Monday, 6 October 2008

ప్రకృతి వెలిగించిన వెన్నెల.

మెత్తని గడ్డి తివాచీ విశ్రమించమని స్వాగతం చెబుతుండగా, వెంచేస్తున్న పడమటి సమీరాల తాకిడి కి తలలూపుతూ నృత్యం చేస్తున్నాయి మొక్కలు ! కొమ్మల వీవెనలు చెలరేగమంటూ పవనాలకి ఉత్సాహాన్నిస్తున్నాయి ! కదుల్తూన్న రెమ్మలు పూలను రాలుస్తూ పూజ చేస్తున్నాయి - ప్రకృతికి ! చిగురాకులను మెత్తటి దిండ్లుగా చేసుకొని, సౌఖ్యాన్ని అనుభవించమని లతలు చిరుగాలుల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇదంతా చూస్తూ భానుడు నవ్వుకుంటున్నాడు.. !! అంతలో ఓ అల్లరి మేఘం సూర్యుడ్ని కప్పేసింది - కొంటెగా ! గాలివాటుకు మబ్బు కరుగుతుందేమోనని వాన స్నానం చేయడానికి లతలూ, మొక్కలూ, చెట్లూ, చేమలూ, కొమ్మలూ, రెమ్మలూ ఆనందంతో కదలిపోతూ తలలు పైకి ఎత్తాయి ఆశగా ! ఆగండాగండి - అపుడేనా? అంటూ ఆకాశాన్ని తన నల్లని మొయిలు చెలులతో నింపిన ఆ మేఘం, ఒక్కటొక్కటిగా చినుకుల్ని చిలకరిస్తూ కరిగి, చిరుజల్లు గా మొదలై, ఎడతెరిపి లేని వర్షపు గీతమై కురిసింది. ఆ గీతానికి మైమరిచి, పుడమి పులకరించింది. ధూళినీ, మురికినీ తొలగించి, ప్రతి ఒక్క ఆకునూ కడుగుతూ, క్రిందకి జారి, చిన్ని కాలువలై, ఏటి నీటిలో కలిసి పారుతూ, గలగలమని పరుగులు పెడుతోంది మేఘపు నీరు. కరగిన మబ్బులు మిగిల్చిన తునకల్ని చీల్చుకుంటూ బయటకొచ్చిన సూర్యుడు, శుభ్రంగా మెరిసే అవనిని ఆశ్చర్యంగా అవలోకిస్తూ, ఆకాశం నుంచీ జారిపడ్డ కొత్త నీటిలో తన ప్రతిబింబం తో ఆడుకోవాలని ఆరాటపడ్డాడు. కానీ పగటి సోయగాల హొయలు చూడనివ్వకుండా సాయం సంధ్యా రాణి తన ఎర్రని పమిట చెరగు తో అతడిని కప్పివేసింది... అయినా భయమేం లేదు సుమా ... అంటూ తన తెల్లని చీరలోంచి సూర్యకాంతిని చంద్రునిపై పడేట్లుగా ప్రసరింపజేసింది. అప్పటినుంచీ అందమైన చంద్రుడు వెన్నెల దీపాల్ని వెలిగిస్తూనే ఉన్నాడు నిత్యం....!

1 comment:

swamy said...

బావుంది అచ్చతెలుగు ఆడపడుచు గారు...