపుడూ మా వీధిలో వారందరినీ తప్పక పేరంటానికి పిలిచేవాళ్ళం. ఇక ఏదైనా పర్వదినాన పూజలు చేసుకుంటే కూడా తప్పక ఇరుగు - పొరుగు వారిని పిలిచేవాళ్ళం. కష్టకాలంలో సహాయం చేసే ఇరుగు - పొరుగు దొరకడం కూడా చాలా అదృష్టం. మా నాన్నగారికి వంట్లో బాలేనప్పుడు మా పక్క ఇంట్లో ఫోన్ సౌకర్యం ఉండేది. పాపం ఆసుపత్రి నుంచీ ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా విసుక్కోకుండా మాకు చెప్పేవారు. అసలు వారి సహాయం ఈ రోజుకీ మేము మరచిపోలేము. మా నాన్న 3 నెలలు ఉస్మానియా ఆసుపత్రిలో ఉంటే రోజూ ఇంటినుంచీ మా తాతగారు భోజనం పట్టుకెళ్ళేవారు. మా అమ్మగారు ఏమైనా అవసరమైన వస్తువు తెమ్మని మా తాతగారికి చెప్పడానికి ఫోన్ చేసేవారు. మా పక్కింటి వాళ్ళు ఏ సమయంలోనైనా మమ్మల్ని ఫోన్ రాగానే పిలిచేవారు. మేము ఇల్లుమారిన తరువాత మాకు ఫోన్ సౌకర్యం వచ్చింది. మాకు ఫోన్ లేకపోవడం వల్ల కలిగిన ఇబ్బంది గుర్తు ఉంచుకొని, మా నాన్నగారు మా పక్కింట్లో వాళ్ళకి ఫొన్ వస్తే అస్సలు విసుక్కొకుండా చెప్పమనే వారు. ఈ మాత్రం సహాయం మనం చేస్తే చాలు మనకి సాధ్యం కాని పెద్ద సహాయాలు ఎలాగూ చెయ్యలేం కదా అని చెప్పేవారు.

Friday, 14 November 2008

ఇదీ వరస

ఇదీ వరస ! తాడేపల్లిగారి టపా లెంపలేసుకుందాం - కొంప దిద్దుకుందాం కి వ్యాఖ్య వ్రాయబోతే అది ఒక పెద్ద టపా అయ్యింది.

నిజం ఎప్పుడూ నిష్టూరం గానే ఉంటుంది కానీ నిజాన్ని మనం ఒప్పుకోక తప్పదు. పెళ్ళి ఆలస్యం అయితే మానవ సంబంధాలు దెబ్బతినడం సరే... పెళ్ళి అయ్యేదెప్పుడు, పిల్లలు పుట్టేదెప్పుడు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేదెప్పుడు....? ఈ కాలం ఆడపిల్లలకి చాలా మందికి ఈ విషయం అర్ధం కావడం లేదు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినరు. సరే, పోనీ మరి చదువుకున్నారు కదా వారి జీవితాన్ని సరిగ్గా నిర్దేశించుకోగలుగుతున్నారా అంటే అదీ తక్కువే. వారికి ఉన్న స్వేచ్ఛని సరిగ్గా ఉపయోగించుకోలేక పోతున్నారు. నాకు ఫలానా డిగ్రీ ఉన్న వరుడినే తీసుకురమ్మని తల్లి తండ్రుల్ని అడగడం తప్పు కాకపోవచ్చు. కానీ కొన్ని పోకడలే చాలా విచిత్రం గా ఉంటున్నాయి. ఇంటరు / డిగ్రీ తప్పిన అమ్మాయిలు కూడా కనీసం పోస్ట్ గ్రాడుయేట్ కావాలని చెప్తూన్న సందర్భాలు చాలా ఉన్నాయి. తనకంటూ ఇష్టాలు ఉండడం మంచిదే కానీ ...అంత చదువుకున్న వాడు తనకు తగ్గ పిల్లని చేసుకోవాలని అనుకోవడం సహజమే అని ఈ కాలం అమ్మాయిలు అలోచించడం లేదు.

తన చుట్టూ జరిగే పరిణామాలు చూసి, తన స్నేహితురాళ్ళకి గొప్ప సంబంధాలు రావడం చూసి, చాలామంది అనవసరంగా పోలికలు పెట్టుకుని తనకీ అలా జరగాలని కోరుకోవడం నేను ఈ మధ్యనే కాస్త ఎక్కువగా చూస్తున్నాను. ప్రతీ తల్లిదండ్రులకీ తమ కూతురికి మంచి సంబంధాన్ని తెచ్చి పెళ్ళి చేయాలనే కోరిక ఉంటుందనీ, వాళ్ళ ఆర్ధిక పరిమితులకి లోబడి వాళ్ళు తమ ప్రయత్నాలు చేస్తున్నారనీ తెలీని అమాయకులు కాదు ఈ తరం అమ్మాయిలు. ఆడపిల్లలమై పుట్టినంత మాత్రాన మేమే ఎందుకు సర్దుకుపోవాలీ అంటూ వితండ వాదానికి దిగుతున్నారు. ఈ విషయంలో చదువుకోని లేక సంపాదనా పరురాలు కాని అమ్మాయిలు కూడా ఏమీ మినహాయింపు కాదు.

ఈ బ్లాగు చదివే వారిలో అమ్మాయిలు చాలామందే ఉంటారు. వారందరికీ అపార్ధం చేసుకోవద్దని మనవి. ఈ తరం లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా చదువూ, సంపాదనా పెరిగే కొద్దీ పెళ్ళి జరగడం కష్టం గా ఉంది. పాత పద్ధతుల్లో అయిన వారి సంబంధాలు కుదిరినన్నాళ్ళూ ఈ బాధలు తక్కువే అని చెప్పవచ్చు. మరీ జన్యు పరమైన సమస్యలు వస్తున్నాయనుకుంటే, పూర్తి దగ్గర సంబంధాలు చేసుకోకున్నా, కనీసం వేలు విడిచిన మేన మామల్నో, బావల్నో పెళ్ళి చేసుకోడానికి కూడా చాలా మంది సుముఖత వ్యక్తం చెయ్యడం లేదు. చుట్టాల్లో చేసుకోం అని చెప్పడం ఈ కాలంలో అబ్బాయిలకీ, అమ్మాయిలకీ ఇద్దరికీ సర్వ సాధారణమై పోయింది.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే తల్లిదండ్రులు ఆడ పిల్లల పెళ్ళిళ్ళు చేయ్యాలంటే మునుపు మంచి సంబంధం కుదిరితే చాలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి నచ్చిన సంబంధం పిల్లకి కూడా నచ్చేలా చూడు దేవుడా ! అనుకుంటున్నారు. ఒక పెళ్ళి సంబంధం ఇంటి దాకా పెళ్ళి చూపుల వరకూ రావడానికి ముందు ఎంత ఆందోళన పడతారో, ఆ సంబంధం గురించి తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారో అమ్మాయిలకి అనవసరం. అబ్బాయికి బట్టతల ఉన్నదనో, అబ్బాయి మరీ లావుగా ఉన్నాడనో, అబ్బాయి పొడుగు తక్కువనో (పూర్తిగా 5 అడుగులు ఎత్తు లేని అమ్మాయికి కూడా 6 అడుగులకి దగ్గరగా ఉండే పెళ్ళికొడుకే కావాలి !) కాబోయే అత్త మామలు చదువుకోని వారనో లేక పల్లెటూరి వాళ్ళనో, అబ్బాయి మరీ నల్లగా ఉన్నాడనో, అబ్బాయి ఉద్యోగం లేక అతను పని చేసే కంపెనీ మంచిది కాదనో, అబ్బాయికి బాధ్యతలు (ఇంటికి పెద్ద కొడుకు కావడమో, ఒకే కొడుకై ఎక్కువమంది అక్క చెల్లెళ్ళు ఉండడమో) ఎక్కువనో వంకలు పెట్టి పెళ్ళి దాకా వచ్చిన సంబంధాలని కూడా చిన్న చిన్న కారణాలతో చెడగొట్టుకుంటున్నారు. మళ్ళీ ఆ తల్లిదండ్రులకు త్రిప్పట, అలసట ! అక్కడక్కడా అరుదుగా చాలా ఎక్కువ కోరికలు పెట్టుకోకుండా, మితంగా కేవలం కావలసిన విషయాలు ... అంటే అబ్బాయి చదువు / ఉద్యోగం, అబ్బాయి గుణగణాలూ మాత్రమే చూసుకుని జీవిత సత్యాలకి దగ్గరగా అలోచించే అమ్మాయిలు కనిపిస్తారు. వారిలో చాలా మందికి చాలా మంచి సంబంధాలు కుదరడం నేను ఎరుగుదును. వయసు ఎక్కువయ్యేకొద్దీ పిల్ల పెళ్ళి కాలేదని తల్లిదండ్రులు బాధ పడడం తెలిసినా కూడా కొందరు అమ్మాయిలు వాళ్ళ మితి మీఱిన కోరికలతో ఏళ్ళపాటు సాగదీసి, ముఖ్యమైన జీవిత కాలాన్ని పోగొట్టుకొని, ఆఖరికి ముందు వచ్చిన సంబంధాలకంటే హీనమైన సంబంధాలు వచ్చినా ఇంక గత్యంతరం లేక ఒప్పుకుంటున్నారు ! ఈ సర్దుకోవడం ఏదో ముందే చేసి ఉంటే ఆన్ని ఎక్కువ రోజులైనా చక్కగా వైవాహిక జీవితాన్ని అనుభవించి ఉండేవారు కాదా ? అందుకే పెద్దలు ఏ వయసుకి ఆ ముచ్చట అన్నారు !!

