Monday, 7 December 2009

నిత్య వేదన

అస్థిత్వానికి అర్ధం వెతకాలని ప్రయత్నిస్తే,

నీకా అర్హత లేదంటూ ఒక హేళన ముల్లులా గుచ్చుతుంది.

వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తే,

నీవో వ్యక్తివా అంటూ ఒక ఎగతాళి బాణమై గాయపరుస్తుంది.

సాధించిన విజయాల గురించి చెప్పాలని ప్రయత్నిస్తే,

నీ మొహానికి అదొకటే తక్కువంటూ ఒక ఎద్దెవా గుండె చీలుస్తుంది.

సంసారంలో బాధ్యతలు పంచుకొమ్మని అభ్యర్ధిస్తే,

రచ్చ గెలుస్తూన్నా, ఇంట ఎన్నటికీ గెలవలేవని ఒక ఈసడింపు గుర్తుచేస్తుంది.

ఎవరిపైనా ఆధారపడక, ఆత్మ విశ్వాసం ప్రదర్శిస్తే,

ఎంతైనా ఆడదానివే కదా అంటూ ఒక అవమానం నిలువునా చంపేస్తుంది.

2 comments:

భావన said...

చాలా బాగుంది. అది ఒకప్పటి కాలం, ఇప్పుడు ఆడ మగా సమానం అని జనాలు యుద్ధానికి వస్తారేమో..:-)

కిన్నెరసాని కవితా ప్రసాద్ said...

గులాబీకి ఉన్నముళ్ళు ముట్టుకున్నవాళ్ళకు గుచ్చుకుంటే 'విరజాజి' కి ఉన్న ముళ్ళు విరజాజి ని గుచ్చుకున్నాయి... బాధ ఏదైనా కవిత బాగుంది... అది ఎందరినో ప్రతిబింబిస్తుంది...