Tuesday 3 August 2010

వేదన

బాధ, కోపం, ఉక్రోషం - ఏదీ చెయ్యలేని నిస్సహాయత! ఇలా ప్రతీదీ మనకి ప్రతికూలంగా ఉన్నప్పుడు జీవితం మీద విరక్తి పుడుతుంది. అలాటి సమయంలోనే అది డిప్రెషన్ కి దారి తీస్తుందనిపిస్తోంది. ఆ పరిస్తితి అనుభవిస్తేనే గానీ తెలియదు. ఆ బాధని వేరే ఎవ్వరికీ చెప్పుకోలేము కూడా!!

తెలీని బాధ నిరంతరం మెలిపెడుతూ ఉంటుంది.... తనివి తీరా ఏడవాలనిపిస్తుంది.... ఒక్కోసారి అస్సలు బ్రతకడం దేనికీ ...? చచ్చిపోదాంలే అనిపిస్తుంది... చచ్చి ఏమి సాధిస్తావూ అంటే... బ్రతికి ఇప్పుడు సాధిస్తున్నదేమైనా ఉన్నది కనుకనా అనిపిస్తుంది... బాధ ఎక్కువైన ప్రతీసారీ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ - ఆశ కల్పించుకుంటూ బ్రతుకుతున్నా, అన్ని సార్లూ మన మనసు మన స్వాధీనంలో ఉండదు కదా... అప్పుడప్పుడూ కొన్ని భావోద్వేగాలు అన్నిటినీ మించి మనసుని వేదనకి గురి చేస్తాయి .

మనసు బాధని అక్షర రూపంలో పెడితే - కాస్తైనా బరువు తీరుతుందని చిన్ని ప్రయత్నం చేస్తున్నా!! నాకై నాకు ఉన్న ప్రత్యేక నేస్తం నా బ్లాగే కదా అనిపిస్తుంది. మనలోకి మనం తొంగి చూసుకోవడం మనం అందరం ఎపుడో ఒక అపుడు చేసే పనే అని నా నమ్మకం .

బాధ బరువుని ఎడద మోయలేనపుడు -

వేదనా తాపాన్ని హృదయం భరించలేనపుడు -

ఆవేదనా భారాన్ని మనసు తట్టుకోలేనపుడు -

నేనొంటరినై చీకటి కుటిలో మగ్గి మగ్గి,

నిరంతరంగా కన్నీటి స్రవంతిలో కుంగి కుంగి,

చల్లటి పలకరింపే లేని వేసవిలో వేగి వేగి,

నిబిడ నిర్లిప్త నిరాశా నిస్పృహ నలిపివేస్తుంటే -

కలనైన కనుగొనని కలత కలచివేస్తుంటే -

అంతులేని గాఢ శూన్యం ఆవరిస్తుంటే -

వెళ్ళదీయలేని కాలం విసిగిస్తుంది.

చెప్పలేని మౌనం హింసిస్తుంది.

ఇంకెందుకీ బ్రతుకు అనిపిస్తుంది.

4 comments:

Sravya V said...
This comment has been removed by a blog administrator.
విరజాజి said...

పర్వాలేదు శ్రావ్యా, మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు. ఒక్కో సారి వివరంగా అన్నీ అందరికీ చెప్పలేము. దానిపైన కూడా టపా రాయాలని ఉంది. మొన్న ఈ టపా రాసాక కాస్త మనసు బరువు తీరినట్లు అనిపించింది. ఈ భవసాగరంలో కొట్టుకుపోతున్నపుడు, ఏమిటో, ఒక్కోసారి అలా దిగాలు పడిపోతూ ఉంటాను. మీతో తప్పక నా భావాలు పంచుకుంటాను. కామెంటు పొరపాటున మీ మెయిలు ఐ.డీ రాసుకోకుండా తీసేసాను. వీలుంటే ఒకసారి మళ్ళీ మీ మెయిలు ఐ.డీ రాయండి. తప్పక మీకు ఉత్తరం రాస్తాను.

ప్రేమతో...మీ said...

kastaalaki kaaranam evaru? manam kaadaa??? manchi jarginappudu, santosham lo teli povadam..kaasta kastam vaste krungi povadam... bad..dhee kotti nilabadali..kastala nunchi lessons nerchu kovali...stithapragnatha undaali...

విరజాజి said...

ప్రేమతో .. మీ __ గారూ....

బాధ భరించలేనిదైనపుడు స్థిత ప్రఙ్ఞత గురించి గుర్తు రాదు. కొండనైనా ఢీ కొట్టే ఆత్మవిశ్వాసం ఉందని చెప్పుకున్న వారు సైతం ఒక్కో సమయంలో డీలా పడుతూ ఉంటారు. కానీ ఢీ కొట్టీ, కొట్టీ అలసిపోతే నిర్వేదం తప్పక ఆవరిస్తుంది. నేనూ అదే రాసాను. రాసాను కనుకే మనసులో బాధ కాస్త తగ్గింది. పెద్దవాళ్ళు చెబుతారు కదా -- బాధ పంచుకుంటే తగ్గుతుంది. సంతోషం పంచుకుంటే ఎక్కువ అవుతుందని!! అదే నేనూ చేసాను మరి !!