Thursday 23 October 2008

ఆవకాయ పురాణం.

పప్పుసుద్ద ప్రదీపు గారి సోది చదివాక, దానికి జంట గురించి రాయక పోతే, ఆవకాయ నన్ను జన్మలో క్షమించదు అని వెంటనే రాసేస్తున్నా.

గోంగూర ఆంధ్ర మాత అయితే, ఆవకాయ ఆంధ్ర పిత.

ఆంధ్రులంటేనే ఆవకాయ, ఆవకాయ అంటే ఆంధ్రులు.. అని అక్షరమాల లో కూడా "అ" - అమ్మ. "ఆ" - ఆవకాయ అని చెప్పుకునే రీతి లో మన జీవితాలలో పెనవేసుకుపోయిన నిత్య నూతన అరుణ వర్ణం మన అచ్చమైన తెలుగు ఆవకాయ.

ఆవకాయ ని పప్పుతో కలిపి, దానికి కమ్మటి నెయ్యి జోడిస్తే, స్వర్గానికి బెత్తెడు దూరం లో ఉన్నట్లు గా ఉంటుంది. వేడి వేడి అన్నం లో కొత్త ఆవకాయ, కందిపొడి కలిపి మా అమ్మమ్మ పిల్లలందరికీ ముద్దలు కలిపి పెడుతుంటే, ఆహా ... ఏమి రుచి అంటూ లొట్టలు వేసుకుంటూ కుంభాలు కుంభాలు అన్నం లాగించే వాళ్ళం. ఇక వర్షాకాలం లో, కూరగాయలు ఏవీ లేకున్నా, కందిపచ్చడి లొ ఆవకాయ ని మిళితం చేసి ఆరగిస్తే ... ఆ మజాయే వేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మంచి గడ్డ పెరుగన్నం లో ఆవకాయ ముక్క నంచుకుని తింటే, మహదానందంగా ఉంటుంది. ఆవకాయ నంచుకుంటూ, ఎంత రుచి లేని పదార్ధమైనా ఆరగించేయవచ్చు.

చిన్నప్పుడు అన్నం లో ఆవకాయ కలుపుకుని తినేసి, ఆఖరులో కంచం లో చెయ్యి కడిగేటప్పుడు ఆ అవకాయ ముక్కని కూడా కడిగి, తరువాత తీరికగా కూర్చుని ఆ ఊరిన మామిడికాయ ముక్కని కొంచెం కొంచెం గా తిన్న రోజులు మీకందరికీ గుర్తుకొస్తున్నాయా?

ఆవకాయ ఎన్నో కాయలతో పెట్టవచ్చు.. ఉసిరికాయ, దోసకాయ, మునక్కాయ... కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఒక మామిడికాయ ఆవకాయే. మళ్ళీ దానిలోనూ ఎన్నో రకాలు. మామూలు వెల్లుల్లి వేయని ఆవకాయ, వెల్లుల్లి పాయల ఆవకాయ, బెల్లం ఆవకాయ, మామిడి పిందెలతో ఆవకాయ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వెరైటీలు.

ఇక ఆవకాయ ఉపయోగాలా.... చుట్టాలు వచ్చినపుడు జాడీ లోంచి ఆవకాయ తీసి వడ్డిస్తే, ఆ విందు కే ఒక కళ చేకూరుతుంది. ఉప్మా లాంటి చెత్త టిఫిను కూడా, ఆవకాయ నంచుకుంటూ కళ్ళు మూసుకుని తినేయవచ్చు. పిల్లలు పై చదువులకో, ఉద్యోగాలకో వేరే ఊర్లకో / విదేశాలకో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చి పంపించవచ్చు.

