Friday 21 November 2008

ఇరుగు - పొరుగు -1

మన చిన్నప్పటి విషయాల్ని గుర్తు చేసుకుంటే, ఆ మధుర స్మృతుల్లో గుర్తు వచ్చేది మన కుటుంబమూ, మన ఇల్లూ, మన స్నేహితులూ... మన ఇంటిని తలచుకున్నపుడో లేక మన స్నేహితుల్ని తలచుకున్నపుడో తప్పనిసరిగా గుర్తుకు వచ్చేది మన ఇంటి చుట్టుపక్కన ఉండేవాళ్ళే..! మన చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ చాలా ఎక్కువ శాతం మన పక్కింటి పిల్లలతోనో, ఎదురింటి వారితోనో అయి ఉండేది. ఇరుగూ పొరుగున ఉండే వారితో మన అనుబంధం కాస్త ఎక్కువగానే ఉండేది మరి. "ఆంటీ" / "అంకుల్" సంస్కృతి ఇంకా అంత పెరగని రొజుల్లో పక్కింటి పిన్నిగారో... ఎదురింటి బామ్మగారో, వెనకింటి బాబాయిగారో....ఎవరో ఒకరు మనకి రోజూ తారసపడుతూనే ఉండేవారు. ప్రతి చిన్న విషయానికీ ఇరుగు పొరుగు వారి సహాయం తీసుకోవడం ఆ రోజుల్లో పరిపాటి. కొత్తగా పెళ్ళయి కాపురం పెట్టిన అమ్మాయిలకి ఏ విషయమైనా తెలీకుంటే, పక్కింటి బామ్మగార్లు, పిన్నిగార్లే శరణ్యం ! (ఆ రోజుల్లో ఇంత సమాచార వ్యవస్థ లేదు కదా.... అన్నిటికీ కార్డుముక్క రాయాల్సిందే!) పక్కింట్లో పిండివంటలు చెయ్యడం ఆలస్యం.. మన ఇంట్లోకి ఒక పిండివంటల ప్లేట్ ఖచ్చితంగా వచ్చేసేది. వాళ్ళింట్లో చేసారని మళ్ళీ మనింట్లో కూడా ఏదో ఒకటి చెయ్యమని అమ్మని మనం సతాయించడం కూడా జరిగేది - అప్పుడు మన ఇంట్లోనించీ పిండివంటల ప్లేట్ వాళ్ళింట్లోకి వెళ్ళేది. ఇక పండగలప్పుడు ఈ పిండివంటల ఎక్స్చేంజీ బలే తమాషా గా ఉండేది. ఇక శుభకార్యాలు జరిగితే చుట్టాలకన్నా మన ఇరుగు పొరుగు వారిదే హడావుడి ఎక్కువగా ఉండేది. అయితే పాపం సహాయం కూడా చాలా చేసేవారండోయ్ ! ఇప్పుడంటే పుట్టిన రోజు "కేక్" కొయ్యకపోతే అదేదో అపరాధం జరిగినట్లు బాధ పడిపోతున్నారు పిల్లలు. కానీ మా చిన్నపుడు పుట్టినరోజు అంటే చుట్టుపక్కల వాళ్ళకి చాక్లెట్ ఇవ్వడమే. ఆ ఒక్కరోజు ఎన్ని ఇళ్ళు తిరిగినా అమ్మా వాళ్ళు తిట్టేవాళ్ళు కాదు. ఇక ఏదైనా సందర్బానికి పేరంటానికి పిలవాలంటే చుట్టుపక్కల ఉన్న ముత్తైదువలందరినీ లెక్క వేసుకునేవాళ్ళం. వరలక్ష్మీ వ్రతానికీ, బొమ్మల కొలువు పెట్టినపుడూ మా వీధిలో వారందరినీ తప్పక పేరంటానికి పిలిచేవాళ్ళం. ఇక ఏదైనా పర్వదినాన పూజలు చేసుకుంటే కూడా తప్పక ఇరుగు - పొరుగు వారిని పిలిచేవాళ్ళం. కష్టకాలంలో సహాయం చేసే ఇరుగు - పొరుగు దొరకడం కూడా చాలా అదృష్టం. మా నాన్నగారికి వంట్లో బాలేనప్పుడు మా పక్క ఇంట్లో ఫోన్ సౌకర్యం ఉండేది. పాపం ఆసుపత్రి నుంచీ ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా విసుక్కోకుండా మాకు చెప్పేవారు. అసలు వారి సహాయం ఈ రోజుకీ మేము మరచిపోలేము. మా నాన్న 3 నెలలు ఉస్మానియా ఆసుపత్రిలో ఉంటే రోజూ ఇంటినుంచీ మా తాతగారు భోజనం పట్టుకెళ్ళేవారు. మా అమ్మగారు ఏమైనా అవసరమైన వస్తువు తెమ్మని మా తాతగారికి చెప్పడానికి ఫోన్ చేసేవారు. మా పక్కింటి వాళ్ళు ఏ సమయంలోనైనా మమ్మల్ని ఫోన్ రాగానే పిలిచేవారు. మేము ఇల్లుమారిన తరువాత మాకు ఫోన్ సౌకర్యం వచ్చింది. మాకు ఫోన్ లేకపోవడం వల్ల కలిగిన ఇబ్బంది గుర్తు ఉంచుకొని, మా నాన్నగారు మా పక్కింట్లో వాళ్ళకి ఫొన్ వస్తే అస్సలు విసుక్కొకుండా చెప్పమనే వారు. ఈ మాత్రం సహాయం మనం చేస్తే చాలు మనకి సాధ్యం కాని పెద్ద సహాయాలు ఎలాగూ చెయ్యలేం కదా అని చెప్పేవారు.

No comments: