Monday, 25 August 2008

ఎడతెగని రాత్రి.

చిన్నపుడూ నిద్ర పట్టలేదు.... ఇప్పుడూ నిద్ర పట్టట్లేదు...... కానీ రెండిటికీ ఎంత తేడా!! వేసవిలో మండే పగటి తాపాన్ని తీర్చుకోడానికి ఆరుబయట మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళం. ఆ రాత్రి పూట పది గంటలు దాటితే గాని కాస్తంత చల్ల గాలి వీచేది కాదు... ఒక రాత్రిలో మెలకువ వచ్చి చూస్తే, ఎదురుగా ఉన్నా కొబ్బరాకుల సందులోనించి తొంగి చూస్తూ చందమామ నవ్వుతూ కనిపించే వాడు. ఆ సమయం లో "రాత్రి రాణి" పూల ఘుమఘుమలు మా పక్కింటి నుంచి గాలిలో తేలి వచ్చేవి. మళ్ళీ నిద్రపోతే ఆ సంతోషమంతా ఎక్కడ పోతుందో అని, ఊరికే పడుకొని, ఆకాశంలోకి చూస్తూ, చుక్కలతో చెప్పుకున్న కబురులన్నీ గురుతు వస్తే, ఎనలేని బాధ కలుగుతూ ఉంది. ఇప్పుడు,...., ఇల్లు ఇరుకు... మనసులూ ఇరుకు. పైనా మనది కాదు, కిందా మనది కాని త్రిశంకు స్వర్గం (ఏది ఎలా ఉన్నా, ఇల్లే కదా స్వర్గ సీమ !!) లో, పగలూ, రాత్రీ, తేడా తెలీని పని తో సతమతం అయిపోతూ, పిల్లలని కూడా మనతో పాటు గా, కాలికి మట్టి అంటకుండా పెంచుకుంటూ, వాళ్ళకి చందమామని కిటికీ లోంచి చూపిస్తూ (ఏ బహుళ అంతస్తుల భవంతీ అడ్డం రాకుంటే), ఒక్కోసారి ఆ చిన్న కిటికీ తలుపులనీ మన మనసుల్లా ఏ దారీ లేకుండా మూసేసుకుని, ఉక్కిరిబిక్కిరి అయిపోతూ, ఆ చిరాకు ఎవరి మీద ప్రదర్శించాలో తెలీక, పడుకున్న నిద్ర పట్టక, మెత్తటి స్పాంజి పరుపులపై కూడా పక్క కుదరక, రాత్రంతా దొర్లుతూ, మళ్ళీ పొద్దున్నే, అదే నిద్ర మొహం తో ఉద్యోగాలకి తయారవుతూ, యంత్రాల్లా ... ఏదో ఒకలా బతుకుతూనే ఉన్నాం.

1 comment:

cbrao said...

సంజీవదేవ్ అంటారు " Optimism is life, Pessimism is death." ఆనందంగా జీవించటం ఒక కళ. చుట్టూ అననుకూల పరిస్థితులున్నా, జీవితాన్ని ఆనందించటాన్ని నేర్చుకోవాలి. రాత్రి నిదురించే ముందు, నీళ్లలో Eau de Cologne కొన్ని చుక్కలు వేసుకొని స్నానం చెయ్యండి. మీ పడకగదిని కళాత్మకంగా తీర్చి దిద్దండి. గులాబి వాసనలొచ్చే, అగర్బత్తులు వెలిగించండి. టేప్ రికార్డర్లో మీ కిష్టమైన సంగీతం వింటూ నిద్రకుపక్రమించండి. చక్కటి నిద్ర మీ స్వంతం. Sound sleep మీ స్వంతం కావాలంటే, ప్రతి రోజూ ఉదయం కనీసం 30 నిమిషాల నడక చాలా అవసరం. ఇది మీ శరీరాన్ని చక్కటి ఆకృతి లో ఉంచటానికి దోహదపడుతుంది. ప్రతి గంటకూ ఒక గ్లాసు నీరు తాగండి. రోజూ ఆకు కూరలు, మొలకెత్తిన గింజలు, పళ్లు మీ అహారంలో ఉండేలా చూసుకోండి. మితాహారం తో ఆరోగ్యం మీ సొంతం. ఇంకో ముఖ్యమైన విషయం Early to bed, Early to rise, మీరు ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగటానికి అమృతంలా పని చేస్తుంది. ఆచరించండి. మీ జీవితం మూడు పువ్వులు, ఆరు టపాలుగా వర్ధిల్లుతుంది. ఆయుష్మాన్ భవా!