ఆవకాయ తినడం సరే, అది పెట్టడమూ ఒక పెద్ద కళే. ఆ విషయం లో 100 % నిష్ణాతురాలు మా అమ్మమ్మ. ఇప్పుడు మా అమ్మ ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. ఊరగాయలు పెట్టేటప్పుడు పిల్లలందరికీ పెద్ద పండుగ. కాయల్ని ఎంపిక చేసుకోవడానికి మార్కెట్ వెళ్ళడం దగ్గరినుంచీ అన్నీ మాకు పనులే. ఒక్కో చోటా మామిడి కాయల్ని రుచి చూసుకుంటూ వెళ్ళి, బాగా పుల్ల్................ల్లగా ఉన్న కాయల్ని సెలక్ట్ చెయ్యాలి. అక్కడ పిల్లలందరికీ భలే పోటీ. మొత్తానికి ఆ పని అయిపోయాక కాయలు కొనేసి, అక్కడే ముక్కలు కొట్టించేవాళ్ళం. ముక్కలు కొట్టే చోట కాయల్ని, ముక్కల్నీ పని వాళ్ళెవరూ కొట్టెయ్యకుండా కాపలా కాయడం మా పని. ఫుల్లు గా నిఘా పెట్టేవాళ్ళం. ఇక మార్కెట్ నించీ ఇంటికి వచ్చాక ఆ ముక్కల్ని శుభ్రం చెయ్యడం మరొక పెద్ద పని. ఒక పెద్ద చాపనిండా మామిడికాయ ముక్కలు గుట్టగా పోసి, చుట్టూరూ మేము మెత్తటి నూలు గుడ్డ పెట్టుకుని, ముక్కల్ని చెమ్మ, దుమ్ము లేకుందా తుడిచి, టెంక లేని ముక్కల్ని అన్నిటినీ తీసి వేరు చేసి, టెంక ఉన్న ముక్కల్లో, టెంక పైన పల్చటి పొర కాని, జీడి కానీ ఉంటే, అదంతా వలిచేసి, మంచి ముక్కలన్నీ పక్కకి తీసి పెట్టేవాళ్ళం. మా అమ్మ టెంక లేని ముక్కల్ని కొన్ని మాకు తినడానికి ఇచ్చి మిగతావి వృధా కాకుండా ముక్కల పచ్చడి పెట్టేసేది. ఇప్పుడంటే బజారు లో ఆవపిండి దొరుకుతోంది కానీ మా చిన్నప్పుడు, మంచి ఆవాలు తెచ్చి మిషను పట్టించే వాళ్ళు. ఆవపిండి నిలవ ఉంటే, చేదు ఎక్కుతుంది. అందుకని ముక్కలు తెచ్చిన రోజే ఆవాలు, మిరపకాయలు మిషను లో ఆడించి పెట్టుకునేవాళ్ళు. నూనె, పసుపు, మెత్తటి ఉప్పు, పొడి చేసిన ఇంగువ, మెంతులు, పచ్చి శెనగలు అన్నీ సిధ్ధం గా ఉంచుకొని ఆవకాయ కలిపే వాళ్ళు. మాకు అప్పుడు పనేమీ లేకున్నా, చూడాలని చుట్టూ చేరేవాళ్ళం.

మా అమ్మమ్మ ముందు చేతులకి బాగా నూనె పట్టించేది, ఊరగాయ కలిపేటప్పుడు కారం వల్ల చేతులు మండకుండా ఉండటానికి! ఒక వెడల్పాటి పాత్ర లో నూనె, ఆవకాయముక్కలు తప్ప మిగతా అన్ని దినుసులూ బాగా కలిపి, మరో గిన్నె లో నూనె పోసి, దానిలో ఒక రెండు, మూడు దోసిళ్ళ నిండా ముక్కలు వేసి, నూనెలో తడిపిన ముక్కలని మళ్ళీ కారం మొదలైన దినుసులు కలగలిసిన పొడి లో మా అమ్మ వేస్తూ ఉంటే, ఆ ముక్కలకి పొడినంతా పట్టించి జాడీలో వేస్తూ ఉండేది. మధ్య మధ్యలో, జాడీలోని ముక్కలపై కూడా నూనె పోస్తూ ఉండేది. అలా ముక్కలన్నీ ఊరడానికి జాడీ లో నింపి పెట్టాక, ఆవకాయకలిపిన వెడల్పాటి పాత్రలో మిగిలిన నూనె కలిపిన తాజా "ఆవకారం" లో మా అమ్మమ్మ అన్నం కలిపి అందరికీ ముద్దలు పెట్టేది. అలా కారం లో మమకారం కలిసిన ఆవకాయ సంవత్సరమంతా మమ్మల్ని ఊరిస్తూనే ఉండేది.

నవకాయ పిండివంటలు ఉన్నా, తెలుగు వారి భోజనం అనగానే, "ఆవకాయ" తప్పక గుర్తుకు వచ్చి, నోరు ఊరిపోయి, మన జిహ్వ గ్రంధులన్నీ ఆవకాయ ఊట ఉత్పత్తి చేస్తాయి.

ఇవన్నియు వివరించుటేల? ఆవకాయ గాధను వందలాది సంవత్సరములకైననూ ఆది శేషుడు సైతము చెప్పజాలడు. ఇక మందమతి యగు నేనేమి చెప్పగలను? ఇందుమూలముగా యావత్ బ్లాగరులకి చెప్పునదేమనగా, ఈ ఆవకాయ పురాణం చదివినవారికి, చదివేవారికి, చదవబోయేవారందరికీ కూడా ఆవకాయ మాహాత్మ్య వశమున ఇహలోకమున మహా భోజన సుఖమును అనుభవించి, అంత్య కాలమున మోక్షమును పొందగలరు.

ఓం తత్సత్.

ఆవకాయ జాడీకీ జై.

సర్వం ఆవకాయార్పణమస్తు.

శుభం ఆవకాయాత్.

మీ అందరి ఇళ్ళల్లో తెలుగు వారి ఇలవేలుపు అయిన ఆవకాయ జాడీ నిత్యమూ కొలువుండాలని కోరుకుంటూ,

---మీ విరజాజి.

11 comments:

జ్యోతి said...

hmm.

నాకు ఈ టపా మొదలుపెట్టగానే నోరూరుతుంది. వెళ్లి అన్నంలో ఆవకాయ కలుపుకుని తినాలి. మిగతాది రేపు తీరిగ్గా చదువుతాను.. కాస్త ఆవకాయ బొమ్మ పెట్టండి. కళ్లకు ఇంఫుగా ఇంకాస్త నోరూరేలా ఉంటుంది. ’
గూగులమ్మని అడగండి..

ప్రదీపు said...

మీ పోస్టు సూపరు, కానీ నన్ను పప్పుసుద్దను చేసేసారు... అయినా పర్వాలేదులేండి పప్పుసుద్ద అనేగా అంది.

... కొంచెం కొంచెం గా తిన్న రోజులు మీకందరికీ గుర్తుకొస్తున్నాయా? చాలా బాగా గుర్తొచ్చాయి!

జ్యోతిగారు చెప్పినట్లు ఎర్ర్...రటి ఆవకాయ ఫొటో ఒకదానిని పెట్టండి బాగుంటుంది.

ఎంతయినా పప్పు, ఆవకాయ మరియూ నెయ్యి కలుపుకుంటే వచ్చే రుచి ఇంకా దేనికీ రాదు.

విరజాజి said...

@ జ్యోతి గారూ, చదివినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పినట్లు మంచి బొమ్మ పెట్టాను. అయినా మీ "షడ్రుచుల" ముందు నా చిన్న టపా ఎంత?

@ ప్రదీప్ గారూ, మిమ్మల్ని పప్పుసుద్ద చేసేంత ధైర్యం యెవరికి ఉందండీ? మీ టపా ఇన్స్పిరేషన్ తో మిమ్మల్ని అలా సంబొధించాను అంతే.. (సిరివెన్నెల సీతారామ శాస్త్రి లా మీరు పప్పుసుద్ద ప్రదీప్ అన్నమాట..!!)

Rajendra Devarapalli said...

ఇది చాలా అన్యాయమని బండారు దత్తాత్రేయ టైపులో ఖండిస్తున్నా నధ్యక్షా,అసలే ఆవకాయ జాడీని అటకెక్కించి,మాకు జాడీలే లేండి,సీసాలు చాలవు,అమ్మయ్య అని రానున్న(అసలు వస్తుందో రాదో తెలీట్లా ఈ ఎండలదెబ్బకు)శీతాకాలానికోసం దాచిపెట్టుంచితే,మరలా మీరు ఇలా ఊరించటం దారుణమని తెలియ జేస్ కుంటూ..మా ఆవిడ బ్లాగులు చదవదు కాబట్టి సరిపొయింది కానీ లేకపోతే ఇంకేమన్నా ఉందా?
ఇంతటి కమ్మని టపా రాస్తూ మధ్య "ఉప్మా లాంటి చెత్త టిఫిను కూడా,.."అంటూ ఈ అమంగళపు మాటలేమిటండీ ??
అసలా ఉప్మా ప్రస్తావనే మరలా తీసుకురావద్దనీ తమరి ద్వారా యావత్ బ్లాగరు లందరికీ తెలియ జేస్ కుంటూ...

durgeswara said...

meelaamTi abhimaanulunnamtakaalam aavakaaya chiramjeeve. daaniki tirugulEdu.


amma mail address dorakaka ikkaDa vraastunnaanu. ee yajnamulO meeru mee snehitulamtaa paalupamchukovaalani naa korika.

యామజాల సుధాకర్ said...

చాలా అన్యాయం జరిగిపోయిందండి, ఈ పోస్ట్ ని ఇన్ని రోజుల తర్వాత చూసాను.

