Tuesday 2 September 2008

వినాయక చవితి సంబరాలు

మా చిన్నపుడు వినాయకచవితి, దీపావళి, దసరా బాగా సరదాగా జరుపుకునే వాళ్ళం. పూజా సామగ్రి సర్దడం, బాగా పూజ చేసుకోవడం, అందులో వినాయక చవితికి మా తమ్ముళ్ళకి మా తాతయ్య చక్కగా పంచెలు కట్టేవాళ్ళు. నేను కూడా ఎంచక్కా (నాకెపుడూ ఇష్టమైన) పావడా, జాకెట్ వేసుకొని పూజకి సిద్ధం అయిపోయేవాళ్ళం. పూజ అయ్యాక మా నాన్న అన్ని పాటలనీ ఒకే ట్యూన్ లో పాడి, మమ్మల్ని భజన కారక్రమానికి బలి చేసిన తరువాత, పోటీలు పడి గుంజీళ్ళు తీసేవాళ్ళం. విస్తరాకుల్లో భోంచేసి, కాసేపు అయ్యిందో లేదో, సాయంత్రం అయిపోయేది. మళ్ళీ మంచి బట్టలు వేసుకొని మా స్నేహితుల ఇండ్లకి వెళ్లి వాళ్ల వినాయకుడిని చూసి, అలా కనీసం తొమ్మిది వినాయకుళ్ళని చూసి (అలా కనీసం తొమ్మిది విగ్రహాలైన చూడకుంటే, వచ్చే జన్మ లో గాడిద గా పుడతామని భయం) , చంద్రుడిని చూడకుండా (అంటే, మరీ చీకటి పడకుండా) ఇంటికి చేరుకునే వాళ్ళం. (చెప్పకూదదనుకున్నాను గానీ, ఆ రోజు సినిమా వచ్చే రోజైతే, దూరదర్శన్ వాడు "వినాయక విజయం" అనే సినిమా తపాకుండా వేసేవాడు. మేము కూడా ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షం అన్నట్లు గా ఆ సినిమా ని శ్రద్ధగా చూసేవాళ్ళం.) అస్సలు ఇప్పటి పిల్లలు మాలాగా పండగని ఎంజాయ్ చెయ్యటం లేదనిపిస్తోంది. రేపు వినాయకచవితి అనగానే ఈ రోజు పిల్లలమంతా చేసేపని పత్రి సేకరించడం. పూలను కోసుకు రావడం. ఊరంతా వినాయకుడి విగ్రహాలతోనూ, పందిళ్ళ తోనూ, సందడిగా ఉంటే, మేము మాత్రం పత్రి కోసం మా ఏరియా అంతా గాలించి సాధ్యమైనన్ని రకాల ఆకులని తెచ్చేవాళ్ళం. మొత్తం తెచ్చిన ఆకులని మా ఇంటి పక్క పిల్లలు, మేము కలిసి పంచుకునే వాళ్ళం. మా ఇంటిలోనే చాల చెట్లు ఉండడం వల్ల చాలా వరకు నయం... కానీ ఆ ఆకుల కోసం తిరగటం ఒక పెద్ద సరదా. ఒక సారి, మా ఇంటికి కొద్ది దూరం లో ఒక పెద్ద బంగాళా ఉండేది. ఆ బంగాళా ఆవరణ లో చాలా చెట్లు ఉండేవి. అక్కడి వాచ్ మాన్ కి మస్కా కొట్టి, తాతా తాతా అని బతిమిలాడి, మొత్తానికి లోపల దూరాం. అయితే అక్కడ ఉన్నచెట్లన్నీ చాలా పెద్ద చెట్లు. కొన్ని పూలు, పత్రి కోసుకున్నాం.. అన్ని కోసుకున్న, మా తమ్ముడి చూపు మాత్రం ఒక సంపంగి చెట్టు మీద ఉంది. గుత్తులు గుత్తులు గా సంపంగి పూలు... మా వాడు మొత్తానికి సాహసించి కర్ర తో ఒక కొమ్మని అందుకొని నాలుగు పూలు కోసాడో, లేదో, వాడి పక్కనే ఒక పాము వేలాడింది.... !! అంతే..... పూలూ లేవు గీలూ లేవు... ఆ కర్ర అక్కడ పడేసి, అందరం పరుగో, పరుగు. వాచ్ మాన్ పిలుస్తున్నా వినిపించుకోకుండా దౌడు తీసాం... ఇంటికి రాగానే మా అమ్మకి చెప్పాలా వద్దా అని పెద్ద డిస్కషన్.... మొత్తానికి చెప్పాం .... అమ్మ ముందు ఖంగారు పడినా ... తరువాత చెప్పింది.... సంపంగి చెట్టు పైన పసిరిక పాములు ఉంటాయని...!! పసిరిక పాములు నాగు పాముల్లాగా విషం ఉండే పాములు కావని....!! అయినా కానీ, ఆ బంగాళా చూసినప్పుడల్లా చాలా రోజులు పాము గుర్తుకొచ్చి భయపడి చచ్చాం... మళ్ళీ వినాయక చవితి పూలకోసం ఆ ఇంటికి పోతే ఒట్టు.

No comments: