

కదలకుండా నవ్వుతూ నిలబడ్డ మేమే ఈ ఊరికి అందమని సంతోషంతో తల మునకలయ్యే వాళ్ళం. మా పక్కనే పచ్చదనం. మా నీడన వెచ్చదనం. మా లోపల కఱకుదనం. మా మనసున మెత్తదనం. ఈ ఊరిని మేము అలంకరించేశం...! మాపై ఒక నవాబు అందమైన కోట కట్టాడు. మమ్మల్ని కలుపుతూ కోటగోడ కట్టాడు. మా సాయంతో పెద్ద బుఱుజులు కట్టాడు. మా పైకి ఎక్కడానికి శత్రువులు భయపడేవారు. మా కోట చరిత్ర వింటూ ప్రజలు తన్మయులయ్యేవారు.
చిన్నగా మనుషులు మారుతున్నారు. ఊరు పెద్దదవుతోంది. ఆహా నా ఊరు పెరుగుతోంది అని సంతోషిస్తున్నాము. కానీ మా సంతోషం ఎక్కువగా నిలవలేదు. మాపైన చిత్ర విచిత్ర భవంతులు వెలిసాయి. మాపై ఇళ్ళు కట్టడానికి కొద్ది కొద్దిగా మమ్మల్ని కరగించి వేశారు. ఊరిలో మనుషులు పెరిగారు - కానీ మా సంఖ్య తగ్గి చెఱువుల్లోకి నీళ్ళు చేరవేసే దారి లేక నీళ్ళు తగ్గాయి. చెరువుల్లో నీరు తగ్గితే - భూజలాల మట్టం తగ్గింది. చిన్న చిన్నగా చెఱువులు మాయమయ్యాయి - భూజలాలు పాతాళానికి పోయాయి. మరో పక్క చూస్తే మా పెద్దన్నలని నిలువునా ముక్కలు చేసి, ఆకాశ హర్మ్యాలు వెలుస్తున్నాయి.
మా బంధువర్గమంతా నిలువునా నిలబడలేక, ముక్కలు ముక్కలై, దిక్కులేని చావు చస్తున్నారు. మాతో అందాన్ని, అనుబంధాన్ని పెంచుకున్న ఊరు - మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతూంటే -మారు మాట్లాడకుండా ఒఱిగిపోతున్నాం. వేల సంవత్సరాల మా ఆయుష్షు ముగిసి - చివరికి మా ఊరి ఇళ్ళకి పునాదులౌతున్నాం. ప్రకృతి మాత మమ్మల్ని చూసి దుఃఖిస్తోంటే - నిశ్శబ్దంగా మలిగిపోతున్నాం. కానీ నాటికీ, నేటికీ ఒక్క మాట నిజం ! మావల్లే ఈ ఊరికి ఎనలేని అందం!
6 comments:
హ్మ్! చాల బాగా రాసారు .
నాకిలాంటి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. ఇండియాలో వున్నప్పుడు ఇటువంటి కొండలను వెతుక్కొని ఎక్కేవాళ్లం.
kondalu bandalayye lopala mana hrudayaalalo aa prakruthini nikshiptam cheddamu.mana chetilo vundedi idokkate.
మీ కెమేరా కళ్ళు చాలా బాగున్నాయి.. :-)
బాగా రాశారు . ఫొటోలు బాగున్నాయి .
Post a Comment