అందరికీ శీఘ్రమేవ ఒక పే...ద్ద ఆవకాయ జాడీ ప్రాప్తిరస్తు.

Unknown said...

hello mee avakaya bagundi....

Unknown said...

మీలో అవకాయ నాలెడ్జి బాగనె ఉంది మీ ఆవకాయ మా బుర్ర ]లొ దింపిననదుకు థంక్స్

Saahitya Abhimaani said...

విరజాజిగారూ,

చాలా బాగున్నది మీ ఆవకాయోపాఖ్యానం. తెలుగులో ప్రస్తుతం ఉన్న బ్లాగులు చదువుతుంటే అనిపిస్తోంది, మన పత్రికల నిరక్షరాస్య ఉప సంపాదకుల చేతుల్లో పడి ఎంత నష్టపొయ్యాయో అని. ఈ బ్లాగుల్లో వ్రాసిన అద్భుత విషయాలు ఏ ఉపసంపాదకుడిని అలరిస్తాయి (సాహిత్యాభిమానులను తప్ప)!!ఇటువంటి బ్లాగు అవకాశం 1950 1960-70లలో ఉండి ఉంటే ఎన్ని ఆఆణిముత్యాలు మనకు దొరికేవో కదా.

మీరు ఆవకాయ మీద వ్రాసిని చిన్న వ్యాసం చూసినాక తెలుగు వికీలో కూడ కొంతమంది ఈ దిశగా కొంత కృషి జరిపిన సంగతి గమనించి మీకు ఆ లంకే అంద చేస్తున్నాను:

http://te.wikipedia.org/wiki/%E0%B0%8A%E0%B0%B0%E0%B0%97%E0%B0%BE%E0%B0%AF

అక్కడ వారు ఊరగాయ అన్న పెద్ద విషయం తీసుకును తంటాలు పడుతున్నారు. మీరు కూడ దయచేసి తెలుగు వికీలోకి వెళ్ళి ఆవకాయ గురించి సమగ్రంగా వ్రాయగలరు. ఈ విషయంలో మన ప్రదీప్ గారు (వారు వికీ సభ్యులు కాబట్టి)తగిన సూచనలు/సలహాలు ఇవ్వగలరు.

శివరామప్రసాదు కప్పగంతు

Saahitya Abhimaani said...

విరజాజిగారూ,

చాలా బాగున్నది మీ ఆవకాయోపాఖ్యానం. తెలుగులో ప్రస్తుతం ఉన్న బ్లాగులు చదువుతుంటే అనిపిస్తోంది, మన పత్రికల నిరక్షరాస్య ఉప సంపాదకుల చేతుల్లో పడి ఎంత నష్టపొయ్యాయో అని. ఈ బ్లాగుల్లో వ్రాసిన అద్భుత విషయాలు ఏ ఉపసంపాదకుడిని అలరిస్తాయి (సాహిత్యాభిమానులను తప్ప)!!ఇటువంటి బ్లాగు అవకాశం 1950 1960-70లలో ఉండి ఉంటే ఎన్ని ఆఆణిముత్యాలు మనకు దొరికేవో కదా.

మీరు ఆవకాయ మీద వ్రాసిని చిన్న వ్యాసం చూసినాక తెలుగు వికీలో కూడ కొంతమంది ఈ దిశగా కొంత కృషి జరిపిన సంగతి గమనించి మీకు ఆ లంకే అంద చేస్తున్నాను:

http://te.wikipedia.org/wiki/%E0%B0%8A%E0%B0%B0%E0%B0%97%E0%B0%BE%E0%B0%AF

అక్కడ వారు ఊరగాయ అన్న పెద్ద విషయం తీసుకును తంటాలు పడుతున్నారు. మీరు కూడ దయచేసి తెలుగు వికీలోకి వెళ్ళి ఆవకాయ గురించి సమగ్రంగా వ్రాయగలరు. ఈ విషయంలో మన ప్రదీప్ గారు (వారు వికీ సభ్యులు కాబట్టి)తగిన సూచనలు/సలహాలు ఇవ్వగలరు.

శివరామప్రసాదు కప్పగంతు

మరువం ఉష said...

ఆవకాయకి నేనూ బానిసనేనండి. నిజానికి నా ముక్క పెరుగన్నంలో తినేసి, మా అమ్మగారిది తర్వాత గం లా నమలటానికి కొట్టేసేదాన్ని.మా ఆవకాయ నిండా వెల్లుల్లి వూరిస్తూవుంటుంది.