అన్నీ అమ్మాయిల గురించే చెప్పి ఊరుకుంటే, ఈ కాలపు అబ్బాయిలంతా పాపం బాధ పడిపోతారు కదా.... ఇక వారి ప్రతాపాన్ని కూడా చెప్పవద్దూ ? కాస్త మంచి చదువూ, ఉద్యోగం ఉంటే చాలు...ఇక కోరికల చిట్టా పుట్టుకొస్తుంది. అమ్మాయి ఇలా ఉండాలి, అలా ఉండాలి..... అని ఊహల్లో బతుకుతూ ఉంటారు. ముందు "అందమైన" అమ్మాయి కావాలి (తాను పగలు చూస్తే రాత్రి కలలో కి వచ్చేంత భయంకరంగా ఉన్నా పరవాలేదు. ఆ అమ్మాయి ఎన్ని మంచి లక్షణాలున్నదైనా అందంగా ఉండకపోతే అస్సలు ఒప్పుకోరు). అందంగా ఉండడమే కాదు. అమ్మాయి ఉద్యోగం చెయ్యకపోయినా బాగా చదువుకొని ఉండాలి (అవసరమైనపుడు, తాను చెప్పినపుడు ఉద్యొగం చెయ్యడానికి అన్నమాట!) ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లైతే, ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేసే విధంగా ఉండాలి. ఆమె చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా తన మాటే వినాలి ....కట్నం విషయం లో వాళ్ళ అమ్మా నాన్నా చెప్పిన రేటుకు దగ్గరగా ఇచ్చే ఆర్ధిక స్తోమత ఉండాలి. తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి ...ఇంకా ఇలాటివి చాలా ఉన్నాయి. తనకి తగ్గట్టు మామూలుగా ఉన్న, తమకు తగ్గ సంబంధం దొరికితే చాలు... అమ్మాయి మన కుటుంబంలో కలిసిపోయేలా ఉండి, అర్ధం చేసుకునే అమ్మాయిలు చాలు అనుకునే అబ్బాయిలు కూడా ఉండకపోలేదు... కానీ సర్దుకుపోవడం శాతం అబ్బాయిల విషయంలో తక్కువే !! సర్డుకుపోమ్మని తమ అమ్మాయిలకి చెప్పినట్లుగా అబ్బాయిలకి హితబోధ చేసే తల్లిదండ్రులూ చాలా తక్కువగానే కనిపిస్తారు.

ఏది ఏమైనా ఈ కాలపు పిల్లల్ని పెంచడం ఒక ఎత్తూ, వాళ్ళ పెళ్ళి చేయడం మరో ఎత్తూ అయిపోయింది... అందుకే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు తమకి తాముగా ఎవరినైనా ఎన్నుకున్నారని తెలిసినపుడు అది కులాంతరమైనా, మతాంతరమైనా - వారితో పెళ్ళి చేయ్యడానికి సంసిధ్ధత వ్యక్తం చేస్తున్నారనిపిస్తుంది...!! అవును మరి..... ఎంతైనా కన్నవారు కదా - పిల్లల సంతోషం కంటే వారికి కావలసిందేముంటుంది ?

Thursday, 13 November 2008

నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర.

