Thursday, 2 April 2009

చిన్నారి సీతా-రాముల పెండ్లి

శ్రీ రామచంద్రుని పెండ్లి వేడుక నేడు - అరసి శ్రీ రామ నవమి యదె నేడు
సిరుల మిధిలా పురి మురిసె చూడు - అల సొంపైన పెండ్లి వేదిక యదె చూడు
.
ముక్కంటి విల్లు విరిచె విలుకాడు - పెండ్లి కొడుకై అమరె సీతమ్మకీనాడు
మొలకనవ్వుల ముద్దు మోమున్న ఱేడు - పొరలే నవ్వుల తల్లికి మొగడౌను నేడు
.
మల్లె పూల జడ నడుమన చామంతి బిళ్ళ - తాకింది తాళి కట్టే రాముని వ్రేళ్ళ
ఎల్లకాలము సీతమ్మ మేను వీడక - చూడామణి నిలిపేను రామ స్పర్శా వీచిక
.
తలబ్రాలు పోసుకున్న దోసిళ్ళు - అన్యోన్య దాంపత్యానికి ఆనవాళ్ళు
తలపుల వలపుల పెళ్ళి పందిళ్ళు - అలవికాని ఆనందాల సందళ్ళు
.
చీరసారెలతోను చిరకాలమగు పెండ్లి - చిరు ఆశల నెరవేర్చు పెండ్లి
చింతలన్నియు పారద్రోలు పెండ్లి - చిన్నారి సీతా-రాముల పెండ్లి !

1 comment:

Sanath Sripathi said...

మల్లెల లాంటి సొబగైన మంచి పదాలతో అల్లిన పూమాలలా ఉంది మీ కవిత.

ఇంట్లో రాముడి పెళ్ళి చేసుకునేవారు ఏర్పాట్లు చేసునేటప్పుడు మనసుకి తట్టే చిన్ని చిన్ని విశేషాల తో కూర్పు చేయటం చాలా అందం గా ఉంది.