రామార్పణం !
ఎవరైనా నమస్కారం పెడితే తాతయ్య రామార్పణం అనేవారు ! తాతయ్యే తాతయ్య ! బలే తాతయ్య. తానే తల్లీ తండ్రీ అయ్యి పిల్లలని పెంచిన మా బంగారు తాతయ్య ! ఎప్పుడూ మల్లె పువ్వుల్లాటి తెల్లటి బట్టలు వేసుకుని అలాగే పువ్వులా నవ్వులు చిందిస్తూ ఉండే తాతయ్య! తెలుగుతనం ఉట్టి పడేలా పంచెకట్టి, చొక్కా వేసుకుని, నుదుటన నిలువు బొట్టు పెట్టి నడుస్తూ ఉంటే, ఆహా ఏమి అందం ! మా తాతయ్యలాటి "స్మార్ట్" తాతయ్య ఇంకెవ్వరికీ లేరనే అనిపించేది ! మామూలుగా ఆఫీసుకి, బయటకి వెళ్ళేడపుడు పాంటూ , షర్టూ వేసుకున్నా, పండగలకీ, పూజలకీ, పెళ్ళిళ్ళకీ పంచె మాత్రమే కట్టుకునే మా ముద్దుల తాతయ్య ! అమ్మమ్మని మాత్రమే "ఏమే" అని పిలిచేవారు తప్పిస్తే మమ్మల్నెవరినీ పొరపాటున కూడా పిలుపులోనైనా పరుషత్వం చూపని మా మంచి తాతయ్య! ప్రేమ, అభిమానం, ఆప్యాయత అంటే నిర్వచనంగా మమ్మల్ని అపురూపంగా చూసుకొని, మా చిన్న చిన్న ఇష్టాలని కూడా మరచిపోకుండా మాకోసం అన్నీ చేసే మా తాతయ్య ! తాను భోంచేస్తూ, పచ్చడి అన్నం కలపంగానే, మరి కాస్త నెయ్యి ఎక్కువ వేసి, ఇదిగో నీ ముద్ద అంటూ నోట్లో పెట్టే మా ప్రియమైన తాతయ్య !
నా చిన్నప్పుడు నాకు తాతయ్య అంటే ఎంత ఇష్టం అంటే, ఏమి తోచకపోతే, "తాతయ్య", "తాతయ్య" అంటూ తాతయ్య జపం చేసేదాన్ని. నేను చిన్నగా ఉన్నపుడే మా అమ్మమ్మ తాతయ్యల దగ్గరకి వెళ్ళిపోయాను, ఆయన రెటైర్ అయ్యేదాకా ఆయన దగ్గరే ఉన్నాను. ఆ తరువాత మా ఇంటికే వాళ్లు వచ్చేసారు (మా అమ్మ కి అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ ఎవరూ లేరు). ఆ చిన్న వయసులో అమ్మమ్మ తాతయ్యలే నాకు అమ్మా నాన్నలైనారు. తన గుండెల మీద పెట్టుకొని తాతయ్య నన్ను పెంచారు. శిరీష అని పేరుతో అందరూ పిలిచినా, తాతయ్య మాత్రం "సిరి తల్లీ" అని పిలిచేవారు. పొద్దున్నే నిద్ర లెపడానికైనా, అమ్మా, సిరి తల్లీ, లేమ్మా అని పిలిచేవాళ్ళే గానీ, ఒక్క రోజు కూడా నన్ను తిట్టేవారు కాదు. దాదాపు 8 ఏళ్ళ వయసు వచ్చే వరకూ తాతయ్య దగ్గరే పడుకునేదాన్ని. ఆ తర్వాత నా స్థానం మా చిన్న తమ్ముడు కొట్టేశాడు. నేనూ వాడూ తాతయ్య పక్కన పడుకోడానికి రోజూ కొట్టుకునేవాళ్ళం. నీవు పెద్ద పిల్లవి అయిపోతున్నావు - అని అరిచి అమ్మ వాడిని పడుకోపెట్టేది. ఏంచెస్తాను, ఇక అమ్మమ్మ దగ్గర పడుకొని సరిపెట్టుకునేదాన్ని. నా పెళ్ళి అయ్యేంతవరకూ అమ్మమ్మ పక్కనే పడుకున్నా !
నా చదువు గుఱించీ, ఉద్యోగం గుఱించీ తాతయ్య ఎంత తపన పడ్డారో గుర్తొస్తే, ఇప్పటికీ కళ్ళు చెమరుస్తాయి. పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి చదువుకోడానికి నేను కాలేజీలో చేరితే, రోజూ రాత్రి 9 వరకూ నాకోసం కాలేజీలో కాచుకుని ఉండి, బస్సులో నాతోపాటు ఇంటికి వచ్చేవారు. మీరు బస్ స్టాపు లో ఉంటే చాలులే తాతయ్య అన్నా వినిపించుకునే వారు కాదు. మేమిద్దరమే జంటగా చాలా చోట్లకి వెళ్ళేవాళ్ళం. ఆయన తన స్నేహితుల ఇళ్ళకి వెళ్ళాలంటే ఒక్కరూ ఈ సిటీలో బస్సుల్లో వెళ్ళడం బోరు కదా...అని చెప్పి, నన్ను కూడా తోడు తీసుకెళ్ళేవారు. ఆడపిల్లవైనా నీవు దేనిలోనూ వెనకబడకూడదు. బాగా చదవాలి, మంచి ఉద్యోగం చేయ్యాలి అంటూ, వెన్ను తట్టి ప్రోత్సహించేవారు. ఈరోజు నేనిలా ఉన్నానంటే కారణం మా తాతయ్య చెప్పిన ధైర్యమే!
