Monday 6 August 2012

పుత్ర శోకం

చాలా రోజుల తరువాత బ్లాగు రాస్తున్నాను - భారమైన హృదయంతో!

పోయిన గురువారం నాడు మా పెద్ద బావగారి అబ్బాయి హార్ట్ అటాక్ తో చనిపోయాడు. చిన్నవయసులో అలా జరగడం నేను ఇప్పటివరకు వినలేదు. ఏదో చదువుకుని, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. 29 సంవత్సరాలు. పెళ్ళి చేయాలని సంబంధాలు కూడా వెతుకుతున్నారు, అంతలో ఇలా.....! ఆ ఇంటిలో వారి బాధ చూడలేక పోతున్నాము. అస్సలు ఆ తల్లిదండ్రులు కోలుకునేది ఎప్పుడు అని బాధగా ఉంది. మా పెళ్ళి అయినప్పటి నుంచీ మాతో చాలా బాగా కలివిడి గా ఉండేవాడు. మాకే ఇలా బాధగా ఉంటే - ఇక వారి బాధ ఏమి చెప్పాలి?

పెద్దవయసు వచ్చి, అనేక రోగాలతో బాధలు పడుతున్నవారందరికీ ఆయుష్షు ఇచ్చిన ఆ భగవంతుడు ఆ అబ్బాయికి ఇలాటి చావు ఎందుకు ఇచ్చాడో అని బాధ కలుగుతోంది. ఇంకో విషయం ఏమిటంటే - మా బావగారికి ముగ్గురు పిల్లలు. మొదట ఒక అమ్మాయి, తరువాత ఇద్దరు అబ్బాయిలు. 10 - 12 ఏళ్ళ వయసులో ఆ అమ్మాయి చనిపోయింది, ఇప్పుడేమో మరొక కొడుకు, ఇలా పుట్టిన పిల్లల్లో ఇద్దరు పోతే, ఎంత కష్టం? భగవంతుడు ఒకే ఒక మేలు చేసాడు, ఆ అబ్బాయి కి పెళ్ళి కాకుండానే తీసుకెళ్ళిపోయాడు. లేకపోతే ఒక ఆడపిల్ల జీవితం కూడా ఈ కుటుంబం తో పాటుగా నాశనం అయ్యేది, వీళ్ళు కూడా ఆ అమ్మాయి మొహం చూస్తూ ఇంకా బాధకు గురి అయ్యే వారు.


ఈ నాలుగు రోజులుగా నేను ఒకటే ప్రార్ధిస్తున్నా, ఆ దేవుడిని.... "ఇలాటి బాధ ఎవ్వరికీ రాకూడదు, కళ్ళముందే బిడ్డలు రాలిపోయి, మనకు వాళ్ళు చేయాల్సిన కర్మ కాండలన్నీ మనం వారికి చేసే దౌర్భాగ్యం ఎవ్వరికీ వద్దు." నా బ్లాగు ద్వారా, అందరినీ అలా ప్రార్ధించమని మరీ మరీ అర్ధిస్తున్నాను. ఎన్ని బాధలైనా పడవచ్చుగానీ, గర్భశోకం ఏ తల్లికీ వద్దు భగవంతుడా!!

5 comments:

మాలా కుమార్ said...

అయ్యో పాపం .
మీరు చెప్పింది నిజమేనండి . అలాంటి కష్టం ఎవరికీ రాకూడదు .
వారి కి నా సానుభూతి .

Sravya V said...

అయ్యో !

భాస్కర్ కె said...

ఆ తల్లిదండ్రులకు ప్రగాడ సానుభూతి, వారు బాధనంచి త్వరలో కోలుకోవాలని ఆశిస్తూ..

durgeswara said...

chaalaa baadhaakaraM

విరజాజి said...

మాలా కుమార్ గారూ, శ్రావ్య గారూ, ద ట్రీ గారూ, దుర్గేశ్వర గారూ - స్పందించినందుకు, మీ సానుభూతి కి నా ధన్యవాదాలండీ! మేమే ఇంకా కోలుకోలేక పోతున్నాము.... ఆ తల్లిదండ్రులకు భగవంతుడే శక్తిని ఇవ్వాలి.