సీ. అచ్చ తెనుగు వారు అచ్చెరువొందగ
సంస్కృత ప్రౌఢి తో చెలిమి జేసి,
పాఠకోత్తముల సుఖ భావనలలరింప
కావ్య కన్యక నలంకృతము జేసి,
కవి చంద్రులెల్లరు కలసి పొగడునట్లు
గాధల కందము గలుగ జేసి,
వేద పండితులకు వేద మర్మము జెప్ప
సూక్తుల సంధించె శరము జేసి
తే.గీ. ఆంధ్ర భాషకొక రూపు కల్గంగ జేసి,
భారతార్ధము మిగుల పెంపొంద జేసి,
నన్నయార్యుడు భారత కధ రచియించి
తెలుగు జనుల చరిత కృతార్ధంబొనర్చె
3 comments:
నమస్కారం,
చాలా బావుంది మీ తెలుగు పద్యం. మీరు అన్నట్టు గానే తెలుగు వారు తప్పకుండా అచ్చెరువొందుతారు. చాలా కాలం అయ్యింది చక్కటి కొత్త తెలుగు పద్యం విని. మీ ఈ ప్రయత్నానికి నా అభినందనలు. అలతి పదాలలో కూడా అందమయిన భావాలను పలికించగలరేమో ప్రయత్నించండి. ఇక మీదట ఇటువయిపు తరచూ వస్తూ వుంటాను. సాహితీ సుగంధాలను అందిస్తారని ఆశిస్తున్నాను.
నేను కూడా ఒక చిరు ప్రయత్నం మొదలు పెట్టాను. వీలయితే నా సనాతన భారతి బ్లాగ్ ని ఒకసారి చూసి మీ అభిప్రాయాలని, ఇంకా వీలయితే అమూల్యమయిన సలహాలను తెలియజేయండి.
మరో మంచి కవితకో పద్య్యానికో మరో అభినందన రూపం లో కలుస్తాను.
భవదీయుడు
సతీష్ యనమండ్ర
విరజాజి గారు,
మీ ప్రయత్నము బాగుంది. కాని పలు చోట్ల యతి విషయములోనూ, అక్కడక్కడ గణముల విషయములోనూ చందస్సు సరిపోవటము లేదు. ముఖ్యముగా మీరు యతి విషయములో హల్లు మైత్రిని పాటిస్తున్నారు కాని, అచ్చు మైత్రి పాటించటము లేదు. ఉదాహరణకు "సంస్కృత ప్రౌఢి తో చెలిమి జేసి" అనే పాదములో "సం" కు "చె" కు యతిని చెల్లించే ప్రయత్నము చేశారు. "సకారాని"కి "చకారాని"కి హల్లు మైత్రి చెల్లుతుంది. కాని "సం"లో ఉన్న "అం"కు "చె"లో ఉన్న "ఎ"కి అచ్చు మైత్రి లేదు. ఇదే కోవలో యతి చెల్లని పాదాలు.....
"కావ్య కన్యక నలంకృతము జేసి"
"సూక్తుల సంధించె శరము జేసి"
"భారతార్ధము మిగుల పెంపొంద జేసి"
గణములు సరిగాలేని పాదములు...
"పాఠకోత్తముల సుఖ భావనలలరింప"
"ఆంధ్ర భాషకొక రూపు కల్గంగ జేసి, "
"నన్నయార్యుడు భారత కధ రచియించి"
-సత్య
@ సతీష్ గారూ, ధన్యవాదాలండీ. మీ బ్లాగ్ తప్పక చదువుతాను.
@ సత్యనారాయణ గారూ, పన్నెండేళ్ళ క్రితం నేను చేసిన మొదటి ప్రయత్నం పై పద్యం. తప్పుల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. సరిదిద్దుకుంటాను.
Post a Comment