నలుగురికీ సహాయం చెయ్యాలని చెప్పడమే కాదు, ఆయన అది చేసి చూపారు. బావమఱదుల్ని ప్రేమగా చూసిన బావగారిని ఈయననే చూసాను. వాళ్ళ బావమఱదులంతా ఈయనని తండ్రి లా గౌరవించేవారు. తమ్ముడి పిల్లలకి సాయం చేసారు. చెల్లెలి పిల్లల్ని ఇంట్లో ఉంచుకుని ఉద్యోగం ఇప్పించి, పెళ్ళిళ్ళు చేసి ఆదుకున్నారు. మరదలు కూతుర్లని తన కూతుర్ల లాగా చూసుకున్నారు. పిల్లనిచ్చిన అల్లుడిని స్వంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు (పాపం - మా నాన్న కూడా అలాగే తాతయ్యని బాగా చూసుకున్నారు)
నేను కులాంతర వివాహం చేసుకున్నానని నన్ను మా నాన్న ముఖం కూడా చూడకుండా వదిలేసినా, మా తాతయ్య అర్ధం చేసుకుని, నాకు కొండంత మానసిక బలాన్ని ఇచ్చారు. నా పైనే కాదు, మావారి పైన కూడా అప్యాయతానురాగాల్ని వర్షించారు. బ్రతికినన్నాళ్ళూ సంకుచిత భావాలకి దూరంగా, కుల/మతాలకి అతీతంగా అందరికీ సహాయం చేసి, నిజాయితీగా బ్రతుకుతూ, ఒకరినుంచీ ఏమీ ఆశించకుండా, తన జీవితాన్నంతా ఇతరుల కోసం అలోచించారు ! అమ్మమ్మ పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటే, ఎవ్వరినీ బాధ పెట్టకుండా ఉండడమే దేవుడికి పెద్ద పూజ అనేవారు ! చిత్రం ఏమిటంటే, ఆ పుణ్య దంపతులు ఇద్దరూ కూడబలుక్కున్నట్లుగా - కిందటి ఏడాదే (2008 లో)అమ్మమ్మ మార్చిలోనూ, తాతయ్య ఏప్రిల్ లోనూ దైవ సన్నిధానానికి చేరుకున్నారు. ఏ లోకాన ఉన్నా, తాతయ్య నన్నూ, నా తమ్ముళ్ళనీ ఆశీర్వదిస్తూనే ఉంటారు ! అవును.....మా తాతయ్య వరాల తాతయ్య !
తాతయ్యా ! ఈ రోజు మీ పుట్టినరోజు, పొద్దుటినుంచీ మీరే గుర్తుకి వస్తున్నారు.... కలలో అయినా కనిపించండి. మీరు తప్ప నాకెవ్వరూ లేరు. మిమ్మల్ని చూడాలని ఉంది !
మీలో ఎవ్వరికైనా ఆకాశ వీధిలో తళుకుమనే నక్షత్రమై మా తాతయ్య కనిపిస్తే పై మాటలన్నీ చెప్పరూ !
5 comments:
chala baga rasaru
"ఎవ్వరినీ బాధ పెట్టకుండా ఉండడమే దేవుడికి పెద్ద పూజ అనేవారు "...... .ee oka mukka chala ayyana enta Goppamanisho Teliyadanki.
U r so lucky.
ఉరుకుల పరుగుల జీవితం లో, చల్లనైన పలుకు, ఆప్యాయత తో కూడిన పలకరింపు ఉంటే ఎంత సుఖం ఉంటుందో.. కళ్ళకి కట్టినట్టు వర్ణించారు.
'మనసున మనసై' అని ఒకరెందరితో నైనా ఉండచ్చు అని నదిచి చూపించినట్టు ఆయన ని గూర్చిన కొద్ది మాటల్లో నే వ్యక్తమౌతోంది.
దానిని గ్రహించడం, గురుతెరిగి ఉండడం.. మీ అదృష్టం, చదవటం మాకు ఆనంద దాయకం...
మన తరాలకి అవసరమైనదీ, మన తర్వాతి తరాలకి అందివ్వ వలసినదీ అయిన సంపదల లో ఇది ముఖ్యమైనదని మరల ప్రస్ఫుటమయ్యింది.. మీ 'స్వ'గతం, 'స్వ' భావం చదివిన తర్వాత
- సనత్ కుమార్
vlak గారూ, Sanath Sripathi గారూ
దన్యవాదాలండీ !
తాతయ్య లాటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఆయన గురించి రాయగలగడం నా అదృష్టం.... ఆయనతో గడిపిన ప్రతీ ఒక్క క్షణాన్నీ రాయలేను కానీ... ఆయన నాకు తాత కాక తండ్రి అయి ఉంటే, జీవితంలో మరింత సాధించేదాన్ని అనిపిస్తూ ఉంటుంది.
ఈ సందర్భంగా - ప్రేమగా మనుషుల్ని చూడడం, ఎదుటి వారు ఎంత తప్పు చేసిన క్ష్మించడం నేర్పిన తాతయ్యకు, అమ్మమ్మకు, నాయనమ్మకు నా బ్లాగు ముఖంగా కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నా, వారిని ఈ రకంగా నైనా స్మరించుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నా...!
wow. Beautiful.
నాక్కూడా మాతాతయ్యంటే చాలా ఇష్టం.
మీ తాతగారి గురించి గానీ, ఇతర పెద్దలను గురించి గానీ ఏవైనా ప్రత్యేక సంఘటనలు రాయండి మీకు బాగా గుర్తున్నవి.
it moved me !!
Post a Comment