పోయిన సోమవారం రోజు మహా లింగాభిషేకం చేసే అదృష్టం మాకు కలిగింది. అభిషేకం చేస్తూండగా తీసిన ఫోటో అభిషేకానంతరం అలంకారం పూర్తి అయ్యాక - ఆ మహాదేవుని దర్శనం :

Friday, 7 November 2008

మట్టి వాసన - 2

(నిన్నటి భాగం తరువాయి ) మన భూమి మళ్ళీ జలాలతో రీ-చార్జ్ అవడానికి నా ప్రతిపాదనలు ఇవీ: 1. మన అపార్టుమెంటు కాంపౌండులో ఒక ఇంకుడుగుంతని తప్పనిసరిగా ఏర్పాటు చేసుకొని, ఆఖరి మేడ పైన పడే వాననీళ్ళు డ్రైనేజీలో కలపకుండా, ఇంకుడుగుంతలోకి చేరేటట్లుగా ఏర్పాటు చేసుకోవడం.
2. అపార్టుమెంటు లేదా ఇంటి చుట్టూతా ఎంతో కొంత స్థలం వదిలి ఉంటాము కదా, అక్కడ కొన్ని మొక్కలు భూమిలో నాటడం. కుండీల్లో మొక్కలు నాటితే, మన చుట్టూ పచ్చదనం ఉంటుంది కానీ భూమిలోకి నీళ్ళు వెళ్ళవు కదా
3. మీకు స్థలం తక్కువగా ఉండి , మీరు పెద్దగా అయ్యే మొక్కలు నాటాలనుకుంటే, కొమ్మలు ఎక్కువగా పెరగని "అశోక" వృక్షాలు నాటడం మంచిది. మీ అపార్టుమెంటు / ఇల్లు ప్రహరీ బయట, ఫుట్ పాత్ స్థలం లో కూడా, చెట్లని భూమిలోకి నాటవచ్చు. బయట మనకి నీడ, గాలీ ఇచ్చే కానుగ, వేప లాటి చెట్లు వేసుకోవడం మేలు.
4. పాత ఇంటిలో మార్పులు చేసుకునేటప్పుడు కానీ, కొత్తగా ఇల్లు కడుతున్నప్పుడు కానీ, ఇంకుడుగుంతలోకి వర్షపు నీటితోపాటుగా, మన వంట ఇంట్లో సింక్, వాష్ ఏరియా నుంచీ డ్రైనేజీ లోకి కలిసే నీటిని కూడా (మీకు పరవాలేదు అనుకుంటే, మనం బాత్ రూం లో కేవలం స్నానపు నీటిని కూడా) వెళ్ళే ఏర్పాటు చేసుకుంటే, మంచిది. మరీ అవన్నీ ఇంకుడు గుంత లోకి ఎందుకు అనుకుంటే, చెట్ల పాదుల్లోకైనా మనం వృధా చేసే నీరు వదలవచ్చు. కానీ నా మటుకు నాకు చెట్లకి మామూలు నీళ్ళు పెట్టడమే మంచిది. లేకపోతే, చెట్ల పాదుల్లో ఉండే నిలవ నీటి వల్ల దోమల వంటివి పెరిగే అవకాశం ఉంది. ఇంకుడు గుంతల పైన ఏదో ఒక మూత ఏర్పాటు చేస్తాము కనుక ఆ ఇబ్బంది తలెత్తదు.
5. మీ వీధిలో కాస్త డౌన్ గా ఉండి,వర్షం వచ్చినప్పుడల్ల, నీరు నిలిచే చోట ఒక ఇంకుడు గుంత తవ్విస్తే, ఆ నీరు కూడా భూమిలోకి ఇంకి, వర్షపు నీరు వృధా కాకుండా ఉంటుంది.
6. మీ ఇంటిలో బావి తవ్వించి ఉంటే, అది ఎండిపోయిందని కొత్తగా బోరుబావి తవ్వించుకునే ముందు, పాత బావిని పూర్తిగా పూడ్చకుండా, దాన్ని ఇంకుడుగుంతగా మార్చేయ్యండి. కొత్తబావిని ఎండిపోకుండా పాత బావి అలా కాపాడుతుంది.
పైన చెప్పినవన్నీ పెద్దగా మనం ఖర్చు పెట్టకుండా చెయ్యగలం. బతకడానికి లీటర్లకి లీటర్లు నీళ్ళు కొనేబదులు, ఇలా ఆ డబ్బుని వినియోగిస్తే, ఈ ఖర్చు మనకే కాక మన పర్యావరణానికి కూడా మంచిది. ఏమంటారు? నాకు తెలిసినవి నేను చెప్పాను. మన బ్లాగర్లలో చాలా మందికి చాలా విషయాలు తెలుసు. మన భూగర్భ జలాల పెంపుదలకై ఇంకేమి చెయ్యవచ్చో చెబితే, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.